బయోపిక్‌లకు ఎప్పుడూ డిమాండ్ గట్టిగానే ఉంటుంది. తెలుగులో `మహానటి` తరవాత బయోపిక్‌లకు ఓ ఊపు వచ్చింది. అయితే మహానటి సక్సెస్ అయినంతగా మరో బయోపిక్ వర్కవుట్ కాలేదు. ఎన్టీఆర్ బయోపిక్ రూపంలో వచ్చిన రెండు సినిమాలూ ఆదరణ పొందలేదు. ఏఎన్నార్ పై కూడా ఓ బయోపిక్ వస్తుందని అభిమానులు ఆశలు పెట్టుకొన్నారు. అయితే అక్కినేని కాంపౌండ్ నుంచి అలాంటి ప్రయత్నమేదీ రాలేదు. తాజాగా నాగార్జున మాత్రం అక్కినేని బయోపిక్ తీసే ఆలోన ఉందంటూ ప్రకటించడం విశేషం. ”నాన్నగారి బయోపిక్ చేయాలని ఉంది. కానీ ఎవరు చేయాలి? ఎవరితో చేయించాలి? అనేదానిపై చర్చలు జరుగుతున్నాయి” అని ఓ ఇంటర్వ్యూలో చెప్పడం అక్కినేని అభిమానులకు ఊరట ఇస్తోంది.
ఎన్టీఆర్ కథలో ఉన్నంత డ్రామా అక్కినేని జీవితంలో లేకపోవొచ్చు. కానీ బయోపిక్‌కి కావాల్సినంత సరంజామా మాత్రం ఉంది. అక్కినేని కూడా తన జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలు చవి చూశారు. ముఖ్యంగా హార్ట్ ఎటాక్ తరవాత ఆయన కోలుకొన్న విధానం, క్యాన్సర్ తో పోరాడిన వైనం స్ఫూర్తివంతంగా నిలుస్తాయి. అన్నపూర్ణ స్టూడియోస్ కోసం ఆయన పడిన కష్టం, తెలుగు సినిమా చెన్నై నుంచి హైదరాబాద్ రావడానికి చేసిన కృషి మళ్లీ మళ్లీ చెప్పుకోవాల్సిందే. జీవితంలో ఆయన తీసుకొన్న కొన్ని కీలక నిర్ణయాలు ఆశ్చర్యపరుస్తాయి. ఎన్టీఆర్ తో స్నేహం కూడా ప్రత్యేకమైన అధ్యాయం.
బయోపిక్‌లా కాకుండా.. ఏఎన్నార్ కథని ఓ కొత్త కోణంలో చెప్పాలన్నది నాగార్జున ఆలోచన. దానికి సమర్థుడైన దర్శకుడు కావాలి. నాగ్ అశ్విన్ అయితే ఈ పని సమర్థంగా చేయగలడు. కాకపోతే… ఏఎన్నార్ పాత్రలో ఎవరు కనిపిస్తారు? అనేది ప్రధానం. నాగార్జున చేస్తే ఈ పాత్రకు తిరుగుండదు. ఎన్టీఆర్ బయోపిక్‌లో సుమంత్ ఈ పాత్ర చేశాడు. బాగానే మెప్పించాడు కూడా. సుమంత్ తో ఈ కథ చేస్తే తేలిపోతుంది. ఒకవేళ సినిమాగా కాకుండా వెబ్ సిరీస్‌గా చేసినా బాగానే ఉంటుంది. అలా చేయగలిగితే… సుమంత్ తో ఈ సినిమా పూర్తి చేయడం నయం. కమర్షియల్ హంగుల కోసం ఆశ పడకుండా సినిమాని పూర్తి చేయాలనుకొంటే మాత్రం సుమంత్ మంచి ఆప్షన్. సినిమాగా తీయాలంటే నాగ్ ఈ పాత్ర చేయాలి. నాగ అశ్విన్ లాంటి వాళ్లే దర్శకులుగా పూనుకోవాలి.


