ఎడిటర్స్ కామెంట్ : వినాశకాలే విపరీత బుద్ధి!

” ఎవరికైనా పోయేకాలం వస్తే బుద్ధి పెడదారి పట్టిస్తుందట… అందుకే పెద్దలు వినాశకాలే విపరీత బుద్ధి ” అన్నారు. ఈ వినాశబుద్దులు ఎలా ఉంటాయి..? ఎవరూ చెప్పలేరు. వారు చేసే పనులు వారికి మంచిగానే ఉంటాయి.కానీ వాటి వల్ల బాధలు పడేవారికే మంచివి కాదని తెలుస్తాయి. అయితే ఆ బాధలు పడేవారే రేపు వారి జాతకాన్ని రాయాల్సి వస్తే మాత్రం తర్వాతైనా మనం తీసుకున్న నిర్ణయాలు… చేసిన పనులు వినాశకాలకు దారి తీశాయని అప్పుడు గుర్తిస్తారు. కానీ అప్పటికి ఆకులు పట్టుకోవడానికి చేతులు కూడా ఉండవు. ఇదంతా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవహారశైలి గురించే.

ఉద్యోగుల సొమ్ము నొక్కేసి అడ్డగోలు కబుర్లు చెబుతున్న ప్రభుత్వం !

” ప్రజలెన్నుకున్న ప్రభుత్వం అంటే.. ప్రజలపై సర్వాధికారం అందినట్లే. అంటే వారి ఆస్తులు.. పాస్తులు.. అకౌంట్లలో డబ్బులు సహా. ఎవరి సొత్తు అయినా ప్రభుత్వం అప్పనంగా తీసుకోవచ్చు. ప్రభుత్వానికి ప్రైవేటు అనే పదమే ఉండదు. ప్రైవేటు అయినా ప్రభుత్వానిదే..” ఈ నిబంధనను ఏపీ ప్రభుత్వం పెట్టుకుంది. అనుకున్నట్లుగానే ప్రజల ఆస్తులు, పాస్తులని అడ్డగోలుగా అమ్ముకోవడం.. తాకట్టు పెట్టుకోవడమే కాదు ఇప్పుడు ఏకంగా ఉద్యోగుల అకౌంట్ల నుంచి డబ్బులు డ్రా చేసి తీసేసుకుంది. జిపిఎఫ్‌ ఖాతాల్లోని తమ సొమ్మును వారి అనుమతి లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం ఉద్యోగులకే కాదు సామాన్య ప్రజలకూ దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. ఎందుకంటే అకౌంట్లలో నగదు వేయడం ఎవరైనా వేయవచ్చు కానీ..తీయడం మాత్రం అకౌంట్ హోల్డర్‌కు మాత్రమే సాధ్యం. అలా తీస్తే.. అది ఖచ్చితంగా నేరం అవుతుంది. కానీ ఏపీ ప్రభుత్వం ఇలాంటి నేరాల్ని అలోవకగా చేసేస్తోంది. పిఎఫ్‌ ఖాతాలో ఒకసారి జమయిన మొత్తం సురక్షితంగా ఉంటుందని ఎవరైనా భావిస్తారు. దానికి విరుద్ధంగా ఖాతాలో పడిన మొత్తం పడినట్టుగానే మాయం అయింది. ఆ పని ఇతరులు ఎవరైనా చేసిఉంటే నేరం అవుతుంది. ఐపిసి సెక్షన్ల కింద కేసు పెట్టి జైలుకు పంపే అవకాశం ఉంటుంది. కానీ, కంచే చేను మేసినట్లు రాష్ట్ర ప్రభుత్వమే ఆ నిర్వాకానికి పాల్పడితే ఉద్యోగులు ఎవరికి చెప్పుకోవాలి? . గతంలోనూ ఇలాగే చేసి ఉద్యోగుల జీపీఎఫ్ సొమ్ము తీసుకున్నారు. ఇది రెండో సారి.

సైబర్ ఫ్రాడ్‌స్టర్లు కూడా ఇంత దారుణంగా చేయరుగా !

