ఏ చెట్టూ లేని చోట ఆముదం చెట్టే మహా వృక్షం అవుతుందన్నట్లుగా.. పెద్ద పెద్ద నేరాలు లేని చోట.. చిన్న చిన్న నేరాలే గొప్ప ప్రచారానికి కారణం అవుతూంటాయి. వాటికే ప్రచారం లభించి.. శాంతిభద్రతల గురించి ఆలోచించాల్సిన పరిస్థితులు కల్పిస్తాయి. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అదే జరుగుతోంది. సమాజం అన్నాక రక రకాల మనుషులు ఉంటారు.. అనేక మనస్థత్వాలు ఉంటాయి. ఆవేశంలో నేరాలు చేస్తూ ఉంటారు. ఉద్దేశపూర్వకంగా చేసేవారు ఉంటారు. కీచకులు ఉంటారు. కానీ దొరికే దాకా వారి నేరాలు బయటపడవు. దొరికిన తర్వాత అసలు ప్రచారం బయటపడుతుంది.
కందుకూరు లాంటి హత్యల్ని ఆపడం పోలీసుల వల్ల అవుతుందా ?
కందుకూరులో ఇద్దరు వ్యక్తులు పొట్లాడుకున్నారు. ఓ వ్యక్తి హత్య చేశాడు. ఇది వ్యక్తిగత శత్రుత్వంతో జరిగిన హత్య. ఇలాంటి హత్యల్ని పోలీసులు ఆపడం అసాధ్యం. ఎటా ఏపీలో 9000 హత్యలు నమోదు అవుతాయని పోలీసు శాఖలో మూడు దశాబ్దాలకు పైగా పని చేసిన ఏబీ వెంకటేశ్వరరావు తెలిపారు. పోలీసులు ఈ హత్యల్ని ఆపలేరు. అసలు నేరాలు జరగని సమాజమే ఉండదు. చట్టాలు ఎంతో బలంగా ఉన్నాయని.. తప్పించుకోలేరని పేరు ఉన్న దేశాల్లోనే నేరాలు ఆగడం లేదు. అలాంటిది.. శిక్ష పడాలంటే.. ఏళ్లూ, పూళ్లు పట్టే మన దేశంలో నేరాలు చేయాలనుకునేవారికి పెద్దగా భయం ఉంటుందని అనుకోవడానికి లేదు. ఇలాంటి సమయంలో పోలీసులకు ఆవేశంలో జరిగే నేరాలను ఆపడం అసాధ్యం.
ఊరూరా కీచకులు – బయటపడేవరకూ పట్టుకోలేరు !
తునిలో ఓ వృద్ధుడు తాతను అని చెప్పి ఎనిమిదేళ్లు బాలికపై దురగతానికి పాల్పడుతున్నాడు. బయటపడింది కాబట్టి తెలిసింది. లేకపోతే ఇంట్లో వాళ్లకూ తెలియదు. ఇంట్లో వాళ్లు కూడా పాపను ఎవరైనా బయటకు తీసుకెళ్తున్నారా.. లేదా అన్నది పట్టించుకోలేదు. చివరికి ఎవరో వీడియో తీయబట్టి నిజం తెలిసింది. పోలీసులు చర్యలు తీసుకుంటారు.. కానీ ఇలాంటివి జరగడం అమానుషం. ఆ వృద్ధుడికి భూమి మీద ఉండే హక్కు లేదు. అలాంటి వారు బయటపడేవరకూ పెద్ద మనుషులుగానే ఉంటారు. ఇది పోలీసుల వైఫల్యం కాదు. వ్యవస్థలోని వైఫల్యం. ముందు నుంచి సమాజంలో పేరుకుపోయిన నిర్లక్ష్య వైఫల్యం.
వ్యవస్థీకృత నేరాలపై ఉక్కుపాదం
ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత వ్యవస్థీకృత నేరాలపై ఉక్కుపాదం మోపారు. ఐదు సంవతర్సాల పాటు వైసీపీ హయాంలో .. రౌడీలకు స్వేచ్ఛ ఉండేది. రౌడీలు పోలీస్ స్టేషన్లపై దాడులు చేసేవారు. పోలీసులకు స్వేచ్ఛ ఉండేది కాదు. కానీ కూటమి పాలనలో ప్రజలకు శాంతిభద్రతలపై భరోసా లభిస్తోంది. అసాంఘిక కార్యకలాపాలు తగ్గిపోయాయి. పోలీసులకు అత్యాధునిక టెక్నాలజీని సమకూర్చి ప్రభుత్వం వారి పనితీరును మెరుగు పరుస్తోంది. పేకాట, గంజాయి సహా.. భవిష్యత్ ను నాశనం చేసే ఏ నేరాన్నీ వదిలి పెట్టడం లేదు. ఆ విషయం బయట ఉన్న వారికి.. వాటి గురించి తెలియని వారికి స్పష్టత ఉండదు కానీ.. అసలు ఆ రంగంలో ఉన్నవారికి సెగ తెలుస్తుంది.
ఆవేశంలో.. లేదా ఇతర వికృతబుద్ధి ఉన్న వారు చేసే నేరాలు శాంతిభద్రతల సమస్యల కిందకు రావు. పెద్ద పెద్ద నేరాలు లేవు కాబట్టి ఇలాంటి నేరాలకు ఎక్కువ ప్రచారం లభిస్తోంది. ఇలాంటి నేరాలు కట్టడి కావాలంటే.. చట్టం పట్ల భయం పెరగాలి.. నేరాలు చేసే వాళ్లకు వెంటనే శిక్షలు పడాలి. అప్పుడు మాత్రమే కాస్త మార్పు వచ్చే అవకాశం ఉంది.