నయనతార దగ్గర చాలా కండీషన్లు ఉంటాయ్. తన పారితోషికం కంటే కండీషన్లకే ఎక్కువ భయపడతారు నిర్మాతలు. ముఖ్యంగా ‘ప్రమోషన్లకు రానే రాను’ అని ఖరాఖండీగా చెప్పేస్తుంది. ఎంత గొప్ప సినిమా అయినా, స్టార్ హీరోలు చేసినా సరే – ఈ కండీషన్‌కు ఒప్పుకోవాల్సిందే. లేదంటే నయన సినిమా ఒప్పుకోదు. నయనకు కోట్లకు కోట్లు పారితోషికాలు ఇచ్చి కూడా పబ్లిసిటీకి రాకపోయినా ఏమీ అనలేని పరిస్థితి నిర్మాతలది. కనీసం వీడియో బైట్, టీమ్ ఇంటర్వ్యూలకు సైతం నయన రాదు.
ఇప్పుడు చిరంజీవి సినిమాలో నయనతార నటించడానికి ఒప్పుకొంది. అనిల్ రావిపూడి దర్శకుడు. ఇటీవలే చెన్నై వెళ్లి నయనకు కథ వినిపించాడు అనిల్ రావిపూడి. నయన సంతకాలు కూడా చేసేసింది. అంతేకాదు.. ‘నయన ఇన్’ అంటూ ఓ వీడియో కూడా షూట్ చేశాడు. ఈ వీడియోలో నయన కూడా కనిపిస్తుంది. నయనను ఇలాంటి వీడియోలకు ఒప్పించడానికి తమిళ దర్శకులకు సైతం తల ప్రాణం తోకలోకి వస్తుంది. అలాంటిది నయనని చిటికెలో ఒప్పించేశాడు అనిల్ రావిపూడి. అయితే ఇది ఆరంభం మాత్రమే. అనిల్ దగ్గర ప్రమోషనల్ ఐడియాలు చాలా ఉంటాయి. వాటిలో ఎలాగైనా సరే.. నయన ఇన్వాల్వ్మెంట్ ఉండేలా చూడాలన్నది అనిల్ రావిపూడి ఆలోచన. ప్రమోషన్లకు ససేమీరా అనే నయనతారతోనే ఓ ప్రమోషనల్ వీడియో చేయించాడంటే.. అనిల్ రావిపూడి గట్టోడే. ఈ సినిమా విడుదల సమయంలో నయనతారని ఈవెంట్స్‌ని తీసుకొచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. మే 22న ఈ చిత్రం హైదరాబాద్ లో ప్రారంభం కానుంది. అన్నపూర్ణ స్టూడియోస్ లో ఓ భారీ సెట్ తీర్చిదిద్దారు. ఇందులోనే 10 రోజుల పాటు తొలి షెడ్యూల్ జరగబోతోంది. ఈ పది రోజులూ చిరంజీవిపైనే కొన్ని కీలకమైన సన్నివేశాల్ని తెరకెక్కిస్తారని టాక్. నయన సెకండ్ షెడ్యూల్ లో ఎంట్రీ ఇవ్వొచ్చు. నయన ఎంట్రీ సందర్భంగా ఈ వీడియో రిలీజ్ చేస్తారు.