ఈమధ్య కాలంలో ఏ పాటకూ రానన్ని విమర్శలు ‘పెద్ది’ సినిమాలోని ‘హెల్లో..’ అనే ఐటెమ్ పాటకు వచ్చాయి. అనంత శ్రీరామ్ రాసిన పాట ఇది. ‘వారానికి వెయ్యి.. నా కోసం దాయి.. నెలకోసారైనా చూపిస్తా ఈ హాయి’ అనే మాటలు, వాటి చుట్టూ నడిచిన రచ్చ అంతా ఇంతా కాదు. దీనిపై అనంత శ్రీరామ్ కూడా స్పందించారు. ‘ఐటెమ్ పాటని ఐటెమ్ పాటగా చూడనివాళ్లే నిజమైన ఐటెమ్ గాళ్లు’ అంటూ ఘాటుగానే సమాధానం ఇచ్చారు. అయితే.. ప్రేక్షకుల్ని, వాళ్ల స్పందనని తప్పుబట్టడం, ఇలా పబ్లిగ్గా విమర్శించడంపై కూడా అనంత శ్రీరామ్ ని మరింత టార్గెట్ చేసేలా ప్రేరేపించాయి. దీనిపై మళ్లీ స్పందించారు అనంత శ్రీరామ్. ఓ ఇంటర్వ్యూలో సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న దాడి గురించి మరోసారి నోరు విప్పారు. ”జియో వచ్చిన తరవాత డేటా మరింత ఫ్రీ అయిపోయింది. వాక్ స్వాతంత్య్రం కాస్తా.. వాగే స్వాతంత్య్రం గా మారిపోయింది. అందుకే.. సోషల్ మీడియాలో ఈ విమర్శల దాడి” అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఇది వరకు ‘వరుడు కావలెను’ సినిమాలోనూ దిగు దిగు నాథ అనే పాట రాసినప్పుడు కూడా అనంత శ్రీరామ్ పై ఇలానే విమర్శలు చేశారు. దాంతో.. కావాలనే అనంత శ్రీరామ్ ని టార్గెట్ చేశారన్న మాట గట్టిగా వినిపిస్తోంది. నిజానికి.. ‘పెద్ది’ పాటలో పెద్ద పెద్ద బూతులేం లేవు. అంతకు మించిన బూతులు ఇది వరకు చాలానే వచ్చాయి. అవన్నీ హిట్ పాటలుగా చలామణీ అయిపోయాయి. వేటూరి దగ్గర్నుంచి భాస్కర భట్ల వరకూ చాలామంది కవులు సందర్భానుసారం శృంగారాన్ని దట్టించారు. కొన్నిసార్లు అవి హద్దు దాటాయి కూడా. అప్పుడేం ఇన్ని విమర్శలు రాలేదు. ఐటెమ్ పాట అనగానే అంగాంగ వర్ణన చాలా సాధారణం అనిపిస్తుంది. అయితే ‘పెద్ది’ పాటలో అలాంటి వర్ణనలేం లేవు కూడా. అయినా అనంత శ్రీరామ్ టార్గెట్ అయ్యాడు.
ఈ చర్చలో మరో కోణం కూడా ఉంది. అనంత శ్రీరామ్ సనాతన ధర్మం గురించి ఎక్కువగా మాట్లాడుతుంటారు. ‘ఒక్కడు’ సినిమా కోసం సీతారామశాస్త్రి రాసిన పాటని గుర్తు చేస్తూ – సాహిత్యం అంటే ఇదీ, పాటంటే ఇదీ.. ఇలా ప్రజల్ని ఉత్తేజితుల్ని చేయాలి.. అని ఓ సందర్భంలో ఆవేశభరితమైన స్పీచ్ అందించారు. అలాంటి గీత రచయిత పాటలు రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి కదా అనేది సాహిత్యకారుల మాట. ఈ విషయాన్ని అనంత శ్రీరామ్ గుర్తు పెట్టుకోవాల్సిందే. ఇక ముందు ప్రత్యేక గీతాలు రాసేటప్పుడు ఈ రచయిత ఇంకాస్త ప్రత్యేకమైన శ్రద్ద పెడితే ఇలాంటి విమర్శలు వినిపించే అవకాశం ఉండదు.
