అమరావతి రాజధాని నిర్మాణంలో వేగం పెంచడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీఆర్డీఏ కమిషనర్‌ను మారుస్తూ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. మంత్రి నారాయణ ఆశించిన వేగానికి, క్షేత్రస్థాయి పనితీరుకు మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
కన్నబాబు .. రైతుల సమస్యలు తీర్చడంలో విఫలం
అమరావతి నిర్మాణంలో భూములిచ్చిన రైతుల సమస్యలు గత కొంతకాలంగా అపరిష్కృతంగా ఉన్నాయి. ప్లాట్ల కేటాయింపులో జాప్యం, మౌలిక సదుపాయాల కల్పనపై రైతులు అసంతృప్తితో ఉన్నారు. గత కమిషనర్ ఈ విషయంలో కొంత ఉదాసీనంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. కొత్త కమిషనర్ విజయరామరాజు రైతులతో ప్రత్యక్షంగా సంభాషించి, వారి నమ్మకాన్ని పునరుద్ధరించడంపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. నిర్మాణ పనులు కూడా కన్నబాబు హయాంలో ఆశించిన స్థాయిలో ముందుకు సాగలేదన్న విమర్శలు, ముఖ్యంగా మంత్రి నారాయణ నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడంలో యంత్రాంగం వెనుకబడిందన్న భావన ప్రభుత్వంలో కలిగింది. ఇప్పుడు కొత్త కమిషనర్ ముందున్న ప్రధాన సవాలు.. ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా యంత్రాంగాన్ని పరుగులు పెట్టించడమే.
నిర్మాణ సంస్థల సమన్వయం – టార్గెట్ రీచ్
నిర్మాణ సంస్థలపై ఒత్తిడి తెచ్చి, ఒప్పందాల ప్రకారం పనులు పూర్తి చేయించడం సీఆర్డీఏకి పెద్ద టాస్క్. మంత్రి నారాయణ నిరంతరం పర్యవేక్షిస్తున్నా, అధికారుల సమన్వయ లోపం వల్ల కాంట్రాక్టర్లు తమ డెడ్లైన్లను పాటించలేదనే విమర్శ ఉంది. ఇప్పుడు ఐకానిక్ భవనాలు, రోడ్లు , ఇతర మౌలిక వసతుల పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయించాల్సి ఉంది. పనుల్లో జాప్యం చేసే సంస్థలపై కఠినంగా వ్యవహరిస్తూనే, వారికి ఎదురయ్యే సాంకేతిక, ఆర్థిక అడ్డంకులను తొలగించాల్సిన బాధ్యత కొత్త కమిషనర్‌పై ఉంది.
మంత్రి నారాయణకు సవాలు
రాజధాని నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మంత్రి నారాయణకు కూడా ఇది ఒక పరీక్షా సమయమే. తను కోరుకున్న ఆఫీసర్‌ను తెచ్చుకున్న తర్వాత కూడా ఫలితాలు రాకపోతే అది పాలనాపరమైన వైఫల్యమే అవుతుంది. ఆయన నిరంతరాయంగా రోజుకు పద్దెనిమిది గంటలు పని చేస్తారు. అయితే ఆయన అధికారులతో ఆ స్థాయిలో పని చేయించకపోయినా…. వారితో ఫలితాలు తెచ్చుకునేలా పని చేయించుకోవాల్సి ఉంది. తన టీమ్‌ను ఎప్పటికప్పుడు మార్చుకున్నా.. సమస్యల పరిష్కారం.. పనుల వేగం మాత్రం కొనసాగాల్సి ఉంది. అందుకే ప్రభుత్వం ఆయన కోరిన అధికారుల్ని నియమిస్తోంది.


