ఏది కావాలన్నా ముందు అప్పు చేసెయ్ అన్నట్లుగా మారిపోయింది తెలుగు రాష్ట్రాల ప్రజల లైఫ్ స్టైల్. దేశంలోనే అత్యధికంగా అప్పులు చేస్తున్న ప్రజల్లో తెలుగు రాష్ట్రాల ప్రజల ముందున్నారు. 2020-21 లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 43.7% మంది, తెలంగాణలో 37.2% మంది అప్పుల్లో ఉన్నారు. కేంద్ర గణాంకాల శాఖ తాజాగా విడుదల చేసిన సర్వే లో ఈ విషయం వెల్లడి అయింది. ఏపీ 1వ స్థానం, తెలంగాణ 2వ స్థానాల్లో నిలిచాయి.
బ్యాంకులతో అనుసంధానం – అప్పుల భారం
ఆంధ్రప్రదేశ్లో 15 ఏళ్లకు పైబడిన జనాభాలో 92.3% మంది బ్యాంకింగ్ వ్యవస్థకు అనుసంధానం అయ్యారు. ఈ విషయంలో కర్ణాటక 95.9% తర్వాత ఏపీ 2వ స్థానంలో ఉంది. అయితే కర్ణాటకలో 23.2% మందిపైనే అప్పుల భారం ఉంది. ఏపీలో మాత్రం ఇది 43.7%శాతంగా ఉంది. తెలంగాణలో 86.5% మందే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ పరిధిలో ఉన్నారు. ఈ విషయంలో దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ 14వ స్థానంలో ఉంది.
దక్షిణాదిలో అప్పులు చేసేవాళ్లు ఎక్కువే !
మొత్తంగా చూస్తే దక్షిణాది రాష్ట్రాల్లో సగటున 92.1% మంది జనాభా ఫైనాన్షియల్ ఇంక్లూజన్ పరిధిలో ఉండగా, 31.8% మంది అప్పుల్లో చిక్కుకున్నారు. ఎక్కువ సభ్యులు కలిగిన కుటుంబాలపై అప్పుల భారం తక్కువగా ఉండగా, తక్కువ సభ్యులు కలిగిన కుటుంబాలపై ఎక్కువగా ఉందని సర్వేలో తేలింది. ఎక్కువ మంది కుటుంబసభ్యులు ఉన్న ఇళ్లల్లో ఎక్కువ మంది ఆదాయం ఉన్నవారు ఉండటం వల్ల ఇలా ఉందని అనుకోవచ్చు.
బ్యాంకింగ్ అప్పుల లెక్కలే.. వ్యక్తిగత అప్పుల లెక్కలు కాదు !
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తమ సేవల్ని విస్తృత పరిచాయి. యాప్స్ ద్వారా లోన్లు ఇస్తున్నాయి. బజాజ్ ఫైనాన్స్ వంటి సంస్థల మార్కెట్ తెలుగు రాష్ట్రాల్లో చాలా ఎక్కువ.చాలా ఈజీగా లోన్లు ఆఫర్ చేస్తూంటారు. అందుకే ఎక్కువ మంది కట్టగలమా లేదా అన్న ఆలోచన లేకుండా అప్పులు చేస్తున్నారు. చివరికి వారిని రుణాల ఊబిలోకి దింపుతోంది. నిజానికి ఇవన్నీ బ్యాంకుల అప్పుల లెక్కలే. ప్రైవేటు అప్పుల లెక్కలు రికార్డులకు రావు. అందుకే ఈ అప్పుల కన్నా చాలా ఎక్కువగా రుణభారం ప్రజలపై ఉంటుంది. ఉత్తరాదిలో .. బ్యాంకింగ్ ఇంక్లూజన్ తక్కువ కాబట్టి అక్కడి ప్రజల అప్పులు రికార్డుల్లోకి రాలేదు. అక్కడి ప్రజలు తెలుగు రాష్ట్రాల ప్రజల కన్నా ఇంకా ఎక్కువ అప్పుల భారంలో ఉంటారని సులువుగానే అర్థం చేసుకోవచ్చు.