ఈ సారి “నగదు బదిలీ పథకాల” లెక్కలే బడ్జెట్..!

బడ్జెట్ అంటే.. ఆదాయ, వ్యయాల లెక్కలు మాత్రమే కాదు. ప్రభుత్వ దార్శనిక పత్రం. అభివృద్ధి, సంక్షేమం కలగలుపుతో… రాష్ట్రా‌న్ని వృద్ధి పథంలో నడిపే… తారకమంత్రం. అటు అభివృద్ధి పరంగా అయినా.. ఇటు సంక్షేమపరంగా బ్యాలెన్స్ తప్పినా.. తేడా వస్తుంది. అనుత్పుదాక వ్యయం ఎంత చేస్తారో.. ఉత్పాదక వ్యయం అంత కంటే ఎక్కువగా ఉండేలా చూసుకోవాల్సి ఉంటుంది. అంతకు మించి.. వీటికి ఆదాయ మార్గాలు కూడా వెదుక్కోవాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ఏపీ ప్రభుత్వానికి.. ఆ చాయిస్ లేకుండా పోయింది. ఇప్పుడు.. కేవలం.. సంక్షేమం పేరుతో వివిధ వర్గాలకు.. డబ్బులు పంచడమే.. బడ్జెట్ లెక్కలుగా ఖరారు చేస్తున్నారు.

నవరత్నాల ఖర్చు రూ. 66వేల కోట్లు..!

ఈ నెల 11 తేదీ నుంచి శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 12 తేదీన అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. బడ్జెట్ ప్రతిపాదనల రూపకల్పనలో ఆర్ధిక మంత్రి బుగ్గన కసరత్తు చేస్తున్నారు. మేనిఫెస్టోను అనుసరించి.. వివిధ శాఖలు ఇచ్చిన ప్రతిపాదనల ఆధారంగా బడ్జెట్ కేటాయింపులు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మిగతా ఆర్థిక సంవత్సరానికి.. జగన్ ప్రకటించిన నవరత్నాల అమలుకే దాదాపుగా రూ. 66 వేల కోట్లు కేటాయించాల్సి ఉంది. “అమ్మఒడి” పథకానికి రూ. 4900 కోట్లు కేటాయిస్తారని చెబుతున్నారు. అయితే ఇవి ఎంత మాత్రం సరిపోయే అవకాశం లేదంటున్నారు. ఒక్క తల్లికి రూ. పదిహేను వేలు ఇవ్వాలంటే.. కనీసం… రూ. పదివేల కోట్లకుపైగానా కేటాయించాల్సి ఉంటుందని.. అంటున్నారు. కొన్ని నిబంధననలు అమలు చేసి.. భారం తగ్గించుకునే ప్రయత్నం చేస్తారని చెబుతున్నారు.

అనుత్పాదక వ్యయం 90 శాతం దాటిపోతుందా..?

ఇక ఫీజు రీఎంబర్సుమెంట్ పథకానికి రూ. 5 వేల కోట్లు, వైఎస్ఆర్ ఆసరా కోసం రూ. 7వేల కోట్లు, అన్ని రకాల సామాజిక పెన్షన్ల కోసం రూ. 15 వేల కోట్లు మేర బడ్జెట్ లో ప్రతిపాదించనున్నారు. వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ పథకం కోసం రూ. 6 వేల 300 కోట్లు వెచ్చించనున్నారు. జగన్ అత్యంత ముఖ్యమైన హామీల్లో ఒకటైన రైతు భరోసా పథకానికి సుమారు రూ. 12 వేల కోట్లను బడ్జెట్ లో ప్రతిపాదనలు చేయనున్నారు. అక్టోబరు 15 తేదీ నుంచి ఈ పథకం ప్రారంభించనున్నట్టు సీఎం ప్రకటించారు. విపత్తుల సహాయనిధి కోసం రైతుల కోసం 2వేల కోట్లను, అలాగే మార్కెట్ స్థిరీ కరణ నిధిగా 3 వేల కోట్లను బడ్జెట్ లో పెట్టనున్నారు. ఇక అగ్రి గోల్డ్ కోసం 1150 కోట్ల రూపాయలను బడ్జెట్ లో కేటాయించనున్నారు. ఇక గ్రామ సచివాలయాల నిర్మాణానికి నిధులు, గ్రామ వాలంటీర్ల నియామకం వారి జీత భత్యాల కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించాల్సి ఉంది.

అభివృద్ధి పనులకు కేటాయింపులు ఉండవా..?

రైతులకు ఉచిత విద్యుత్ కింద రూ. 4 వేల కోట్లు, మధ్యాహ్న భోజన పథకానికి రూ. వెయ్యి కోట్లు కేటాయిస్తారు. ఇవన్నీ అనుత్పాదక వ్యయమే. ఉద్యోగుల జీతభత్యాల కోసం రూ. 28 వేల నుంచి 30 వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా . ఈ నెల 5 తేదీన పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో రాష్ట్రానికి కేటాయింపులు ఎలా ఉన్నాయో దృష్టిలో ఉంచుకుని వివిధ శాఖలకు తుది కేటాయింపులపై ఆర్ధిక శాఖ నిర్ణయం తీసుకోనుంది. ఏం చేసినా .. ఏం కేటాయించినా.. బడ్జెట్ మొత్తం… నగదు బదిలీ పథకాలకే కేటాయించడం ఖాయంగా కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com