ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 17 నెలల వ్యవధిలోనే రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి, ఒకేసారి గృహప్రవేశాలను చేయిస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం అన్నమయ్య జిల్లా రాయచోటి మండలంలోని దేవగుడిపల్లి గ్రామంలో జరిగే సామూహిక గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని, లబ్ధిదారులకు ఇంటి తాళాలు అందజేస్తారు. అక్కడి నుంచే వర్చువల్ విధానంలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో నిర్మాణం పూర్తయిన 3,00,192 ఇళ్లను ఒకేసారి ప్రారంభిస్తారు.
పేదల ఇళ్ల గృహప్రవేశాలు
పీఎంఏవై-బీఎల్సీ కింద 2,28,034 ఇళ్లు, పీఎంఏవై గ్రామీణ్ కింద 65,292 ఇళ్లు, పీఎంఏవై జన్మన్ పథకం కింద 6,866 ఇళ్లు. సొంత ఇల్లు లేని పేద కుటుంబాలకు ప్రాధాన్యత ఇస్తూ, గ్రామీణ , పట్టణ ప్రాంతాల్లో ఈ ఇళ్లు కేటాయించారు. లబ్ధిదారులు బుధవారం నుంచి తమ కొత్త గృహాల్లోకి ప్రవేశిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో ఇళ్లులేని పేదల సమస్యకు కొంత పరిష్కారం లభిస్తుంది.
అధికారంలోకి వచ్చాక వేగంగా పూర్తి చేసిన కూటమి ప్రభుత్వం
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 2024 ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఇది కీలకమైనది. అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర నిధులను సమర్థవంతంగా వినియోగించుకుని, స్థానిక అవసరాలకు అనుగుణంగా నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పూర్తయిన ఇళ్లను అప్పగిస్తున్నారు. ఈ గృహప్రవేశ కార్యక్రమం ఏపీ గృహ నిర్మాణ రంగంలో ఒక మైలురాయిగా నిలుస్తుంది. భవిష్యత్తులో మరిన్ని లక్షల ఇళ్ల నిర్మాణం కొనసాగుతుందని ప్రభుత్వం ప్రకటించింది.
వైసీపీ హయాంలో సెంట్ స్థలాల పేరుతో మోసం
వైసీపీ హయాంలో అప్పటి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టిడ్కో ఇళ్లను సైతం పక్కన పెట్టి సెంట్ స్థలాల పేరుతో పేదల్ని మోసం చేసింది. సెంటు స్థలంలో ఉండటానికి ఇల్లు కాదు కాదా.. ఒక్క గది కూడా రాదని తెలిసి.. పనికి రాని ఇళ్లను ఇచ్చారు. ఆ స్థలాలను ఏం చేసుకోవాలోతెలియక పేదలెవరూ పట్టించుకోలేదు. ప్రభుత్వంలో గతంలో ఆగిపోయిన ఇళ్లను ఇప్పుడు పూర్తి చేసింది. త్వరలో మరిన్ని లక్షల ఇళ్లను పేదలకు ఇవ్వబోతోంది.


