ఈటీవీలో జబర్దస్త్ షోకి సెపరేట్ ఫ్యాన్స్ బేస్ ఉంది. ఈటీవీ సంస్థని, మల్లెమాలనీ లాభాల బాట పట్టించిన షో ఇది. ఆ తరవాత ఇదే స్ఫూర్తితో కొన్ని టీవీ ఛానళ్లు కొత్త షోలకు అంకురార్పణ చేశాయి. కానీ ‘జబర్దస్త్’ ధాటికి తట్టుకోలేక.. ఎంత వేగంగా వచ్చాయో, అంతే వేగంగా వెనక్కి వెళ్లిపోయాయి. యూ ట్యూబ్ లో ఒక్కో జబర్దస్త్ వీడియోకి లక్షల వ్యూస్ కనిపిస్తాయి. ఇదంతా ఆయా సంస్థలకు ఆదాయమే. చాలామంది జీవితాల్లో జబర్దస్త్ ఓ మేలిమి మలుపు. అనామకుల్ని స్టార్లుగా మార్చిన ఘనత ఈ కార్యక్రమానిది.
ఇదంతా ఒకవైపు. మరోవైపు చూస్తే.. విమర్శలు, వివాదాలు. వినోదం పేరుతో, బూతులు వాడేస్తున్నారని, ఈటీవీ సంస్థ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన వాళ్లెందరో..? చాలా స్కిట్లు వివాదాస్పదమయ్యాయి. కానీ వాటన్నింటినీ తట్టుకొని ఈ షో నిలబడింది. ఇప్పుడు ఇదివరకటి జోరులేదు కానీ, ఇప్పటికీ ఈ షోని ఫాలో అయ్యేవాళ్లు ఉన్నారు. కానీ బూతు పురాణం మాత్రం ఆగలేదు. ఎప్పుడూ ఏదో ఒక రభస. లేదంటే పాత వీడియోలు వైరల్ అవ్వడం, వాటి గురించి డిబేట్ జరగడం షరా మామూలుగా జరుగుతుంటాయి. లేటెస్టుగా ‘రాశి’ ఎపిసోడ్ తెరపైకి వచ్చింది. గతంలో ఇదే షోలో అనసూయ, హైపర్ ఆది.. నటి రాశిని ఉద్దేశిస్తూ వాడిన కొన్ని చీప్ డైలాగులు ఇప్పుడు మళ్లీ ప్రస్తావనకు వచ్చాయి. ఇటీవల శివాజీ ఇష్యూలో స్పందిచి, మహిళల సాధికారికత పై మాట్లాడిన అనసూయ.. ఈ విషయంలో కార్నర్ అయ్యింది. నేరుగా రాశినే ‘ఇంత నీచంగా ఎలా మాట్లాడగలిగారు’ అని నిలదీయడంతో.. అనసూయ రియాక్ట్ అవ్వక తప్పలేదు. జరిగిన దానికి క్షమాపణ చెప్పింది. అప్పట్లో చేసిన తప్పుని క్షమాపణతో సరిదిద్దుకొనే ప్రయత్నం చేసింది. తప్పు తెలియక చేసినా, తెలిసి చేసినా తప్పే. కానీ.. తెలిసినప్పుడు దాన్ని సరిదిద్దుకోవాలని చూడడం, భేషజాలకు పోకుండా క్షమాపణలు అడగడం స్వాగతించాల్సిన విషయం. అనసూయ ఈ విషయంలో పరిణతి చూపించింది.
అయితే ఇదే ఇష్యూలో ఈటీవీ సంస్థగానీ, మల్లెమాల గానీ, హైపర్ ఆది గానీ, ఆ స్క్రిప్టు రాసిన వాళ్లు, డైరెక్ట్ చేసినవాళ్లు గానీ స్పందించలేదు. హైపర్ ఆది కూడా ఈ ఇష్యూలో ఉన్నాడు కాబట్టి.. తన స్పందన చాలా ముఖ్యం. మరీ ప్రధానంగా ఈటీవీ, మల్లెమల లాంటి సంస్థలు ఈ విషయంలో అనసూయలా పరిణతితో వ్యవహరిస్తే మంచిది. దొర్లిన తప్పుని లేటుగా అయినా గుర్తించి, ఆ తప్పు వల్ల గాయపడిన హృదయాలకు స్వాంతన చేకూరేలా చర్యలు తీసుకొంటే బాగుంటుంది. అంతేకాదు భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు దొర్లకుండా జాగ్రత్త వహించాల్సిన అవసరం కూడా ఉంది. మరీ ముఖ్యంగా వినోదం పేరుతో మహిళల మర్యాదని, వాళ్ల ప్రతిష్టనీ, సాధికారికతని, గౌరవాన్ని వ్యంగంగా చిత్రీకరించాల్సిన అవసరం లేదన్న విషయాన్ని గుర్తించాలి. ఈ విషయంలో ఈటీవీ, మల్లెమలా ప్రక్షాళనకు దిగకపోతే.. ఆ సంస్థల ప్రతిష్టకు మాయని మచ్చలా మారే ప్రమాదం వుంది.
