ఆంధ్రప్రదేశ్‌లో యువ ఆటగాళ్ల క్రికెట్ ప్రతిభను వెలికి తీసేందుకు ఆంధ్రా ప్రీమియర్ లీగ్‌ను ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ప్రారంభించింది. ఐపీఎల్ కాన్సెప్ట్‌లోనే ఈ టోర్నీ జరగనుంది. APL ఆంధ్రప్రదేశ్‌లోని యువ క్రికెటర్లకు తమ నైపుణ్యాలను ప్రదర్శించడానికి , జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడానికి ఒక ముఖ్యమైన వేదికగా ఉండనుంది. బీసీసీఐ ఆమోదంతో ఈ టోర్నీ నిర్వహిస్తున్నారు.
శుక్రవారం నుంచే విశాఖపట్నం క్రికెట్ స్టేడియంలో టోర్నీ ప్రారంభమవుతోంది. ఈ సీజన్లో ఏడు జట్లు పాల్గొంటున్నాయి. అమరావతి రాయల్స్ , భీమవరం బుల్స్, కాకినాడ కింగ్స్, రాయలసీమ రాయల్స్, సింహాద్రి వైజాగ్ లయన్స్, తుంగభద్ర వారియర్స్, విజయవాడ సన్‌షైనర్స్ టీములు పోటీ పడుతున్నాయి. 21 లీగ్ మ్యాచ్‌లు ,4 ప్లేఆఫ్‌లతో టోర్నీ ఫార్మాట్ ను ప్లాన్ చేశారు. సోనీ స్పోర్ట్స్ 4 , సోనీ స్పోర్ట్స్ 5 లలో ప్రత్యక్ష ప్రసారం చేయబోతున్నారు. అలాగే FanCode యాప్ , ACA యూట్యూబ్ ఛానల్లో లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది.
అండర్-16 ఆటగాళ్లను చేర్చడం, యువ ప్రతిభకు అవకాశాలు కల్పించడం ద్వారా ఈ టోర్నీ ద్వారా యువ ప్రతిభ వెలుగులోకి వస్తుందని ఆశిస్తున్నారు. హనుమ విహారీ, రిక్కీ భుయ్, షేక్ రషీద్, నితీష్ రెడ్డి వంటి స్టార్ ఆటగాళ్లు ఈ లీగ్ లో భాగం అవుతున్నారు. GMR గ్రూప్ ప్రధాన స్పాన్సర్‌గా ఉంది. శుక్రవారం అమరావతి రాయల్స్ , కాకినాడ కింగ్స్ మధ్య తొలి మ్యాచ్ సాయంత్రం ఏడున్నరకు ఉంటుంది. బ్రాండ్ అంబాసిడర్ గా హీరో వెంకటేష్ వ్యవహరిస్తున్నారు.