ఆర్కే కొత్తపలుకు : చంద్రబాబును బెదిరించారా..? హెచ్చరించారా..?

ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరక్టర్.. ప్రతీ ఆదివారం “కొత్తపలుకు” పేరుతో  రాసే ఆర్టికల్.. రాజకీయాలంటే ఆసక్తి ఉన్నవారిని ఆకట్టుకుంటుంది. అందులో సునిశిత విశ్లేషణ ఉటుంది. ఆయన సుదీర్ఘ రాజకీయ అనుభవం నుంచి.. సందర్భానికి తగ్గట్లుగా కొత్త కొత్త విషయాలు చెబుతూ ఉంటారు. వ్యాసాల్లో కించిత్ టీడీపీ అనుకూలత కనిపిస్తుందని.. ఇతర పార్టీల నేతలు బహిరంగంగానే చెబుతూ ఉంటారు. అయితే ఈ వారం “కొత్తపలుకు” మాత్రం కాస్తంత తేడాగా ఉంది. అది తెలంగాణ ఎన్నికల విషయంలో.. చంద్రబాబు అడుగుల్ని నిర్దేశించేలా.. హెచ్చరించేలా.. బెదిరించేలా .. అన్ని కోణాల్లో ఆ ఆర్టికల్ ఉంది. అంతే.. కేసీఆర్ అంటే అజేయుడు ఆయన జోలికి పోవడం మంచిది కాదన్నట్లుగా సలహాలు కూడా ఇచ్చేశారు. ఒక్కసారిగా టీడీపీపై నుంచి ఆయన అభిమానం.. టీఆర్ఎస్‌ మీదకు అలా వెళ్లిపోయింది.

“కొత్తపలుకు” మొత్తం .. కాంగ్రెస్ పార్టీతో టీడీపీ జత కట్టకూడదనే సూచనలతోనే సాగిపోయింది. అంతకు మించి అలా జతకట్టి మహాకూటమి ఏర్పాటు చేసినా.. కేసీఆర్‌ను ఏమీ చేయలేరని.. తీర్పిచ్చేశారు. ఆయన గెలవడం ఖాయమని నిర్దారించేశారు. అలా చేయడం వల్ల .. తనను ఓడించడానికి ప్రయత్నించారన్న కారణంగా.. తర్వాత జరగబోయే ఎన్నికల్లో ఏపీలో కేసీఆర్ కలుగజేసుకుని.. చంద్రబాబును ఓడించడానికి ప్రయత్నిస్తారట..!. మోడీ, కేసీఆర్, జగన్, పవన్.. కలసి చంద్రబాబును ఓడిస్తారని చెప్పుకొచ్చారు. ఒక వేళ తెలంగాణ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోకపోతే.. వీళ్లంతా… ఏపీలో తెలుగుదేశం పార్టీ విజయానికి ప్రయత్నిస్తారా..?. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలని ప్రచారం చేస్తారా..?. రాజకీయాలన్న తర్వాత ప్రత్యర్థిని ఓడించడానికే ప్రయత్నిస్తారు. అదే రాజకీయం. అతను గెలిచేస్తాడని… అతనితో రాజీ పోతే.. అది రాజకీయం ఎందుకు అవుతుంది..?. అలా అనుకుంటే… కేసీఆర్‌ కూడా లీడర్‌ అయ్యేవాడు కాదేమో..?

“కొత్తపలుకు” చూస్తూంటే..ఇదంతా.. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటే.. టీఆర్ఎస్‌కు ఎక్కడ నష్టం జరుగుతుందో అన్న కంగారుతో.. చంద్రబాబును ఆ దిశగా ముందడుగు వేయకుండా చేసేందుకు… సలహాలతో కూడిన.. హెచ్చరికలతో నిండిన బెదిరింపుల్లాగా అనిపిస్తే.. తప్పులేదు. ఎందుకంటే.. వ్యాసం మొత్తం అంతే ఉంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో టీఆర్ఎస్‌కు ఎనభై సీట్లు వస్తాయని… ఆర్టికల్‌లో తేల్చేశారు. ఏ లెక్కల తేల్చారో మరి.. ప్రజలు కేసీఆర్‌వైపే ఉన్నారట. టీడీపీ తరపున ఎవరైనా గెలిచినా.. టీఆర్ఎస్‌లో చేరరని గ్యారంటీ ఏమిటని మరో సందేహం…!.  ఎన్ని చెప్పినా…ఆర్కే “కొత్తపలుకు” మాత్రం.. కచ్చితంగా కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి పొత్తులు పెట్టుకోవద్దనే హెచ్చరికలే. దీనికి సైద్దాంతికత కారణాలు చెప్పినా కన్విన్సింగ్‌గా ఉండేదేమో కానీ… రాజకీయ కారణాలు చెప్పడం.. చాలా ఎబ్బెట్టుగా ఉంది. ఈ ఆర్టికల్ పై .. ప్రగతి భవన్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తూనే ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com