ఒకప్పుడు సావిత్రి, శ్రీదేవి, విజయశాంతి.. ఇప్పుడు అనుష్క, నయనతార లాంటి హీరోయిన్లకి తప్పితే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చాలామందికి వర్కౌట్ కావు. హీరోయిన్లకు, దర్శకులకు ఈ తరహా సినిమాలు చేయాలని కోరిక ఉన్నప్పటికీ సరైన మార్కెట్ ఉండదు. అప్పుడప్పుడు తమ ప్యాషన్ కోసమైనా కొన్ని ఓరియెంటెడ్ సినిమాలు వదులుతుంటారు. అయితే వాటికి జనాల ఆదరణ కనిపించదు. హీరోయిన్స్ దీన్ని ఓపెన్ గా చెప్పడానికి అంతగా ఇష్టపడరు. కానీ అనుపమ పరమేశ్వరన్ మాత్రం ఈ విషయంలో చాలా ఓపెన్ గా మాట్లాడింది.
పరదా అనే లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తోంది అనుపమ. ఎప్పుడో మూడేళ్ల క్రితం మొదలైన ప్రాజెక్టు. పూర్తై దాదాపు ఏడాది అవుతుంది. ఏవో కారణాలతో సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఆగస్టు 22 రిలీజ్ డేట్ ని లాక్ చేసుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో చాలా ఓపెన్ గా లేడీ ఓరియెంటెడ్ సినిమాల పరిస్థితిని మీడియాకి వివరించింది అనుపమ.
“పోస్టర్ పై కేవలం అమ్మాయి ఉంటే అందరూ ఆమడదూరం పరిగెడతారు. ఎవ్వరికీ ