తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా ప్రజల సమస్యలపై పోరాడతారని ఓట్లు వేసి గెలిపిస్తే, జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మాత్రం తన పోరాట పంథా ను కాస్త వెరైటీగా మార్చుకున్నారు. నియోజకవర్గంలో రోడ్లు, నీళ్లు, నిధుల గురించి కొట్లాడటం పాత పద్ధతి అనుకున్నారో ఏమో కానీ, ఏకంగా సారా దుకాణాల కోసం అసెంబ్లీలో కొట్లాడతానని ఆయన ప్రకటించడం ఇప్పుడు అందరూ వింతగా చెప్పుకునేలా చేస్తోంది.
ఎమ్మెల్యే గారి దృష్టిలో అభివృద్ధి అంటే ఊరూరా బడులు కట్టించడం కాదు, వాడవాడలా సారా విక్రయాలకు పచ్చజెండా ఊపడమేనని ఆయన మాటలు వింటుంటే అర్థమవుతోంది. నిజానికి సారా మహమ్మారి వల్ల ఎన్నో పేద కుటుంబాలు చితికిపోతున్నాయి. ఎప్పుడో నిషేధించినా ఇప్పటికీ కొన్ని చోట్ల అక్రమంగా అమ్ముతూనే ఉన్నారు. ప్రభుత్వం ఇలాంటి సారాపై ఉక్కుపాదం మోపుతూంటే ఎమ్మెల్యే గారు మాత్రం దానికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆయన తీరు చూస్తూంటే అసెంబ్లీలో ఇకముందు ప్రజా సమస్యల కంటే ‘సారా’ ఘాటు ఎక్కువగా వినిపించేలా ఉంది.
విచిత్రం ఏమిటంటే.. సారా వల్ల ఆరోగ్యం చెడిపోతుందని ఎక్కడా తేలలేదట. ఇంకా ఆరోగ్యం మెరుగుపడుతుందని చెబుతున్నారు. ఎందుకంటే గతంలో సారా తాగినోళ్లు 110 ఏళ్లు బతికితే ఇప్పుడు మద్యం తాగుతున్నోళ్లు 80 ఏళ్లు మాత్రమే బతుకుతున్నారట. అసెంబ్లీలో స్పీకర్ మ్మెల్యేకి సారా గురించి మాట్లాడే అవకాశం ఇస్తారో లేదో కానీ, ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం .. ఇప్పుడు తెలంగాణ ప్రజలకు సారా ఒక్కటే తక్కువ అని నిట్టూర్చేలా చేసతున్నాయి.
