ఆంధ్రప్రదేశ్‌కు దేశంలోనే అతి పెద్ద డేటా సెంటర్ రావడం సంచలనంగా మారింది. ఇష్టం లేని వాళ్లు అదో నిరర్థక పెట్టుబడి అంటున్నారు. భారీ రాయితీలు ఇచ్చారని అంటున్నారు. ఎవరి వాదన వారు చెబుతున్నారు. కానీ ఆ పెట్టుబడి ఎంత ముఖ్యమైనదో.. ఇండస్ట్రీ గుర్తించింది. అందుకే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ను వారు చూస్తున్నారు. ఏపీలో వేగంగా సాగుతున్న మౌలిక సదుపాయాల నిర్మాణాలు, ఎకో సిస్టమ్ ఏర్పాటు వంటివి ముందు ముందు పెట్టుబడుల వెల్లువకు కారణం కాబోతున్నాయని ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాల్లో స్పష్టత ఉంది.
ఆంధ్ర.. పారిశ్రామిక వర్గాలకు హాట్ ఫేవరేట్
ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు పారిశ్రామిక వర్గాలకు మొదటి చాయిస్ గా మారింది. ఏపీ ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు, ప్రోత్సాహకాలు అందర్నీ ఆకర్షిస్తున్నాయి. నిజానికి ఏపీకి రావాల్సిన అవసరం ఏ పారిశ్రామిక సంస్థకూ లేదు. ఎందుకంటే ఏపీకి మూడు వైపులా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ఉన్నాయి. ఆ నగరాలు ఉన్న మూడురాష్ట్రాలు పారిశ్రామికంగా ఎంతో ముందు ఉన్నాయి. వాటి వైపు వెళ్లకుండా.. ఏపీకి పరిశ్రమల్ని తీసుకురాగలగడం చిన్న విషయం కాదు. కానీ పదహారు నెలల్లోనే అలాంటి సమస్యల్ని పరిష్కరించి ఏపీ పారిశ్రామిక వర్గాలను ఆకట్టుకుంటోంది.
ముందు ముందు మరిన్ని భారీ పెట్టుబడులు
ఏపీతో చర్చలు జరిపేందుకు పెద్ద ఎత్తున పారిశ్రామికవర్గాలు ఆసక్తి చూపిస్తున్నాయి. గతంలో చర్చలు జరిపిన ఫాక్స్ కాన్ వంటి సంస్థలు ఇప్పుడు తమ పెట్టుబడుల ప్రణాళికల్ని వేగవంతం చేసేందుకు ముందుకు వస్తున్నాయి. గూగుల్ డేటా సెంటర్ కారణంగా అక్కడ తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు పెద్ద ఎత్తున ఇతర సంస్థలూ ముందుకు వస్తున్నాయి. కాగ్నిజెంట్ , యాక్సెంచర్ లాంటివే కాదు.. మధ్యస్థ ఐటీ కంపెనీలు కూడా పెద్ద ఎత్తున తమ కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నాయి.
నవంబర్ లో పెట్టుబడుల సదస్సు
విశాఖలో నవంబర్‌లో జరగనున్న పెట్టుబడుల సదస్సులో పాల్గొనే .. ప్రపంచప్రసిద్ధ పారిశ్రామిక వేత్తల సంఖ్య గూగుల్ పెట్టుబడి కారణంగా పెరిగే అవకాశం ఉంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా సీఐఐ ఆధ్వర్యంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ సదస్సు రాష్ట్ర పెట్టుబడుల చరిత్రను తిరిగరాసే అవకాశం ఉంది. అందు కోసం చాలా కాలం నుంచే ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
ఎంవోయూలు కాదు.. డైరక్ట్ ఎగ్జిక్యూషనే నారా లోకేష్ విజన్
ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా నారా లోకేష్ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. ఎంవోయూలు చేసుకుని టైంపాస్ చేయాలని ఆయన అనుకోవడం లేదు. నేరుగా ఎగ్జిక్యూషన్ కే ప్రాధాన్యం ఇస్తున్నారు. పనులు ప్రారంభించేలా ఒప్పందాలు చేసుకుంటున్నారు. అందుకే.. పెట్టుబడులు గ్రౌండింగ్ కోసం ఎదురు చూడాల్సిన పనిలేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. లోకేష్ మార్క్ ఎకోసిస్టమ్ ఏపీని పెట్టుబడుల స్వర్గధామంగా మార్చనుంది.