ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సోషల్ మీడియా కేసుల్లో జ్యుడీషియల్ మేజిస్ట్రేట్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. సోషల్ మీడియా పోస్టులు లేదా కామెంట్లతో సంబంధం ఉన్న కేసుల్లో రిమాండ్ విధించే ముందు సుప్రీం కోర్టు ఇచ్చిన ఆర్నేష్ కుమార్ తీర్పు, ఇమ్రాన్ ప్రతాప్‌గఢి కేసులో తీర్పు మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని జ్యుడీషియల్ మేజిస్ట్రేట్లను ఆదేశించింది.
ఇమ్రాన్ ప్రతాప్‌గఢి తీర్పు ప్రకారం, ప్రసంగం, రచన, కళాత్మక వ్యక్తీకరణకు సంబంధించిన కేసుల్లో (3-7 సంవత్సరాల శిక్ష విధించే నేరాలు ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ముందు ప్రాథమిక విచారణ తప్పనిసరి అని సర్క్యులర్‌తో తెలిపింది. ఈ విచారణకు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ స్థాయి అధికారి నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి మరియు విచారణ 14 రోజుల్లో పూర్తి చేయాలని నిర్దేశించింది.
ఆర్నేష్ కుమార్ తీర్పులోని మార్గదర్శకాల ప్రకారం 7 సంవత్సరాల కంటే తక్కువ శిక్ష ఉన్న నేరాల్లో అరెస్టు ఆటోమేటిక్‌గా ఉండకూడదని.. పోలీసులు అరెస్టు చేయడానికి సమర్థమైన కారణాలను రికార్డు చేయాలని తెలిపింది. ఈ ఆదేశాలను ఉల్లంఘించిన మేజిస్ట్రేట్లపై శాఖాపరమైన విచారణ జరుగుతుందని హైకోర్టు హెచ్చరించింది.