ప్రాణం మీదకు వస్తేనో, మరేదైనా అత్యవసరమైన ఖర్చు ముంచుకొస్తేనో ఆ గండం దాటడానికి జిపిఎఫ్‌లో మొత్తాన్ని ఉద్యోగులు వాడుకుంటారు. ఆ అవసరం రాకపోతే ఉద్యోగ విరమణ అనంతర ఖర్చుల కోసం దాచుకుంటారు. అది వారి హక్కు. 2018 జులై నుండి 2021 జూన్‌ వరకు ఉన్న డిఎ బకాయిలను జిపిఎఫ్‌ ఖాతాల్లో జమ చేస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటించింది. 2021 ఏప్రిల్‌ నుండి 2022 జూన్‌ వరకు ఐదు విడతలుగా అలా జమచేసింది. ఇలా జమ చేసిన మొత్తాన్ని మార్చి నెలలో ఒకేసారి వెనక్కి తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 90 వేల మంది ఉద్యోగ, ఉపాధ్యాయుల ఖాతాల నుండి ఇలా రూ. 800 కోట్ల రూపాయలు ప్రభుత్వం వెనక్కి తీసుకుని ఉంటుందని అంచనా. పూర్తి వివరాలు బయటకు రావాల్సి ఉంది. మార్చిలో ప్రభుత్వం ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకుంటే, జూన్‌ నెలాఖరుకుగాని సంబంధిత ఉద్యోగులకు కూడా ఆ విషయం తెలియలేదంటే ప్రభుత్వం ఎంత గోప్యంగా… రహస్యంగా… ఆర్థిక నేరానికి పాల్పడిందో అర్థం చేసుకోవచ్చు. అది కూడా ఎజి కార్యాలయం జిపిఎఫ్‌ ఖాతాలకు సంబంధించిన వివరాల స్లిప్పులను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసి, ఉద్యోగులు వాటిని డౌన్‌లోడ్‌ చేసుకున్న తరువాతనే తెలిసింది. నిజానికి ఉద్యోగులు తమ ఖాతాల్లో జీపీఎఫ్ డబ్బులున్నాయని అత్యవసర ఖర్చుల కోసం పెద్ద ఎత్తున ధరకఖాస్తులు పెట్టుకున్నారు. దరఖాస్తులను కారణం కూడా చెప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది.

మామూలుగా అయితే క్రిమినల్ నేరం.. ప్రభుత్వమే చేస్తే ఎలా ?

ఇప్పుడు విషయం వెలుగులోకి వచ్చిన తరువాత కూడా ప్రభుత్వ వర్గాలు స్పష్టమైన వివరణ ఇవ్వలేదు. మళ్లించిన మొత్తాన్ని ఉద్యోగుల ఖాతాల్లో తిరిగి ఎప్పుడు జమ చేస్తారో కూడా చెప్పడం లేదు. ఇంత కంటే దారుణం ఏమిటంటే అసలు జీపీఎఫ్ సొమ్ములు ప్రభుత్వం ఇవ్వలేదని చెబుతున్నారు. సాంకేతిక కారణంతోనే ఆ బిల్లులు పేమెంట్‌ అప్లికేషన్‌లో క్లియర్‌ కాకుండానే.. ఆ మొత్తం ఉద్యోగుల ఖాతాలో జమ అయ్యిందని వాదిస్తున్నారు. ట్రెజరీ నిబంధనల ప్రకారం మార్చి 31 నాటికి పెండింగ్‌లో ఉన్న బిల్లులన్నీ రద్దవుతాయని అందుకే ఆ మొత్తాన్ని సాఫ్ట్‌వేర్‌ వెనక్కి పంపించిందని చెబుతున్నారు. సాఫ్ట్ వేర్‌లో ఇలాంటి ఫెసిలిటీ ఉందని ఫైనాన్షియల్ టెక్నాలజీలో పండిపోయిన నిపుణులకూ తెలియడం లేదు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ఉద్దేశించిన బిల్డింగ్‌ సెస్‌ రూ. 700 కోట్ల రూపాయలను ఇతర అవసరాల కోసం మళ్లించారు. రెక్కాడితే కానీ డొక్కాడని భవన నిర్మాణ కార్మికులు ఆ మొత్తం కోసం ఇప్పటికీ ఆందోళనలు చేస్తూనే ఉన్నా, ప్రభుత్వం స్పందించడం లేదు. కరోనా కష్టకాలంలో ఆ మొత్తం ఉండి ఉంటే ఎన్ని నిరుపేద కుటుంబాలకు ఎలాంటి సాయం చేయలేదు. బిల్డింగ్‌ సెస్‌, జిపిఎఫ్‌ మరేదన్నా నిధులున్నా వాటికి ప్రభుత్వం సంరక్షకుడే కానీ యజమాని కాదు. కళ్లముందు కనపడ్డ ప్రతి రూపాయినీ ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు చేస్తాం. వీలైనప్పుడు తిరిగి ఇస్తాం అంటే అది ఇష్టారాజ్యం అవుతుంది కానీ ప్రజాపాలన కాదు. లక్షలాది మంది ఉద్యోగులు, కార్మికులకు సంబంధించిన నిధులపై ఏకపక్షంగా వ్యవహరించడం ఏ ప్రభుత్వానికైనా మంచిది కాదు. కానీ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. ఉద్యోగుల సొమ్ము అంటే తమ సొమ్మే అన్నట్లుగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం ఉద్యోగుల సొమ్ము విషయంలో ప్రభుత్వం ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోనూ.. అసలు ఎలాంటి నిధులు ఇవ్వలేదని.. త్వరలో ఇస్తామని.. రాంగ్ ఎంట్రీ అని వాదిస్తోంది.

ఈ ఒక్కటే కాదు అసలు ఆర్థిక పరంగా అన్నీ తప్పుడు లెక్కలే !

ఏపీ ప్రభుత్వ దొంగ లెక్కలకు అంతే ఉండటం లేదు. చివరికి కాగ్ కూడా.. ఈ లెక్కలను తట్టుకోలేకపోతోంది. పూర్తి వివరాలు కావాలని ఎప్పటికప్పుడు అడుగుతున్నా స్పందించడం లేదు. చివరికి ప్రభుత్వం ఇచ్చిన వివరాల్నే కనీసం సర్టిఫై చేయకుండా ఇస్తోంది. ఎంత దారుణమైన తప్పుడు లెక్కలను ప్రభుత్వం రాస్తోందంటే… గత ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు రూ.17,234 కోట్లు ఖర్చు చేసినట్లు చూపించగా, మార్చి వచ్చేసరికి ఈ మొత్తం రూ.14,681 కోట్లకు తగ్గిపోయింది. ఇది కాగ్‌కు సమర్పించిన లెక్క. 2022 మార్చి 31 నాటికి పలు సంస్థలకు ఇచ్చిన గ్యారెంటీల వివరాలు, ఎప్పుడు ఇచ్చారు, ఎంత మొత్తానికి ఇచ్చారన్నది కాగ్‌కు ఆర్థికశాఖ వివరించాల్సి ఉంటుంది. అలాగే మార్చి 31 నాటికి తీసుకున్న రుణాలు, గత రుణాలకు చేసిన చెల్లింపులు, వడ్డీల వివరాలు, ఇంకా ఎంత అప్పు ఉందన్నది కూడా స్పష్టం చేయాల్సి ఉంటుంది. అయితే ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వివరాలు తమకు అందలేదని కాగ్‌ బయటపెట్టలేదు.అసలు అప్పుల వివరాలు ఇంత వరకూ తేలేదు. అందరికీ తెలిసి.. బహిరంగంగా… ఆ ఆర్థిక సంవత్సరం మూడు నెలల్లో రూ. ముఫ్పై వేల కోట్ల అప్పు తెచ్చారు. కానీ చాలా వరకూ అప్పుల లెక్కల్లో చూపించడం లేదు.

ఎన్నికల్లో గెలవడం అంటే ప్రజల సంపదకు ఓనర్లు అవడం కాదు !

ప్రభుత్వం చేయాల్సినది కేవలం కస్టోడియన్‌గానే. ప్రభుత్వ ఆదాయం ప్రభుత్వ పాలకులది కాదు. ప్రజలదే. ప్రజల ఆదాయాన్ని ఆచి తూచి బాధ్యతగా ఖర్చు పెట్టాలి. అప్పులు తెచ్చినా ఆ.. అప్పులకు పాలకులు వ్యక్తిగతంగా బాధ్యత వహించరు. ప్రజలదే బాధ్యత. ఈ రోజు ఏపీలో అన్నింటి రేట్లు ఎక్కువగా ఉండటానికి కారణం పన్నులు. ఈ పన్నులు ఎందుకు పెంచుతున్నారు ? ప్రభుత్వాలు చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికి అసలు కట్టాడనికి చేస్తున్నారు. ఓ వైపు ప్రజల్ని ఇలా పిండేస్తూ.. మరోవైపు ఆదాయం.. అప్పులకు నిరర్థక వ్యయం చేస్తూ.. ప్రజల్ని . ఉద్యోగులని నిట్ట నిలువుగా మోసం చేయడం క్షమార్హం కాదు. ప్రజలు రేపుమహా అయితే ఓడిస్తారు.. దాంతో పదవి పోయిందని వారు పక్కకుపోతారు..కానీ జరిగే నష్టానికి బాధ్యులెవరు ? ప్రజలు రెండు తరాల పాటు వడ్డీలు కట్టుకోవాల్సిన ఆగత్యం ఒక్క చాన్స్ ఇచ్చినందుకు ఎందుకు కల్పించాల్సి వస్తుంది. చివరికి అప్పులు పోను.. అకౌంట్లలో డబ్బులు కూడా మిగల్చనీయకుండా చేస్తున్నారంటే.. ఇక ఏమనుకోవాలి. ఇప్పటికే ప్రజల ఆస్తులకు గ్యారంటీ లేకుండా పోయింది. పెద్ద ఎత్తున భూముల పేర్లను ఆన్ లైన్‌లో మార్చేసి భూకబ్జాలకు పాల్పుడతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. కొన్ని లక్షల ఎకరాల యజమానులు మారిపోయారన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అదే సమయంలో ప్రజల ప్రైవేటు ఆస్తులకు గ్యారంటీ లేకుండా పోయింది. ఎక్కడిక్కకడ మూకదాడులు జరుగుతున్నాయి. రాను రాను పరిస్థితి దారుణంగా మారుతోంది.

