దసరా నాటికి కొత్త జిల్లాలతో కొంగొత్త తెలంగాణను ఆవిష్కరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదలతో ఉన్నారు. అయితే ముసాయిదాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా కోసం, డివిజన్ లేదా మండలం ఏర్పాటు కోసం ఉద్యమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా జనగామ, గద్వాల జిల్లాల కోసం ఆందోళన తీవ్రంగా జరుగుతోంది.
వరంగల్ జిల్లాలో జనగామ ఉద్రిక్తంగా ఉంది. జిల్లా ఏర్పాటు చేయకపోతే ఆందోళన హింసాత్మకంగా మారినా ఆశ్చర్యం లేదంటూ నిఘా వర్గాలు ప్రభుత్వానికి నివేదించాయట. పాలమూరు జిల్లా గద్వాలలోనూ సెంటిమెంట్ బలంగా ఉంది. అక్కడ కూడా తుది జాబితాలో గద్వాల పేరు లేకపోతే పరిస్థితి చేయి దాటి పోవచ్చనేది ఇంటెలిజెన్స్ నివేదిక అని సమాచారం. ప్రజల్లో అంత బలమైన భావన ఉన్నప్పుడు ఆ జిల్లాల ఏర్పాటును కూడా పరిశీలించాలని కేసీఆర్ ఉన్నతాధికారులకు సూచించారని తెలుస్తోంది. సోమవారం సాయంత్రం జరిగిన కేబినెట్ భేటీలో ఈమేరకు సూచించారని సమాచారం.
కరీంనగర్ జిల్లాలో కోరుట్ల రెవిన్యూ డివిజన్ కోసం ఉద్యమం ఉధృత రూపం దాల్చింది. స్థానికంగానే కాదు, ఆదివారం నాడు హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద ధర్నా జరిగింది. వందల మంది కోరుట్ల వాస్తవ్యులు ఇందులో పాల్గొన్నారు. అదే జిల్లాలోని సిరిసిల్లలోనూ మొదట్లో ఆందోళనలు జరిగాయి. సిరిసిల్ల జిల్లా ఏర్పాటుకు ఉద్యమం మొదలైనా, వాస్తవ పరిస్థితుల కారణంగా అది సాధ్యం కాదనే ఉద్దేశంతో ప్రస్తుతం చాలా మంది ఆందోళనకు దూరంగా ఉన్నారని నిఘా వర్గాల అంచనా.
ముందుగా అనుకున్న జిల్లాల జాబితాతో మూర్ఖంగా ముందుకు పోవద్దని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రజాభిప్రాయం మేరకు మార్పులు చేర్పులు చేయడానికైనా సిద్ధమేనని ఇప్పటికే సంకేతాలు ఇచ్చారట. దీంతో మరీ మార్పులు అవసరమైన జిల్లాలు, డివిజన్లు, మండలాల వివరాలను క్రోడీకరిస్తున్నారు. తుది జాబితాలో మార్పులు గణనీయంగానే ఉండవచ్చని తెలుస్తోంది. ముఖ్యంగా జనగామలో తెరాస నేతలు తీవ్ర స్థాయిలో ఆందోళనకు సిద్ధంగా ఉన్నారు. గద్వాలలో కాంగ్రెస్ వారు కూడా గట్టి పట్టుదలతో ఆందోళనను తీవ్ర తరం చేస్తున్నారు. కాబట్టి ఆ రెండు జిల్లాల పేర్లూ తుది జాబితాలో ఉండొచ్చని భావిస్తున్నారు.