ఆంధ్రప్రదేశ్లో మత మార్పిడుల అంశం సామాజికంగా, రాజకీయంగా పెను చర్చకు దారితీస్తోంది. రాష్ట్రంలో కొన్నేళ్లుగా సాగుతున్న పరిణామాలు, ముఖ్యంగా పేదరికాన్ని ఆసరాగా చేసుకుని సాగుతున్న ప్రలోభపూరిత మత మార్పిడులు ఆందోళన కలిగిస్తున్నాయనే వాదన బలంగా వినిపిస్తోంది. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ప్రజలకు ఆర్థిక సాయం, ఉచిత విద్య, వైద్యం వంటి ఆశలు చూపి వారిని మతం మార్చుకునేలా చేస్తున్నారని, ఇది కేవలం మతపరమైన మార్పు మాత్రమే కాకుండా సామాజిక సమతుల్యతను దెబ్బతీస్తోందన్న చాలా కాలంగా ఉంది. ఇదే సమయంలో నిజమైన క్రైస్తవ మత సిద్ధాంతాలకు విరుద్ధంగా కొందరు చేస్తున్న ప్రచారాలు, ఆ మతాన్ని కూడా కలుషితం చేస్తున్నాయనే ఆవేదన వ్యక్తమవుతోంది.
చాలా రాష్ట్రాల్లో మత మార్పిడుల నిరోధక చట్టం
ప్రస్తుతం దేశంలోని ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక, హర్యానా వంటి సుమారు 12 రాష్ట్రాల్లో మత మార్పిడి నిరోధక చట్టాలు అమల్లో ఉన్నాయి. బలవంతంగా, మోసపూరితంగా లేదా ప్రలోభాలకు గురిచేసి మతం మార్చడాన్ని ఈ చట్టాలు తీవ్రమైన నేరంగా పరిగణిస్తాయి. ఏపీలో కూడా ఇలాంటి కఠినమైన చట్టం లేకపోవడం వల్లే మత మార్పిడి ముఠాలు పేట్రేగిపోతున్నాయని, రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛను అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడుతున్నారని హిందూ ధర్మ పరిరక్షణ సమితులు , పలు సామాజిక సంస్థలు అంటున్నాయి. అందుకే మత మార్పిళ్ల నిరోధక చట్టం తీసుకు రావాలని చాలా కాలం డిమాండ్ చేస్తున్నాయి.
మత మార్పిళ్లతో రిజర్వేషన్లపైనా ప్రభావం
మత మార్పిడి జరిగినప్పుడు వారి సామాజిక స్థితిగతుల్లో మార్పు రాకపోయినా, రిజర్వేషన్ల ప్రయోజనాల కోసం పాత గుర్తింపునే కొనసాగించడం వంటి అంశాలు న్యాయపరమైన చిక్కులకు దారితీస్తున్నాయి. ఇటీవల ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా ఒక తీర్పులో, క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తికి ఎస్సీ హోదా వర్తించదని స్పష్టం చేసింది. ఇలాంటి అస్పష్టతలను తొలగించడానికి, బలహీన వర్గాల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకునే దళారుల ఆటకట్టించడానికి ఒక స్పష్టమైన చట్టం అవసరమని మేధావులు సూచిస్తున్నారు.
ఏ మతానికీ వ్యతిరేకం కాకుండా చట్టం
మత మార్పిడి నిరోధక చట్టం అనేది ఏ ఒక్క మతానికి వ్యతిరేకం కాదు. అది కేవలం బలవంతపు మార్పిడులను అరికట్టడానికి మాత్రమేనని చట్టాలు చేసిన రాష్ట్రాలు చెబుతున్నాయి. ఒక వ్యక్తి తన ఇష్టపూర్వకంగా మతం మారాలనుకుంటే జిల్లా యంత్రాంగానికి ముందస్తు సమాచారం ఇవ్వడం, విచారణ జరిపించడం వంటి నిబంధనలు ఇతర రాష్ట్రాల్లో విజయవంతంగా అమలవుతున్నాయి. ఏపీలో కూడా ఇటువంటి వ్యవస్థను తీసుకురావడం ద్వారా విద్వేషాలను తగ్గించి, సామాజిక సామరస్యాన్ని కాపాడవచ్చని చర్చ జరుగుతోంది. ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించాల్సిన అవసరం కనిపిస్తోంది.
