ఆంధ్రప్రదేశ్‌లోని 175 నియోజకవర్గాలకు ప్రభుత్వం ర్యాంకులు కేటాయించిందంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని ప్రభుత్వం స్పష్టం చేసింది. సోమవారం జరిగిన మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ పై చర్చ జరిగింది తప్ప, ఎమ్మెల్యేల పనితీరుకు మార్కులు వేయలేదని అధికారిక వర్గాలు వెల్లడించాయి. నివేదిక సమర్పించే సమయంలో ర్యాంకుల ప్రస్తావన రాగా, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వెంటనే జోక్యం చేసుకుని వాటిని అడ్డుకున్నారు.
అది కేవలం వివిధ శాఖలు వెబ్సైట్లలో అప్లోడ్ చేసిన డేటా ఆధారంగా రూపొందించిన విశ్లేషణ మాత్రమేనని, దానిని ఎమ్మెల్యేల ర్యాంకులుగా పరిగణించకూడదని ఆయన స్పష్టం చేశారు. ఈ నివేదిక పూర్తిగా వివిధ ప్రభుత్వ శాఖల వెబ్సైట్లలో అధికారులు పొందుపరిచిన సమాచారంపై ఆధారపడి ఉందని సీఎం వివరించారు. ఇది కేవలం మీరు అప్లోడ్ చేసిన డేటాతో వచ్చిన నివేదిక. ఇది ప్రామాణికం కాదు.. క్వాలిటీ ఆఫ్ డేటా కూడా లెక్కిస్తాం అని ఆయన అధికారులకు తేల్చి చెప్పారు. అగ్రికల్చర్, ఇండస్ట్రీ, హెల్త్, ఎడ్యుకేషన్, వెల్ఫేర్, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ వంటి రంగాల్లో ప్రభుత్వం నిర్దేశించిన సూచికల ప్రకారం ఆయా శాఖల వెబ్‌సైట్స్‌లో అప్లోడ్ చేసిన డేటాపై జరిగిన ప్రాథమిక అనాలసిస్ మాత్రమే ఇదని, ఇది రాజకీయ నివేదిక కాదని ప్రభుత్వం వివరించింది.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం అధికారులు ఇస్తున్న డేటా, భవిష్యత్తులో వచ్చే నియోజకవర్గాల జీఎస్డీపీ డేటాకు విరుద్ధంగా ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ రెండింటి మధ్య వ్యత్యాసం ఉంటే, అధికారులు ఇప్పుడు ఇస్తున్న సమాచారం తప్పు అని అర్థమవుతుందని చెప్పారు. కాబట్టి, కలెక్టర్లు ఆయా శాఖల డేటాను ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలని , వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా డేటా ఉండేలా చూడాలని ఆదేశించారు.