Andhra King Taluka Movie Telugu Review
Telugu360 Rating: 3/5
రామాయణం అనేది సీతా, రాముల కథే అనుకొంటే… అది కేవలం ప్రేమగాథే అయ్యేది.
రామయణం అంటే.. రాముడి కోసం హనుమంతుడు చేసిన త్యాగం.
రామాయణం అంటే.. రామ రాజ్యం కోసం వానరసేన చేసే యుద్ధం. కాబట్టి అది ఇతిహాసంగా మారింది.
– ఇలాంటి డైలాగ్ ఒకటి… ‘ఆంధ్ర కింగ్ తాలుకా’ సినిమాలో ఉంది. ఈ సినిమా కథకు కూడా ఈ డైలాగే జస్టిఫికేషన్ చేసింది.
‘ఆంధ్ర కింగ్ తాలుకా’ పైపైన చూస్తే ఓ ప్రేమకథలా అనిపిస్తుంది. కాస్త లోలోతుల్లోకి వెళ్తే.. ఓ హీరో కోసం అభిమాని చేసిన త్యాగం. ఓ ఊరు కోసం… జనం చేసిన యుద్ధం.
సినిమాలో సినిమా కథలు చాలా చూశాం. స్టార్ హీరోల గాథలు, వెతలు, జీవితాలు బయోపిక్ రూపంలో కన్నాం. అయితే… ‘ఆంధ్ర కింగ్ తాలుకా’ అనేది ఓ అభిమాని కథ. కాబట్టే… టైటిల్ నుంచి, ప్రచార చిత్రాల వరకూ.. ఆ విషయాన్నే ఎక్కువగా ఫోకస్ చేసే ప్రయత్నం చేశారు. ఓ అభిమాని కథని తెరపై చూడడం ప్రేక్షకులకూ సరికొత్త ఫీలింగే. కాబట్టి.. ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది. మరింతకీ… ఆంధ్రా కింగ్ ఎలాంటి హీరో… ఆ హీరో కోసం అభిమాని చేసిన త్యాగం ఏమిటి?
కథలోకి వెళ్తే.. సూర్య (ఉపేంద్ర) పెద్ద స్టార్. వందో సినిమా సెట్స్ పై ఉంటుంది. కానీ.. ఆర్థిక కారణాల వల్ల మధ్యలోనే ఆగిపోతుంది. అప్పటికే వరుస ఫ్లాపుల వల్ల సూర్య కెరీర్ మాత్రమే కాదు, జీవితమే తల్లకిందులైపోతుంది. ఈ ఉపద్రవం నుంచి బయటపడాలంటే తనకు మూడు కోట్లు కావాలి. ఆదుకొంటారనుకున్న వాళ్లంతా చివర్లో కూడా సూర్యని వాడుకోవాలని చూస్తుంటారు. అలాంటి సమయంలో… ఓ అజ్ఞాత వ్యక్తి ఖాతా నుంచి.. సూర్య ఎకౌంట్లో రూ.3 కోట్లు జమ అవుతాయి. దాంతో ఆ అజ్ఞాత అభిమాని ఎవరో తెలుసుకోవాలన్న ఆసక్తి సూర్యలో మొదలవుతుంది. ఆ క్రమంలో రాజమండ్రి పక్కన ఉన్న ఓ లంక గ్రామంలో సాగర్ (రామ్) అనే ఫ్యాన్ ఉన్నాడని తెలుసుకొంటాడు సూర్య. తక్షణం తనని కలుసుకోవాలని లంక గ్రామానికి బయల్దేరతాడు. ఆ ప్రయాణంలో ఏం జరిగింది? తన అభిమాని గురించి సూర్య తెలుసుకొన్న నిజాలేంటి? చివరికి ఆ అభిమానిని కలుసుకొన్నాడా, లేదా? ఇదంతా మిగిలిన కథ.
పైపైన చూస్తే ఇదంతా ఓ అభిమాని తన హీరో కోసం చేసిన త్యాగంలా అనిపిస్తుంది. కానీ లోపలకు వెళ్తే ఇందులో చాలా విషయాలు ఉన్నాయి. సాగర్ – మహాలక్ష్మిల ప్రేమ కథ ఉంది. ఆ ఊరు కోసం సాగర్ చేసిన సాహసం ఉంది, తాను ఇష్టపడిన హీరో నుంచి స్ఫూర్తి పొంది ఎదిగిన ఓ కుర్రాడి కథ ఉంది.. ఊర్లో అభిమానుల మధ్య ఎలాంటి యుద్ధాలు జరుగుతాయో చెప్పే తంతు వుంది. ఎదిగి పడుతున్న స్టార్ ల జీవితాలు ఎలా ఉంటాయో చెప్పే ప్రయత్నం వుంది. అసలు అభిమాని ఎలా ఉండాలో ఓ సూచన వుంది. ఇలా ఓ కథలో చాలా విషయాల్ని ఇమడ్చాలని చూశాడు దర్శకుడు. వాటన్నింటికీ తన వంతు న్యాయం కూడా చేశాడు.
