అఖిల్ ‘ఏజెంట్’ దారుణమైన పరాజయాన్ని చూసింది. పలు కారణాల వలన దాదాపు మూడేళ్ళు పాటు సెట్స్ పై వుండి ఎట్టకేలకు ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బోల్తాకొట్టింది. హార్డ్ కోర్ అక్కినేని అభిమానులు సైతం సినిమాపై పెదవి విరిచారు. అఖిల్ కష్టం అంతా వృధా అయ్యింది. అఖిల్, సురేందర్ రెడ్డి ఖాతాలలో భారీ పరాజయం చేరింది. ఈ సినిమా పరాజయంపై నిర్మాత అనిల్ సుంకర తాజాగా స్పందించారు.
‘’ఏజెంట్ పై వస్తున్న విమర్శలకు మొత్తం భాద్యత మాదే. ఏజెంట్ చాలా కష్టమైన టాస్క్ అని తెలిసినప్పటికీ మా వరకూ పోరాడం. కానీ విఫలమయ్యాం. బౌండ్ స్క్రిప్ట్ లేకుండా ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేయడం మా మొదటి అతి పెద్ద తప్పు. ఆ తర్వాత కోవిడ్ రూపంలో కూడా సమస్యలు ఎదురుకున్నాం. అయితే ఎలాంటి సాకులు చెప్పాలని అనుకోవడం లేదు. పెద్ద తప్పు జరిగింది. ఈ భారీ తప్పు నుండి పాఠాలు నేర్చుకుంటాం. మళ్ళీ ఇలాంటిది పునరావృతం కాకుండా చూసుకుంటాం. మాపై నమ్మకం ఉంచిన వారందరికీ క్షమాపణలు. భవిష్యత్ లో మంచి ప్లానింగ్ తో కష్టపడి మంచి ప్రాజెక్ట్ తో మళ్ళీ మీ నమ్మకాన్ని పొందుతాం’’ అని చెప్పుకొచ్చారు.
ఒక సినిమా విడుదలైన నాలుగో రోజునే ఇలాంటి వివరణ, క్షమాపణ చెప్ప్పడం అరుదుగా జరుగుతుంటుంది. సినిమా అట్టర్ ఫ్లాఫ్ అని తెలిసినా బ్లాక్ బస్టర్ అని పోస్టర్లు రిలీజ్ చేసుకోవడం తరుచుగా చూస్తూ వుంటాం. కానీ అనిల్ సుంకర మాత్రం ఎలాంటి భేషజాలకు పోకుండా వున్నది వున్నట్లుగా ఒప్పుకున్నారు. ఈ విషయంలో నిర్మాత నిజాయితీ మెచ్చుకోవాల్సిందే.