కేటీఆర్ వాడుతున్న ల్యాండ్ క్రూయిజర్ కార్లు అక్రమంగా దిగుమతి చేసినవని, స్మగ్లింగ్ చేసినవని కేంద్రహోంశాఖ సహాయమంత్రి బండి సంయజ్ సంచలన ఆరోపణలు చేశారు. టాక్స్ కట్టకుండా లగ్జరీ కార్లు దిగమతి చేసుకున్నారని.. బషరత్ ఖన్ అనే వ్యక్తిని గుజరాత్ డీఆర్ఐ పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. అతను దిగుమతి చేసుకున్న కార్లు..కేటీఆర్ కుటుంబ సభ్యుల పేరుతో ఉన్న కంపెనీ పేరు మీద రిజిస్టర్ అయ్యాయి. కేటీఆర్ వాటినే వాడుతున్నారు. కేసీఆర్ లక్కీ నెంబర్ అయిన 6666 పేరుతోనే ఇవి రిజిస్టర్ అయ్యాయి.
ఈ కార్లు అన్నింటినీ కేటీఆర్ ఎక్కడ కొన్నారు.. మార్కెట్ రేటుకు కొన్నారా.. తక్కువ రేటుకు కొన్నారా అని బండి సంజయ్ ప్రశ్నిస్తున్నారు. ఈ కార్లకు చెల్లింపులు ఎలా చేశారు.. బీనామా పేరు మీద కొన్నారా.. గుర్తు తెలియని ఆదాయం నుంచా లేక మనీ లాండరింగ్ చేశారా అని సూటిగా ప్రశ్నించారు. దీన్ని బట్టి చూస్తే.. కేసీఆర్ కుటుంబం నేరుగా ఈ నేరంలో భాగస్వామ్యం తీసుకున్నట్లే కనిపిస్తోందన్నారు. నిజం బయటకు రావాలని.. ఆయా శాఖలు వెంటన దర్యాప్తు చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
బండి సంజయ్ ఆరోపణలు కలకలం రేపడంతో .. బీఆర్ఎస్ పార్టీ విచిత్రంగా స్పందించింది. ఆ పార్టీ నేత జగదీష్ రెడ్డి.. బండి సంజయ్ కార్లను ఎక్కడ కొన్నారో కేటీఆర్ కూడా అక్కడే కొన్నారని చెప్పుకొచ్చారు. కేసీఆర్ కుటుంబం కొన్నది సెకండ్ హ్యాండ్ కార్లు అన్నట్లుగా ఆయన చెబుతున్నారు. కానీ ఈ కార్ల విషయంలో అంతకు మించి ఏదో ఉందని బండి సంజయ్ మాటల్ని బట్టే అర్థమవుతోంది.