సూర్య కథతో సినిమాని ప్రారంభించిన విధానం, ఓ స్టార్ తన వందో సినిమా కోసం పడే తాపత్రయం, పరువు కోసం పడే పాట్లు.. వీటితో `ఆంధ్ర కింగ్ తాలుకా` ప్రయాణం ప్రారంభం అవుతుంది. తొలి పది నిమిషాల్లోనే ప్రేక్షకుల్ని కథలోకి తీసుకెళ్లిపోయాడు దర్శకుడు. సాగర్ ఎవరు? ఇదంతా ఎందుకు చేస్తున్నాడు? అనే ఆసక్తిని కలిగించాడు. ఆ తరవాత సాగర్ కథ మొదలవుతుంది. సాగర్ లో అభిమాని ఎలా పుట్టాడో చెప్పే సన్నివేశాలు బాగా పండాయి. థియేటర్లో హీరో కటౌట్ పడిపోతుంటే… అభిమాని వచ్చి ఆపడం మంచి హీరోయిక్ మూమెంట్. మహాలక్ష్మితో నడిపిన ప్రేమకథ కూడా డీసెంట్ గానే అనిపిస్తుంది. సాగర్, మహాలక్ష్మి ప్రేమించుకొంటున్న విషయం మహాలక్ష్మి తండ్రికి (మురళీ శర్మ)కు తెలిసే సన్నివేశం బాగా తెరకెక్కించాడు దర్శకుడు. దానికి థియేటర్ తెరని ఓ వేదిక చేసుకోవడం బాగుంది. చివర్లో ఉపేంద్ర, రామ్ తొలిసారి కలిసే సన్నివేశానికీ ఆ వెండితెరనే ఆలంబనగా చేసుకోవడం ఇంకా బాగుంది. కొన్ని కొన్ని సన్నివేశాల్ని దర్శకుడు బాగా డీల్ చేశాడు. ముఖ్యంగా హీరోయిన్ ఎంట్రీ.. బాగుంది. అద్దాలు పగులుతుంటే.. హీరోయిన్ ని రివీల్ చేయడం పొయెటిక్‌గా అనిపించింది. ఇంట్రవెల్ బ్యాంగ్ బాగుంది. అక్కడ హీరోకి ఓ లక్ష్యం, ఆ పాత్రకంటూ ఓ దిశా నిర్దేశం కనిపిస్తాయి.
హీరో తన లక్ష్యాన్ని ఎలా చేరుకొంటాడా? అనే ఆసక్తి తో సెకండాఫ్ రన్ అవుతుంది. ప్రొజెక్టర్ పై సినిమాలు నడిపించడం, ఇసుక వ్యాపారంతో హీరో తన లక్ష్యానికి చేరువ కావడం ఇవన్నీ ఇంకాస్త బెటర్ గా డిజైన్ చేయాల్సింది. అక్కడ హీరోకి పెద్దగా సవాళ్లు ఎదురు కాలేదు. డబ్బులు సంపాదించడం ఇంత తేలికా అన్నట్టు సాగాయి ఆ వ్యవహరాలు. ఊరికి కరెంట్ తీసుకురావడం మరో పెద్ద ఛాలెంజ్. అది కూడా తు.తు మంత్రంగానే చూపించారు. నిజానికి ఊరికి కరెంట్ రావడం పెద్ద కల. అదో పెద్ద ఎచీవ్ మెంట్. కరెంట్ లేక ఆ ఊరు పడుతున్న బాధల్ని చూపించి, చిన్న పిల్లలు మెడలో గంటలు కట్టుకొని తిరుగుతున్నారని చూపించి… వాళ్ల బాధలు తీరే సీన్‌ని ఎమోషనల్ గా డిజైన్ చేయలేకపోడం కాస్త అసంతృప్తిగా అనిపిస్తుంది. సాగర్ – మహాలక్ష్మిల కాన్ఫ్లిక్ట్ బాగున్నా, అది వెంటనే సాల్వ్ అయిపోవడం కూడా ఏమంత గొప్పగా ఉండదు. క్లైమాక్స్ లో ఫైట్ లేదు. దానికి ఛాన్స్ లేదు. అందుకే తుపాను, వరద అనే కాన్సెప్టు ఎంచుకొన్నాడు దర్శకుడు. విజువల్ గా కాస్త హడావుడి కనిపించినా.. ఆ లేయర్ బలవంతంగా ఇరికించినట్టు ఉంటుంది.