ఇప్పటికైనా ప్రజలకు వాస్తవాలు చెప్పాలి !

ఇప్పుడు ఉద్యోగుల సొమ్ము తీసుకున్నారు.. రేపు ప్రజల సొమ్ము తీసుకుంటారు.. లేకపోతే వారి ఆస్తులను తాకట్టు పెట్టుకునేలా కొత్త చట్టం తెచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇప్పటికే ప్రభుత్వ ఖర్చులకు అసలు లెక్కలు లేకుండా పోయాయి. చివరికి చిన్న చిన్న కాంట్రాక్టర్లకూ డబ్బులు చెల్లించలేని దుస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలు ప్రజల్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. వినాశకాలే విపరీత బుద్ది అన్న విషయం ప్రజాగ్రహానికి గురయిన తర్వాత తెలుసుకోవడం కన్నా.. ప్రభుత్వం ముందే బయట పెడితే బాగుంటుంది. మొత్తం గత మూడేళ్లలో తెచ్చిన అప్పులు.. చేసిన ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలి. ఆర్థిక పరమైన ఆదేశాలను ఎప్పటికప్పుడు పబ్లిక్ డొమైన్‌లో ఉంచాలి. అన్నీ రహస్యంగా ఉంచేసి..ప్రజల్ని మభ్య పెడుతున్నామని .. ఎంత కాలమైనా ఇలా చేయవచ్చని అనుకుంటే ప్రజలు కర్రు కాల్చి వాతపెడతారు. కానీ ఇప్పటికే వారికి తాము పెట్టేశామని.. అనుకుంటే చేయగలిగిందేమీ లేదు. వారు చేసే నష్టం ప్రజలకు కాదు… రాష్ట్రానికి అని గుర్తుంచుకోవాల్సి ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆర్కే పలుకు : ఆ విలువలు అందరికీ వర్తిస్తాయిగా !

మాధవ్ వీడియో సోషల్ మీడియాలో వస్తే దాన్ని మీడియాకు ఎక్కించి ఆయనను రోడ్డు మీద నిలబెట్టిన ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణను అంత కంటే ఎక్కువంగా మానసికంగా ఇబ్బందిపడేలా తిట్టారు హిందూపురం ఎంపీ....

మాధవ్ వీడియోను ఇక టీడీపీ వదలదా !?

మాధవ్ వీడియో ఒరిజినల్ కాదు కాబట్టి .. అందులో ఉన్నది ఎవరో చెప్పలేమని అనంతపురం ఎస్పీ చెప్పారు. ఆ వీడియోను ఫోరెన్సిక్‌ను పంపలేదన్నారు. దీంతో టీడీపీ నేతలు అమెరికాలోని ప్రసిద్ధ ఫోరెన్సిక్ ల్యాబ్‌ను...

ఆ ప్రాజెక్టులు కట్టొద్దని జగన్‌కు స్టాలిన్ లేఖ !

ఇప్పటికి తెలంగాణలో ఉన్న నీటి పంచాయతీలే తేల్చుకోలేకపోతున్నారు.. ఇప్పుడు తమిళనాడుతోనూ కొత్తగా వివాదాలకు దిగాల్సిన పరిస్థితి వచ్చింది. ఏపీ-తమిళనాడు సరిహద్దుల్లో కుశస్థలి నదిపై ఏపీ నిర్మిస్తున్న రెండు ప్రాజెక్టుల్ని తక్షణం నిలిపివేయాలని తమిళనాడు...

సర్వేలో సీట్లు తగ్గిపోయినా సంబరపడిపోతున్నారేంటి !?

వైసీపీ నేతల తీరు విచిత్రంగా ఉంది. తాజాగా వస్తున్న సర్వేల్లో ఓ మాదిరి ఫలితాలు వచ్చినా గొప్పగా ప్రచారం చేసుకుంటోంది. సీట్లు పడిపోతున్నాయని చెప్పినా.. దాన్నే ప్రచారం చేసుకుంటోంది. దీంతో ఆ పార్టీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close