ఆంధ్రప్రదేశ్‌కు అతి పెద్ద ఇన్వెస్ట్మెంట్ ప్రకటనలు వస్తున్నాయి. గూగుల్ సబ్సిడరీ దేశంలోనే అతి పెద్ద ఎఫ్‌డీఐను ఏపీలో పెట్టడానికి ముందుకు వచ్చింది. విశాఖలో డేటా సెంటర్ పెట్టబోతోంది. కేబినెట్లో అనుమతి ఇవ్వబోతున్నారు. అలాగే గూగుల్ మరో డేటా సెంటర్ పెడుతోంది. ఇక ఆర్సెలార్ మిట్టల్ కూడా అనకాపల్లి వల్ల భారీ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి రెడీ అవుతోంది.ఈ మూడు సంస్థల మొత్తం పెట్టుబడి దగ్గర దగ్గర మూడు లక్షల కోట్ల రూపాయలు. ఇవే కాదు రెన్యూవబుల్ ఎనర్జీతో సహా అనేక రంగాల నుంచి పెట్టుబడుల ప్రతిపాదనలు వస్తున్నాయి.
ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలను కల్పించడమే ప్రస్తుత ప్రభుత్వం టార్గెట్ గా పెట్టుకుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఏపీని మార్కెట్ చేస్తున్నారు. పారిశ్రామిక వేత్తలను ఆకర్షించేందుకు రాయితీలు ఇస్తున్నారు. ఓ ప్రాంతాన్ని పారిశ్రామికంగా సిద్ధం చేసి.. పెట్టుబడులను ఆకర్షిస్తే ఆ తర్వాత ఆటోమేటిక్ గా ఇతర పరిశ్రమలు వస్తాయి. విభజన తర్వాత పారిశ్రామికంగా వెనుకబడిన ప్రాంతం అయిన ఏపీకి ఆదాయం పెరగాలంటే.. యువతకు ఉపాధి దొరకాలంటే పరిశ్రమల ఆకర్షణ చాలా ముఖ్యం. ఐదు ఏళ్ల పాటు .. ఆ విషయంలో చాలా పొరపాట్లు జరిగాయి. కానీ ఇప్పుడు కరెక్ట్ చేస్తున్నారు.
ప్రభుత్వం ప్రత్యేక ఎకోసిస్టమ్ ఏర్పాటు చేసుకుని ఈ పెట్టుబడులను వేగంగా గ్రౌండ్ అయ్యేలా చూడాల్సి ఉంటుంది. గతంలో కియా పరిశ్రమను ప్రకటించడమే కాదు.. ఎన్నికలు వచ్చేలోపు ఉత్పత్తి కూడా ప్రారంభమయ్యేలా సహకరించారు. ఇప్పుడు కూడా గూగుల్ డేటా సెంటర్లు కానీ.. మిట్టల్ స్టీల్ ప్లాంట్ కానీ.. పెట్టుబడుల ప్రకటనలు చేసిన సాఫ్ట్ వేర్ కంపెనీలను కూడా ఇలాగే గ్రౌండింగ్ చేసుకుని ఉద్యోగావకాశాలు కల్పించగలగాలి.
ఏపీ ఇప్పుడు మౌలిక వసతుల విషయంలో దూసుకెళ్తోంది. బోగాపురం ఎయిర్ పోర్టు రెడీ అవుతోంది. విజయవాడ టెర్మినల్ విస్తరణ దాదాపుగా పూర్తి కావొచ్చింది. రోడ్డు సౌకర్యాలు మెరుగుపడ్డాయి. మ్యాన్ పవర్ కొరత లేదు. అందుకే ప్రభుత్వం పెట్టుబడుల ప్రకటనల్ని వీలైనంత త్వరగా గ్రౌండ్ అయ్యేలా ఫాలోఅప్ చేసుకుంటే ఏపీ రాత మారిపోతుంది.