అయితే హీరో – అభిమాని కథ రౌండప్ చేయడం మాత్రం పూర్తి స్థాయిలో సంతృప్తి ఇస్తుంది. `పడు పడు పడు పడు లేచి నిలబడు` అనే స్ఫూర్తి మంత్రం అభిమాని కోసం మాత్రమే కాదు. హీరో కోసం కూడా. తన పాటని మంత్రంగా ఫీలై.. జీవితంలో ఎదిగిన అభిమానిని స్ఫూర్తిగా తీసుకొని, హీరో తన దిశ, దశ మార్చుకోవాలనుకోవడం మనసుని హత్తుకొంటుంది. ప్రేమకథ, హీరో లక్ష్యాన్ని హడావుడిగా ముగించినా.. కీలకమైన హీరో – ఫ్యాన్ ఎపిసోడ్ కు మాత్రం దర్శకుడు పూర్తి న్యాయం చేశాడనిపిస్తుంది.
రామ్ చాలా ఇష్టపడి చేసిన సినిమా ఇది. తన ఇంటర్వ్యూలు గమనిస్తే ఈ సినిమాని, కథని ఎంత ఇష్టపడ్డాడో అర్థం అవుతుంది. ఆ ఇష్టం.. తెర పై కూడా కనిపిస్తుంది. ఇంట్రవెల్, క్లైమాక్స్ లలో మాస్ హీరోలు భారీ ఫైట్ ఆశిస్తారు. కానీ రామ్ ఆ ధోరణి పక్కన పెట్టి కేవలం ఎమోషన్ ని నమ్ముకోవడం చూస్తే, ఈ కథని తాను ఎంత బలంగా నమ్మాడో అర్థం అవుతుంది. తన ఎనర్జీని దర్శకుడు పూర్తి స్థాయిలో వాడుకొన్నా, ఎక్కడో చిన్న లోటు. రామ్ మంచి డాన్సర్. తనలోని ఆ యాంగిల్ ఈ సినిమాలో మిస్ అయ్యింది. రామ్ లాంటి హీరోకి ఓ మాస్ పాట పడితే బాగుండేది. ఆ ఛాన్స్ కథలో ఉంది. కానీ ఎందుకో మాస్ పాట మిస్సయ్యింది. భాగ్యశ్రీ పాత్రకంటూ ఓ ఇంపాక్ట్ వుంది. తన లుక్స్ బాగున్నాయి. పాటల్లో, పరికిణీలో మరింత అందంగా కనిపించింది. ద్వితీయార్థంలో ఆ పాత్ర ప్రాధాన్యత తగ్గింది. ఉపేంద్ర సినిమాలో అక్కడక్కడే కనిపిస్తాడు. కానీ తన ప్రభావం మాత్రం ప్రతీ సీన్ లోనూ ఉంటుంది. స్క్రీన్ ప్లేలో ఉన్న మ్యాజిక్ అది. ఉపేంద్ర లాంటి స్టార్ ఆ పాత్ర చేయడం వల్ల.. ఆ పాత్ర కంటూ ఓ వాల్యూ యాడ్ అయ్యింది. రావు రమేష్ `రామాయణం` స్పీచ్ దగ్గర మార్కులు కొట్టేస్తాడు. మురశీ శర్మ ది కూడా వెయిటేజీ ఉన్న పాత్రే. సత్య అక్కడక్కడ నవ్విస్తాడు.
మైత్రీ మూవీస్ బాగానే ఖర్చు పెట్టింది. ప్రొడక్షన్ వాల్యూస్ కనిపిస్తాయి. పాటలు ఆడియో పరంగా బాగున్నాయి. ఎందుకో థియేటర్లో అంతగా ఇంపాక్ట్ ఇవ్వలేదనిపిస్తుంది. దర్శకుడిగా, కథకుడిగా మహేష్ మెప్పిస్తాడు. తను కథలో ఎక్కడా డీవియేట్ కాలేదు. ఆఖరికి రామ్ కోసం కూడా ఎగస్ట్రా ఎటిమెంట్స్ జోడించలేదు. కథ ఏం చెబితే అదే చేశాడు. తనకు ఇది మూడో సినిమా. కథాపరంగా బలంగా ఉన్న సినిమా కూడా ఇదే. ఫొటోగ్రఫీ, ఆర్ట్ వర్క్ ఇవన్నీ బాగా కుదిరాయి. మొత్తంగా చూస్తే రామ్ గత సినిమాలకంటే బెటర్ అవుట్ పుట్ ఇచ్చిన సినిమా ఇది. కమర్షియల్ యాంగిల్ కంటే కథకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు కనిపిస్తుంది. ఎలాంటి అంచనాలూ లేకుండా థియేటర్లకు వెళ్తే కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. హీరో ఎలా ఉండాలో చెప్పే కథలు చాలా వచ్చాయి. ఇది మాత్రం అభిమాని ఎలా ఉండాలో చెప్పిన సినిమా. కాబట్టి ఏ హీరో అభిమాని అయినా కనెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువ వుంది.
Telugu360 Rating: 3/5