మనిషి అన్నాక కాస్త గౌరవం కాపాడుకోవాలి.. రాజకీయ పార్టీ అన్నాక ప్రజల్ని కూడా గౌరవించాలి.. రెండూ లేకుండా ఎప్పటికప్పుడు దుర్గంధాన్ని వెదజల్లుతూ అంతా రచ్చే చేస్తామని రోడ్ల మీద పడితే ప్రజలు ఎంతో కాలం సహించరు. వైసీపీది అదే పరిస్థితి. ఇప్పటికే పాతాళంలోకి పడేశారు. మళ్లీ మళ్లీ బయటకు రాకుండా.. ప్రజలు మట్టి వేసేలా వ్యవహరిస్తున్నారు. జరిగిన తప్పులేమిటో తెలుసుకోవడంలేదు.. జరుగుతున్న తప్పులేమిటో అంచనా వేయడం లేదు. ప్రజలంతా అసహ్యించుకునేలా మాట్లాడుతూనే ఉన్నారు. పనులు చేస్తూనే ఉన్నారు.
రుణాలు ఇవ్వొద్దని, పెట్టుబడులు పెట్టవద్దని మెయిల్సా ?
ఏపీకి రుణాలు రావొద్దని.. పెట్టుబడులు పెట్టవద్దని బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు జగన్ రెడ్డి మెయిల్స్ రాయిస్తున్నారు. బ్యాంకుల్లో పిటిషన్లు వేయించి.. దాన్ని కూడా బూచిగా చూపిస్తున్నారు. ఆర్థిక మంత్రి బుగ్గన వీటికి ఆధారాలు బయట పెట్టారు. ఎక్కడో జర్మనీలో ఉండే ఉదయ్ భాస్కర్ అనే వ్యక్తి రెండు వందల మెయిల్స్ తప్పుడు సమాచారంతో ఆర్థిక సంస్థలకు పెట్టారు. అది కుదరడం లేదని అప్పిరెడ్డితో కోర్టులో పిటిషన్ వేయించి.. మళ్లీ విచారణలో ఉందని రుణాలివ్వొద్దని మెయిల్స్ పెట్టారు. పెట్టుబడిదారులకు బెదిరింపు మెయిల్స్ పెడుతున్నారు. ఇలాంటి మనస్థత్వం ఉన్న వారికి రాజకీయాల్లో ఉండే అర్హత ఉంటుందా?
దండయాత్రలు చేస్తున్న వైసీపీ అధినేత
మరో వైపు రాష్ట్రంలో అలజడి రేపేందుకు వైసీపీ అధినేత పర్యటనలు చేస్తున్నారు. అవసరం లేకపోయినా.. భారీ జన సమీకరణాలు చేసి.. పలువురు చావులకు కారణం అవుతున్నారు. దాడులు, దౌర్జన్యాల ముఠాలను పెంచుతున్నారు. అసాంఘిక శక్తులకు అండగా ఉంటానని సంకేతాలు ఇస్తున్నారు. తాము మళ్లీ వస్తే నరికేస్తామని..దోచుకుంటామని బెదిరిస్తున్నారు.
మహిళలపై జుగుప్సాకరమైన వ్యాఖ్యలు
నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అనే పెద్ద మనిషి.. తనపై గెలిచిన మహిళా ఎమ్మెల్యేపై అత్యంత నీచమైన భాషను వాడారు. ఆయన ఉద్దేశపూర్వకంగానే ఆ మాటలు మాట్లాడారు. ఆయన స్క్రిప్ట్ రాసుకొచ్చి మరీ ఆ మాటలు మాట్లాడారు. అంటే.. ఎంత ప్రణాళికతో మహిళా నేతలపై దాడులు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అధికారంలో ఉన్నప్పుడు వీరు మాట్లాడే బూతులకు ప్రజలు చెప్పుతో కొట్టినట్లుగా సమాధానం ఇచ్చారు. అయినా నేర్చుకోలేదు. ఘోరంగా దిగజారిపోతున్నారు.
ఈ దుర్గంధాన్ని ఏపీ భరించగలదా ?
ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వ నిధుల సమీకరణపై కుట్రలు తన్నుతూ.. తప్పుడు ప్రచారాలు చేస్తూ.. ఘోరమైన నేరాలకు పాల్పడుతూంటే.. మరో వైపు బూతులతో నేతలు మహిళా నేతల్ని కించపరుస్తున్నారు. దానికి తోడు.. జగన్ రెడ్డి దండయాత్రలు చేస్తున్నారు. ఏపీ రాష్ట్రం, ప్రజలు భరించలేనంత దుర్గంధాన్ని వైసీపీ వెదజల్లుతోంది. వారిని ప్రజలే వదిలించుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది.