ఆంధ్రప్రదేశ్ రహదారుల రూపురేఖలను మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రోడ్ డాక్టర్ యంత్రం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కాకినాడ నగరంతో పాటు రాష్ట్రంలోని పలు ప్రధాన ప్రాంతాల్లో ఈ అధునాతన యంత్రాన్ని ఉపయోగించి యుద్ధ ప్రాతిపదికన గుంతలను పూడుస్తున్నారు. గత కొన్నేళ్లుగా అధ్వానంగా మారిన రోడ్ల సమస్యకు ఇది ఒక శాశ్వత, వేగవంతమైన పరిష్కారంగా కనిపిస్తోంది.
సాంప్రదాయ పద్ధతుల్లో వారాల తరబడి జరిగే రోడ్డు మరమ్మతులు, ఈ రోడ్ డాక్టర్ సాంకేతికతతో కేవలం నిమిషాల వ్యవధిలోనే పూర్తి కావడంతో వాహనదారులు విస్మయం చెందుతున్నారు. ఈ యంత్రం పనితీరు అత్యంత ప్రభావవంతంగా ఉండటమే దీని ప్రత్యేకత. గుంతలను శుభ్రం చేయడం నుంచి, మిశ్రమాన్ని నింపడం, రోడ్డును సమం చేయడం వరకు అన్ని ప్రక్రియలు ఆటోమేటిక్గా జరిగిపోతాయి. ప్యాచ్ వర్క్ చేసిన కొద్దిసేపటికే వాహనాల రాకపోకలకు రోడ్డు సిద్ధమవుతుంది.
కాకినాడలో దీని ద్వారా జరిగిన మరమ్మతుల వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవ్వడంతో, ఇతర రాష్ట్రాల ప్రజలు సైతం తమ ప్రాంతాల్లో ఇలాంటి సాంకేతికత కావాలని కోరుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలకు , రహదారి నిర్మాణ సంస్థలకు ఏపీ చేపట్టిన ఈ రోడ్ డాక్టర్ ప్రయోగం ఒక రోల్ మోడల్ గా నిలుస్తోంది. మౌలిక సదుపాయాల కల్పనలో వేగం, నాణ్యతను పెంచేందుకు ఇలాంటి వినూత్న యంత్రాలను వాడటం వల్ల ప్రజాధనం వృధా కాకుండా ఉండటమే కాకుండా, ప్రయాణ సమయం , ప్రమాదాలు కూడా తగ్గుతాయి. అందుకే సోషల్ మీడియాలో ఇలాంటి యంత్రాలు ప్రతి మున్సిపాలిటీకీ ఉండాలన్న సూచనలు వస్తున్నాయి.