మాజీ మంత్రి అనిల్ కుమార్ పరిస్థితి నెల్లూరులో కుడితిలో పడ్డ ఎలుకలా అయిపోయింది. ఆయన బాబాయ్ రూప్ కుమార్ యాదవ్ తన అనుచర వర్గాన్ని మొత్తం తన వెంట తీసుకెళ్లడంతో ఫీలైపోతున్నారు. కొద్ది రోజులుగా ఆయన సినిమా డైలాగులన్నీ పార్టీలోని తన ప్రత్యర్థులపైనే చెబుతున్నారు. మంత్రిగా ఉన్నప్పుడు పోలవరం గురించి.. టీడీపీపైనా అలాంటి డైలాగులు కొట్టేవారు. ఇప్పుడు సొంత పార్టీ నేతలపైనే డైలాగులు కొట్టడానికి ఆయనకు సమయం సరిపోవడం లేదు.
అనిల్ కుమార్ యాదవ్ గత ఎన్నికల్లో మాజీ మంత్రి నారాయణపై చాలా స్వల్ప తేడాతో గెలిచారు. అయితే కార్పొరేషన్ ఎన్నికల్లో మాత్రం టీడీపీకి ఒక్క కార్పొరేటర్ సీటు రాకుండా ప్లాన్ చేసి మరీ గెలిపించారు. అయితే అనూహ్యంగా ఇప్పుడు ఆ కార్పొరేటర్లంతా అనిల్ కు అడ్డం తిరిగారు. మంత్రి పదవి పోయిన తర్వాత ఆయనను వదిలేశారు. అనిల్ బాబాయ్ రూప్ కుమార్ వర్గంలో చేరిపోయారు. మొన్నటిదాకా అనిల్ వెంటే ఉన్న రూప్ కుమార్ ఇప్పుడు సొంత వర్గాన్ని పెట్టుకున్నారు.
కొన్నాళ్లకు తనను వదిలి వెళ్లిపోయిన వాళ్లతో పని లేదని.. ఎవరు ఉన్నా లేకోపయినా తాను గెలుస్తానని సవాల్ చేస్తున్నారు. అయితే అనిల్ కు ఒక్క రూప్ కుమారే సమస్య కాదు అసలు వైసీపీలో ఎవరితోనూ ఆయనకు సఖ్యత లేదు. ఆనం కుటుంబంతో గొడవలే. కొత్త మంత్రి కాకాణితోనూ ఆయనకూ విభేధాలే. ఎవరితోనూ సన్నిహిత సంబంధాలు లేవు. దీంతో పూర్తిగా ఒంటరి అయిపోయారు. ఈ ఫ్రస్ట్రేషన్ ఆయనకు ఎక్కువగా కనిపిస్తోంది. పార్టీ పరంగా సమావేశాలు నిర్వహించినా ఆయనను పిలువడం లేదు. ఇటీవల ఆర్యవైశ్య సమావేశం ఏర్పాటు చేస్తే ఆయనను పిలువలేదు. దాంతో ఆ మీటింగ్ కు వెళ్లిన వాళ్లంతా వెయిట్ ఉన్న వాళ్లని..తనకు అంత వెయిట్ లేదని నిష్టూరుమారుడుకున్నారు.
ఎలా చూసినా అనిల్ కుమార్.. అందరికీ దూరమై ఫ్రస్ట్రేషన్ కు గురవుతున్నారు. ఆయనకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ దొరకడం కష్టమన్న వాదన కూడా వినిపిస్తోంది.