హైదరాబాద్ లో బడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, సిమెంట్ కంపెనీల ఓనర్లు మాత్రమే కాదు.. టీవీ9 చానల్స్ ను అడ్డగోలుగా దక్కించుకుని తెలుగుదేశం పార్టీతో పాటు చంద్రబాబు, లోకేష్ పై తప్పుడు ప్రచారం చేయడంలో అన్ని గీతలు దాటిపోయిన మైహోమ్ ఓనర్లు చేసిన ఓ స్కామ్‌ను ప్రభుత్వం కూడా చూసీచూడనట్లుగా వదిలేసింది. అలా వదిలేయడమే కాదు .. తాను కూడా సాయం చేసింది. ఈ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆంధ్రజ్యోతి ఈ విషయాన్ని బయట పెట్టింది.
క్యాప్టివ్ మైన్స్ లీజుకు తీసుకుని గోల్ మాల్
సిమెంట్ పరిశ్రమ పెడతామని చెప్పి 919 ఎకరాలు సున్నపురాయి గనుల్ని మైహోమ్ లీజుకు తీసుకుంది. ఇది పల్నాడు జిల్లాలో ఉంది. కానీ గడువులోగా పరిశ్రమ పెట్టలేదు. క్యాప్టివ్ మైనింగ్ పేరుతో లీజుకు తీసుకున్నందున పరిశ్రమ పెడితేనే ఆ గనుల్ని వాడుకోవాలి. కానీ ఎన్నో సార్లు పొడిగింపులు ఇచ్చినా ఫ్యాక్టరీ మాత్రం పెట్టలేదు. అయితే అక్కడి నుంచి సున్నపు రాయిని మాత్రం తరలించుకుపోతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
లీజులు వేరే కంపెనీకి బదలాయింపు
తమ కంపెనీకి ఉన్న లీజుల్ని వేరే కంపెనీకి బదలాయిస్తున్నామని అనుమతించాలని ఎన్సీఎల్టీలో కేసు వేశారు. ఎన్సీఎన్టీ ఆమోదించింది. అసలు లీజుల బదలాయిస్తున్నామని ఆమోదించాలని ఎన్సీఎల్టీకి వెళ్లడమే విచిత్రం. ఆ లీజులేమీ ఎన్సీఎల్టీ ఇవ్వలేదు. ఎన్సీఎల్టీ నుంచి ఆర్డర్ ఉందని ఇప్పుడు కొత్త కంపెనీ మళ్లీ ఏపీ ప్రభుత్వానికి దరఖాస్తు చేసింది. తమ లీజుల్ని ఆ కంపెనీ పేరు మీదకు మార్చాలని కోరింది.
క్యాప్టివ్ పదం తీసేసి బదలాయింపు
క్యాప్టివ్ అనే పదాన్ని తీసేసి ప్రభుత్వం మైహోమ్ ..లీజులు బదిలీ చేసిన కంపెనీకి లీజులు కేటాయిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. అంటే ఇక పరిశ్రమ పెట్టాల్సిన పని లేదు. కానీ సున్నపురాయిని మాత్రం తరలించుకుపోతారు. ఈ కంపెనీ మైహోమ్ సూట్ కేసు కంపెనీగా భావిస్తున్నారు. మొత్తంగా ఈ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం హైహోమ్ చేసిన అక్రమాలకు అండగా నిలిచింది. స్కామ్ లో భాగం అయిందన్న ఆరోపణలు వస్తున్నాయి.
రవిప్రకాష్ నుంచి టీవీ9ను లాక్కోవడానికి, ఆయనను ఆ సంస్థ నుంచి బయటకు పంపడానికి తర్వాత కేసుల్లో ఇరికించడానికి ఇలాంటిప్లాన్లనే మైహోమ్ ఓనర్లు అమలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. తమకు వ్యతిరేకంగా ఐదేళ్ల పాటు విషం కక్కిన మీడియా చానల్ యాజమాన్యానికి ఎందుకు ఇలా మేలు చేస్తున్నారు..? వారి అక్రమాలను ఎందుకు దాచి పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నది మాత్రం టీడీపీ క్యాడర్ కు అర్థం కాని విషయం.