ఆంధ్రప్రదేశ్ 2025-26 మొదటి త్రైమాసికంలో 10.50 శాతం వృద్ధిని నమోదు చేసింది. జాతీయ సగటును అధిగమించింది. జాతీయ సగటు 8.8 శాతంగా ఉంది. గత ఏడాది ఇదే కాలంలో 9.58 శాతం వృద్ధి రేటుతో పోలిస్తే ఈ సంవత్సరం గణనీయమైన పురోగతి సాధించినట్లయింది. పారిశ్రామిక రంగం 11.91 శాతం వృద్ధి రేటుతో అగ్రస్థానంలో నిలిచింది. సేవల రంగం 10.70 శాతం వృద్ధిని నమోదు చేసింది. పర్యాటకం, హోటళ్లు మరియు రవాణా రంగాలు 17.92 శాతం వృద్ధిని నమోదు చేసాయి.
వ్యవసాయం, సంబంధిత రంగాలు 9.60 శాతం వృద్ధిని సాధించాయి. మత్స్య సంపద , ఆక్వాకల్చర్ అగ్రస్థానంలో నిలిచాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఆర్థిక వృద్ధిని పెంపొందించేందుకు మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఐటీ రంగం, పారిశ్రామిక కేంద్రాలు , చట్టం-వ్యవస్థలో సంస్కరణలపై దృష్టి సారించారు. కొత్త విధానాలు వ్యాపారాల స్థాపనను సులభతరం చేస్తూ, లక్షల కుటుంబాలకు ఉద్యోగ అవకాశాలను మరియు ఆదాయాన్ని పెంచుతున్నాయి.
2025-26 మొదటి త్రైమాసికంలో ఆంధ్రప్రదేశ్ రూ. 8,860 కోట్ల నికర GST వసూళ్లను నమోదు చేసింది.ఓ వైపు ప్రభుత్వం అమరావతితో పాటు ప్రాజెక్టులు, ఇతర మౌలిక సదుపాయాల పనులను విస్తృతంగా చేపట్టింది. మరో వైపు ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షిస్తున్నారు. ఈ క్రమంలో ఆర్థిక వ్యవహారాలు పుంజుకున్నాయి. ప్రజల ఆదాయాలు పెరుగుతూండటంతో.. జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయి. జీఎస్టీ వసూళ్లు అందుకే పెరుగుతున్నాయి.