చిత్రసీమలో తరచూ వినేమాట `కమిట్మెంట్`. హీరోయిన్లకు అవకాశాలు ఇవ్వడానికి నిర్మాతలు, దర్శకులు, ఆఖరికి హీరోలు కూడా కమిట్ మెంట్ల కోసం అవకాశాల ఎర వేస్తారన్న కామెంట్ చాలా గట్టిగా వినిపిస్తుంటుంది. ఆమధ్య నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజా కూడా సినిమాల పేరిట అమ్మాయిల్ని వాడుకోవడానికే ఇండస్ట్రీకి వస్తున్నారంటూ ఘాటు స్టేట్మెంట్ వదిలారు. చిత్రసీమలో కమిట్మెంట్ పేరుతో బలవంతం చేస్తారా? అసలు అమ్మాయిలకు ఇండస్ట్రీ సేఫ్ అనిపిస్తుందా? అనే విషయాలపై యాంకర్ కమ్ నటి స్రవంతి స్పందించింది.
తెలుగు360కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్రవంతి కమిట్ మెంట్ లపై మనసువిప్పి మాట్లాడింది. ”ఈమధ్య ఓ అమ్మాయి ట్విట్టర్ లో నాకు కామెంట్ పెట్టింది. ఇండస్ట్రీలో కమిట్ మెంట్ లేకుండా ఎదగగలమా? ఇది కాకుండా ఇంకో ఆప్షన్ ఉందా? అని అడిగింది. ప్రమాణ పూర్తిగా చెబుతున్నా.. నా వరకూ నాకు ఇలాంటి ఇబ్బంది ఎప్పుడూ ఎదురు కాలేదు. మనని బట్టే ఎదుటివాళ్ల ప్రవర్తన ఉంటుంది. మనం ఎలా ఉంటే వాళ్లు అలా ఉంటారు. ఇక్కడ ఎవరి బలవంతం ఉండదు. నూటికి నూరు శాతం నిజాయితీ ఉంటుందని కూడా నేను అనను. కానీ మనం ఎదుటి వాళ్లని ఎలా డీల్ చేస్తామనేదాన్ని బట్టి ఉంటుంది. నా సర్కిల్ లో నేను ఇలాంటి విషయాలపై డిస్కర్షన్ చేసుకొంటుంటాం. వాళ్లు కూడా ఎప్పుడూ ఇలా ఇబ్బంది పడ్డామని నాకు చెప్పలేదు. నాకు తెలిసినంత వరకూ ఇండస్ట్రీ అమ్మాయిలకు సేఫ్ గానే అనిపిస్తోంది” అని చెప్పుకొచ్చింది.
యాంకర్‌గా పేరు తెచ్చుకొంటున్న స్రవంతి ఇప్పుడు వెండితెరపైనా అడుగుపెట్టింది. తాను నటించిన ‘హే బలవంత్’ ఈవారమే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా హిట్టయితే తనకు మరిన్ని అవకాశాలు వస్తాయని బలంగా నమ్ముతోంది స్రవంతి. యాంకర్లుగా ప్రయాణం మొదలెట్టి వెండితెరపై వెలగాలని ఇది వరకు చాలామంది ప్రయత్నించారు. వాళ్లలో సక్సెస్ రేటు చాలా తక్కువ. మరి.. స్రవంతి కెరీర్ ఎలా ఉంటుందో?


