సీఎంవోలో ఓ అధికారి వ్యవహారశైలి ఆంధ్రజ్యోతి పత్రికకు ప్రధాన పేజీ వార్త అయింది. కార్తికేయ మిశ్రా అనే సీఎంవో అధికారి…ఇతర అధికారుల్ని తన వ్యవహారశైలితో వేధిస్తున్నారని ఓ పెద్ద కథనం రాసేశారు. అంతర్గత సమావేశాల్లో జరిగినట్లుగా చెబుతున్న కొన్ని విషయాలను ఆంధ్రజ్యోతి రాసుకొచ్చింది. సదరు సీఎంవో అధికారి.. ఓ కలెక్టర్ ను సరిగ్గా నిలబడమన్నారట.. మరో అధికారిని గట్టిగా ప్రశ్నించారట. కొరియర్లో షూస్ పంపించారుట… ఇలా మొత్తం ఆ సీఎంవో అధికారికి అహంకారం అని.. చెప్పడమే కాకుండా..ఇక్కడ ప్రాంతీయ టచ్ ఇచ్చారు. ఆయన తెలుగు అధికారుల్నే టార్గెట్ చేస్తున్నారట.
ఈ కథనం చదివిన ఎవరికైనా కార్తికేయ మిశ్రా తన కింద ఉద్యోగులతో ఇలా వ్యవహరిస్తారా అని వ్యతిరేకత పెంచుకోవాలని రాసినట్లుగా ఉందని స్పష్టమవుతుంది. కార్తికేయ మిశ్రా ఎలాంటి అధికారో .. ఆయన తీరు ఎలా ఉంటుందో అధికారవర్గాల్లో అందరికీ తెలుసు. ఎందుకంటే ఆయన కొత్తగా వచ్చిన అధికారి కాదు. కొత్తగా కీలక స్థానంలోకి వచ్చిన అధికారి కాదు. ఏదైనా పద్దతిగా చేయాలనుకునే అధికారి కాబట్టే స్ట్రిక్ట్ గా ఉంటారని చెబుతారు.
అయినా ఆయన విధి నిర్వహణలో తప్పు చేస్తే.. ప్రజలపై ప్రభావం పడితే రాయాలి కానీ ఇలా కింది స్థాయి అధికారులతో స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తున్నారని ఏకంగా ప్రధాన పేజీలో కథనం రాయడం ఏమిటో….దాని వెనుక ఉన్న కథ ఏమిటో వారికే తెలియాలి. సీఎంవో ఉండే అధికారులు ఆషామాషీగా వచ్చి ఉండరు కదా. ప్రతి చిన్న విషయాన్నీ అత్యంత సీరియస్ గా పట్టించుకుని .. పనులు చక్కబెట్టేవారే కావాలి. అందుకే కార్తికేయ మిశ్రాకు చంద్రబాబు చాన్స్ ఇచ్చి ఉంటారు.
ఓ ఆఫీసు అన్న తర్వాత రకరకాల మనుషులు ఉంటారు. ఆంధ్రజ్యోతి ఆఫీసునే తీసుకుంటే.. అందరూ .. అందరితో ఒకే రకమైన గౌరవ మర్యాదలతో పిలుచుకుంటూ పని చేయరు కదా. ఎవరి వ్యక్తిత్వం వారిది. పెత్తనం చెలాయించేవారు ఎలా వ్యవహరిస్తున్నారో చెబుతూ చాలా ఫిర్యాదులు ఆర్కేకు వస్తూనే ఉంటాయి. అంత మాత్రాన వాటిన్నింటిపై ఆయన చర్యలు తీసుకుంటారా? . అయినా .. ఆఫీసులో పై స్థాయి అధికారి మన తప్పుల్ని చెబితే సరి చేసుకుని పని చేసుకుంటే.. బాగుపడేది ఎవరు?. చిన్నప్పుడు టీచర్ తిట్టాడని.. పెద్దయ్యాక బాస్ అరిచాడని కోపం పెంచుకుంటారా?. తాత్కలికంగా పెంచుకున్నా.. ఓ స్టేజ్ కు వెళ్లాక.. వాళ్లు అంత కఠినంగా లేకపోతే తన భవిష్యత్ ఏమయ్యేదో అని అనుకోకుండా ఉంటారా?.
ఏదో హిడెన్ అజెండాతో ఆంధ్రజ్యోతి ఇలాంటి కథనాలు రాస్తున్నట్లుగా కనిపిస్తోంది. సీఎంవో నుంచి కార్తికేయ మిశ్రాను తప్పించాలని ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది. ఆ కోణంతో ఇలాంటి కథనాలు రాస్తే.. కష్టమే !


