మెడికల్ కాలేజల విషయంలో పబ్లిక్, ప్రైవేటు పార్టనర్ షిప్ విధానం కోసం నాలుగు మెడికల్ కాలేజీలను ఎంపిక చేసి టెండర్లు పిలిచారు. ఒక్క ఆదోని కాలేజీ విషయంలో మాత్రం కిమ్స్ యజమాన్యం ఆసక్తి చూపింది. మిగిలిన మెడికల్ కాలేజీలకు టెండర్లు వేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న రాజకీయం ఎక్కువ డ్యామేజ్ చేస్తోంది. జాతీయంగా కేంద్రం, పార్లమెంటరీ కమిటీ కూడా పీపీపీలకే ప్రాధాన్యమివ్వాలని అంటూంటే జగన్ మాత్రం తప్పుడు ప్రచారాలు చేస్తూ రాజకీయం చేస్తున్నారు.
మార్కాపురం, మదనపల్లె, పులివెందుల మెడికల్ కాలేజీలకు ఎవరూ టెండర్లు వేయలేదు. రెండో దశలో మరో 6 కాలేజీలు పెనుకొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురంలకు కూడా పీపీపీ టెండర్లు పిలవనున్నారు. వైసీపీ చెబుతున్నట్లు ఒక్క పదిహేడు కాలేజీలు పీపీపీ చేయడం లేదు. కేంద్రం అనుమతి ఇచ్చిన మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నిర్వహిస్తోంది. ఇంకా అనుమతి రాని.. భారీగా నిధులు ఖర్చు పెట్టాల్సిన వైద్య కాలేజీలకను మాత్రమే పీపీపీకి ఇస్తున్నారు.
జగన్ బెదిరిపులతో పాటు కొన్ని షరతులు, టెక్నికల్ నిబంధనలు కఠినంగా ఉండటం వల్ల చాలా సంస్థలు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై వెనక్కి తగ్గవద్దని అధికారులకు చంద్రబాబు సూచించారు. ఆదోని కాలేజీకి ముందుకు వచ్చిన సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని పనులు వేగవంతం చేయాలని సూచిచంారు. మిగిలిన మూడు కాలేజీలకు బిడ్లు రాకపోవడంతో, నిబంధనలను కొంత సడలించి మళ్లీ కొత్తగా టెండర్లు పిలవాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద 60 శాతం ఆర్థిక సహాయాన్ని కేంద్రం 30 శాతం, రాష్ట్రం 30 శాతం అందించాలని అధికారులకు సూచించారు.
ఈ PPP విధానాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై ఏపీ హైకోర్టు ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసింది. మెడికల్ కాలేజీలను PPP విధానంలో నిర్మించడం అనేది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని, అది చట్టవిరుద్ధం కానంత వరకు కోర్టులు జోక్యం చేసుకోలేమని స్పష్టం చేస్తూ టెండర్ల ప్రక్రియపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో న్యాయపరంగా చిక్కులు లేవు కానీ రాజకీయపరంగానే చిక్కులు ఎదురవుతున్నాయి
