వైసీపీని పూర్తి స్థాయిలో రోడ్డున పడేసేందుకు కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేసుకుంటోంది. ఆ పార్టీ క్యాడర్ అనుభవిస్తున్న పదవుల్ని కూడా ఊడగొట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్ని మూడు నెలల ముందుగానే నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఎస్ఈసీ నీలం సహాని ఏర్పాట్లు ప్రారంభించారు. ఓటర్లు, పోలింగ్ బూత్లు వంటి ప్రక్రియలను డిసెంబర్ లోపు పూర్తి చేయనున్నారు. జనవరిలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తారు.
మూడు నెలలు ముందే నిర్వహించేందుకు చట్టంలో అవకాశం
అసెంబ్లీ ఎన్నికలను, పార్లమెంట్ ఎన్నికలను ఆరు నెలల ముందుగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి చట్టంలో అవకాశం ఉంది. అదే స్థానిక సంస్థల ఎన్నికలను మాత్రం మూడు నెలల ముందుగా నిర్వహించుకోవచ్చు. చట్టంలో ఉన్న ఈ వెసులుబాట్ల ప్రకారం జనవరిలోనే ఎన్నికలు నిర్వహిస్తామని ఎస్ఈసీ ప్రతిపాదిచింది. దానికి ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
మొదట పంచాయతీ, పరిషత్ ఎన్నికలు తర్వాత మున్సిపల్ ఎన్నికలు
ఏపీలో ఎన్నికలకు రాజకీయ పరమైన ఆటంకాలు ఏవీ లేవు.గతంలో కరోనా కారణంగా ఆలస్యం అయింది. లేకపోతే ఈ పాటికి స్థానిక సంస్థల ఎన్నికలూ ప్రతి అయి ఉండేవి. గతంలో ఆలస్యంగా నిర్వహించడంతో ఇప్పుడు కూడా ఆలస్యంగా జరుగుతున్నాయి. 2014కి ముందు .. అసెంబ్లీ ఎన్నికలకు ముందే స్థానిక ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు ఏడాదిన్నర తర్వాత జరుగుతున్నాయి. ముందుగా పంచాయతీ, పరిషత్ ఎన్నికలు ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలను నిర్వహించే అవకాశం ఉంది.
స్థానిక ఎన్నికల్లో వైసీపీ పోటీ చేయడం కష్టమే !
పులివెందులలో ఘోర పరాజయం తర్వాత వైసీపీ స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తుందా లేదా అన్నదానిపై సందేహాలు ఉన్నాయి. ఇప్పటి వరకూ ఎమ్మెల్సీ సహా ఏ ఎన్నికలనూ పోటీ చేయడం లేదు. అన్నింటిలోనూ బహిష్కరించి అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తూ వస్తున్నారు. కానీ పులివెందులలో పోటీ చేయకపోతే పరువు పోతుందని పోటీ చేశారు. అయినా పరువు పోయింది. ఇపుడు స్థానిక ఎన్నికలనూ సరిగ్గా నిర్వహించరని..అధికార దుర్వినియోగం అని చెప్పి.. బహిష్కరించే అవకాశాలు ఉన్నాయి. పోటీ చేసేందుకు వైసీపీ నేతలు కూడా సిద్ధంగా ఉండరు.