ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రభుత్వ సలహాదారులు అనే అంశం ఎప్పుడూ చర్చనీయాంశమే. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనూ, ప్రస్తుత కూటమి ప్రభుత్వం హయాంలోనూ ఈ నియామకాలు జరిగినప్పటికీ, వాటి ఎంపిక విధానం , ఉద్దేశాల్లో స్పష్టమైన తేడాలు కనిపిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుల నియామకాల్లో నాడు, నేడు స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సలహాదారుల వ్యవస్థపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. అప్పట్లో దాదాపు 40 మందికి పైగా సలహాదారులను నియమించగా, వారిలో అత్యధికులు రాజకీయ చదువులు.. అప్పనంగా జీతాలు ఇవ్వడానికి ఇచ్చారు. ఆ నియామకాలను కేవలం రాజకీయ పునరావాసం అని అందరికీ తెలుసు.
ప్రస్తుత తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, సలహాదారుల ఎంపికలో సరికొత్త పంథాను అనుసరిస్తోంది. రాజకీయ నాయకుల కంటే ఆయా రంగాల్లో అపారమైన అనుభవం, ప్రజల్లో గుర్తింపు ఉన్న ప్రముఖులకు పెద్దపీట వేస్తోంది. ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీధర్, ఆరోగ్య రంగంలో పేరుగాంచిన మంతెన సత్యనారాయణ రాజు వంటి వారిని నియమించడం ద్వారా ప్రభుత్వం తన ప్రాధాన్యతలను స్పష్టం చేసింది. రాజకీయ లబ్ధి కంటే, ఆయా రంగాల అభివృద్ధికి వారి అనుభవాన్ని ఉపయోగించుకోవడమే ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది.
కార్టూనిస్ట్ శ్రీధర్ దశాబ్దాలుగా సామాజిక అంశాలను తన కుంచెతో విశ్లేషించిన ఆయన అనుభవం ప్రజాభిప్రాయాన్ని అర్థం చేసుకోవడానికి దోహదపడుతుంది. అలాగే ప్రకృతి వైద్యం ద్వారా లక్షలాది మందికి చేరువైన మంతెన సత్యనారాయణ రాజు సేవలను ప్రజారోగ్య పరిరక్షణలో వాడుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇలాంటి నియామకాల వల్ల ప్రజల్లోనూ సానుకూలత వ్యక్తమవుతోంది. కేవలం జీతభత్యాల కోసం కాకుండా, సమాజానికి మేలు చేసే వ్యక్తులు ప్రభుత్వంలో భాగస్వాములవుతున్నారనే అభిప్రాయం కలుగుతోంది.
వైసీపీ హయాంలో సలహాదారులకు క్యాబినెట్ హోదా కల్పించి, భారీగా ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నారనే విమర్శలు ఉండగా, ప్రస్తుత ప్రభుత్వం వారి సంఖ్యను గణనీయంగా తగ్గించింది. గతంలో సలహాదారులు తరచుగా రాజకీయ ప్రెస్ మీట్లు పెట్టి ప్రతిపక్షాలను విమర్శించేవారు. కానీ ఇప్పుడు నియమితులవుతున్న వారు తమ రంగాలకు సంబంధించిన ప్రణాళికల తయారీలో నిమగ్నమవుతున్నారు. ఇది పాలనలో వృత్తిపరమైన విలువలను పెంపొందించే ప్రయత్నం చేస్తున్నారు. బోర్ ఆర్ నాట్ సేమ్ !
