టెర్రర్ పై అపరిచితుడి `సైబర్ వార్’

కొన్నేళ్ల క్రిందట తమిళంలో విడుదలైన అన్నియన్ (తెలుగులో అపరిచితుడు) సినిమాలో హీరో విక్రం కంప్యూటర్ స్క్రీన్ మీద ప్రత్యక్షమై చెడుని అంతమొందిస్తానంటాడు. వివరాలు టైప్ చేయమని కోరుతాడు. అదంతా మనకు తెలిసిందే. అలాంటిదే ఇప్పుడు నిజంగా జరిగింది. వీడియోలో అపరిచితుడిలాగానే ఒకడు ప్రత్యక్షమయ్యాడు.

అతను ఒక ప్రత్యేకమైన ముసుగు ధరించాడు. కాసేపు ఫ్రెంచ్ భాషలో మాట్లాడాడు. పారిస్ దాడులకు పాల్పడిన ఉగ్రవాదుల భరతం పడతామంటూ భీషణఘోషణ శపథం చేశాడు. ఉగ్రవాదులపై సైబర్ వార్ ప్రకటించాడు. ఇంతకీ ఈ అపరిచితుడు ఏ విధమైన మార్గాన్ని ఎంచుకున్నాడు…?

పారిస్ దాడులకు వ్యతిరేకంగా `ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా’ (ISIS)పై సైబర్ వార్ జరుపుతామని అనామిక (Anonymous) హ్యాకర్స్ గ్రూప్ హెచ్చరించింది. హ్యాకర్స్ లో కొంతమంది గ్రూప్ గా తయారై Anonymous పేరిట ఉగ్రవాదులు ఉపయోగిస్తున్న ట్విట్టర్ అకౌంట్స్ ని హ్యాక్ చేస్తున్నారు. దీనికి ` OpParis campaign’ గా పేరుపెట్టుకున్నారు. ఈనెల 16న (సోమవారంనాడు) ఈ Anonymous గ్రూప్ ఏర్పాటైంది. జనవరిలో దాడులు జరిగినప్పటి నుంచే ఈ గ్రూప్ ఏర్పాటైనప్పటికీ, తాజా పారిస్ దాడులతో ఎలెర్ట్ అయింది. ఇప్పటికే ఆరువేలకు పైగా ఐఎస్ఐఎస్ ఉగ్రవాదల, వారి మద్దతుదారుల టిట్టర్ అకౌంట్స్ ను హ్యాక్ చేసి తమచేతుల్లోకి ఈ గ్రూప్ తెచ్చేసుకుంది.

16వ తేదీన ఈ గ్రూప్ ఒక వీడియోని రిలీజ్ చేసింది. అందులో మాస్క్ పెట్టుకున్న ఒక అపరిచితుడు ప్రత్యక్షమై, ఫ్రెంచ్ భాషలో మాట్లాడుతూ, పారిస్ దాడులకు పాల్పడ్డవారిని వదిలిపెట్టమనీ, ఉగ్రవాదులు ఉపయోగిస్తున్న అకౌంట్స్ ను హ్యాక్ చేసితీరతామని ప్రకటించారు. `Anonymous’ మిమ్మల్ని వదిలిపెట్టదు, వెంటాడుతూనే ఉంటుందని అపరిచత హ్యాకర్ ఈ వీడియోలో స్పష్టంచేశాడు. ఉగ్రవాదులను `క్రూరమృగాలు’గా ఈ అపరిచితుడు అభివర్ణించాడు.

వీడియోలో చెప్పినట్లుగానే మర్నాటికల్లా 5,500 ట్విట్టర్ ఆకౌంట్లను హ్యాక్ చేసినట్లు Anonymous ట్వీట్ చేసింది. అయితే, ఇన్ని అకౌంట్లను హఠాత్తుగా ఎలా హ్యాక్ చేయగలిగారో తెలియడంలేదు. మొత్తానికి ఐఎస్ఐఎస్ మూకలను వదిలిపెట్టమని ఈ గ్రూప్ ప్రతిజ్ఞచేసింది. అపరిచితుడు కాసేపు మాట్లాడిన తర్వాత ఈ వీడియోలో పారిస్ ఉగ్రవాదుల దాడికి సంబంధించిన ఫోటోలను కూడా చూపించారు.

`సైబర్ దాడులతో మిమ్మల్ని (ఉగ్రవాదులను) ఉక్కిబిక్కిరి చేస్తాము, కాసుకోండి…యుద్ధం ప్రకటించాము. మీరుచేసిన అకృత్యాలకు ఫలితం అనుభవించాల్సిందే..’. అంటూ ఈ అపరిచితుడు వీడియోలో హెచ్చరించాడు. అయితే దాడులు చేస్తామని చెప్పాడేకానీ, అవి ఎలాంటివన్న దానిపై స్పష్టతలేదు, ఉగ్రవాద మూకలను క్షమించేది లేదని మాత్రం కచ్చితంగా చెప్పేశాడు.

కంప్యూటర్ వెబ్ సైట్లను హ్యాక్ చేయడంలో సిద్ధహస్తులైన అంతర్జాతీయంగా పనిచేసే బృందమే `Anonymous’. గతంలో తాము అనేక సైబర్ ఎటాక్స్ చేశామని కూడా ఈ గ్రూప్ చెప్పుకుంటున్నది. ఈ గ్రూప్ లాగానే ట్విట్టర్ లో చాలా గ్రూపులు ఇదే పనిచేస్తున్నాయన్న అనుమానంతోనే టెర్రర్ గ్రూప్ లు తమ రహస్య సమాచార పంపిణీకోసం టెలెగ్రామ్ వైపుకు వెళుతున్నాయని తెలిసింది. అయితే, సత్వర మెసేజింగ్ లో పేరుబడ్డ `టెలెగ్రామ్’ ఇప్పుడు తాజాగా (బుధవారం – 18-11-15) తనవద్దకు చేరిన సమాచారం ప్రకారం 12 భాషల్లోఉన్న 78 ఐఎస్ఐఎస్ సంబంధిత ఛాట్ చానెల్స్ ని బ్లాక్ చేసింది. ట్విట్టర్, ఫేస్ బుక్, గూగుల్ వంటి సోషల్ మీడియా కూడా టెర్రర్ గ్రూప్ లపై నిరంతర నిఘా ఉంచుతూనే ఉన్నాయి.

హ్యాకర్స్ చెప్పే కబుర్లను, సందేశాలను ఎంతవరకు నమ్మవచ్చన్నదే అసలు ప్రశ్న. ఉగ్రవాదాన్ని సైబర్ వార్ తో అణచివేస్తామంటున్న ఈ Anonymous గ్రూప్ పై ఇప్పటికే నిఘా ఉంచారు. హ్యాకింగ్ చేయడం తప్పే అయినా, సమాజానికి అవసరమైన పక్షంలో హ్యాక్ చేస్తుంటారు. దీన్నే ఎథికల్ హ్యాకింగ్ అంటారు. మరి Anonymous గ్రూప్ తన సైబర్ వార్ ని ఎంతకాలం కొనసాగిస్తుందో, ఎలాంటి సత్ఫలితాలు వస్తాయో వేచి చూద్దాం.

– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at [email protected]