ఉగాది పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు తీపి కబురు అందించేందుకు సిద్ధమవుతోంది. ఎన్నికల హామీలో భాగంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్న మాటను నిలబెట్టుకుంటూ, ఈ ఏడాది 10,000 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసింది. దీనికి సంబంధించిన కసరత్తును ఆర్థిక శాఖ , సాధారణ పరిపాలన శాఖ ఇప్పటికే పూర్తి చేశాయి. ఈ జాబ్ క్యాలెండర్ను ఉగాది పర్వదినం నాడే అధికారికంగా విడుదల చేసే అవకాశం ఉందని సచివాలయ వర్గాలు చెబుతున్నాయి.
ఈ భారీ రిక్రూట్మెంట్లో భాగంగా వివిధ కీలక శాఖల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. ముఖ్యంగా విద్యాశాఖలో సుమారు 3,000 టీచర్ , ఇంటర్మీడియట్ పోస్టులు, పోలీస్ శాఖలో 3,000 ఎస్సై , కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటితో పాటు విశ్వవిద్యాలయాల్లో 1,500 అసిస్టెంట్ ప్రొఫెసర్స్ పోస్టులు, గ్రూప్-1లో 100, గ్రూప్-2లో 500 పోస్టులను ఈ క్యాలెండర్లో చేర్చినట్లు తెలుస్తోంది. ఇంజనీరింగ్ విభాగంలో 500 AE పోస్టులు, సంక్షేమ హాస్టళ్లలో 200 వార్డెన్ పోస్టులు మరియు అటవీ శాఖలో 100 పోస్టులను దశలవారీగా భర్తీ చేయనున్నారు.
ప్రభుత్వం ఈ 10,000 పోస్టులను ఎప్పుడెప్పుడు భర్తీ చేస్తారో క్యాలెండర్ రిలీజ్ చేస్తారు. దానికి తగినట్లుగా నోటిఫికేషన్లు ఇస్తారు. ప్రతి ఏటా ఉగాదికి ఒక కొత్త జాబ్ క్యాలెండర్ను విడుదల చేయడం ద్వారా నిరుద్యోగులకు ముందస్తుగా సమాచారం అందించి, వారు ప్రిపరేషన్ సాగించేలా సమయం ఇవ్వాలని భావిస్తోంది. దీనివల్ల రిక్రూట్మెంట్ ప్రక్రియలో పారదర్శకత పెరగడమే కాకుండా, కోర్టు కేసులు , ఇతర అడ్డంకులు లేకుండా నియామకాలు పూర్తి చేసే వీలుంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
ఇప్పటికే 60కి పైగా ప్రభుత్వ విభాగాల నుంచి ఖాళీల వివరాలను సేకరించిన అధికారులు, మార్చి నెలాఖరులోగా నోటిఫికేషన్ల షెడ్యూల్ను ఖరారు చేయనున్నారు. ఏపీపీఎస్సీ ద్వారా గ్రూప్ పోస్టులను, రిక్రూట్మెంట్ బోర్డుల ద్వారా పోలీస్ , టీచర్ పోస్టులను భర్తీ చేస్తారు. ఉగాది నాడు క్యాలెండర్ వెలువడితే, ఏప్రిల్ లేదా మే నెలల నుంచి వరుసగా నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంది.


