జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కి పంచాయతీ ఎన్నికల్లో … ఆయన నియోజకవర్గంలోని గ్రామాల్లో గట్టి షాక్ తగులుతోంది. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తనది గ్రామ స్థాయి రాజకీయం కాదని.. పవన్ కల్యాణ్ , పొంగులేటి రేంజ్ అని అనుకున్నారేమో కానీ పట్టించుకోవడం మానేశారు. ఆ ప్రభావం చాలా గట్టిగానే తగులుతోంది. అరవై శాతం పంచాయతీల్లో ఆయన నిలబెట్టిన అభ్యర్థులు పరాజయం పాలవుతున్నారు. చివరికి ఆయన సొంత గ్రామం రంగారెడ్డి గూడలో బీజేపీ విజయం సాధించింది.
ఇతర పంచాయతీల్లోనూ అదే ఫలితాలు రావడంతో ఆయన కంగారుపడిపోయారు. మూడో విడత గ్రామాల్లో అయినా కాంగ్రెస్ పార్టీకి అత్యధిక సీట్లు సాధించాలని స్వయంగా ప్రచారం చేస్తున్నారు. అయితే ఆయన అహంకారం మాత్రం తగ్గలేదు. గ్రామాల్లోకి వెళ్లి.. పథకాలు ఏమి కావాలన్నా నేనే సంతకం పెట్టాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడిస్తే తాను ఏమి ఇవ్వనని అంటున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులు.. ఓటేయకపోతే చచ్చిపోతామని బెదిరిస్తున్నారని.. వారు గెలిస్తే తానే చంపేస్తానని కూడా అంటున్నారు. ఆయన మాటలతో గ్రామాల్లో వ్యతిరేక ప్రచారం జరుగుతోంది.
అనిరుధ్ రెడ్డి గతంలో వైసీపీ ఇంచార్జ్ గా ఉండేవారు. తర్వాత కాంగ్రెస్ లో చేరారు. అతి కష్టం మీద మాజీ మంత్రి లక్ష్మారెడ్డి మీద గెలిచారు. అయితే పదవి రాగానే ఆయన మరో దారిలోకి వెళ్లిపోయారు. పది మంది ఎమ్మెల్యేలతో సమావేశమై.. అసంతృప్తి సంకేతాలు పంపి పార్టీకి కూడా అపనమ్మకం కలిగించారు. పొంగులేటిని టార్గెట్ చేసుకున్నారు. తర్వాత అవసరం లేని పవన్ కల్యాణ్ వివాదాన్ని నెత్తికెత్తుకుని ఇంకాస్త వివాదాస్పదమయ్యారు. చివరికి సొంత నియోజకవర్గంలో పట్టు కోల్పోయారు.


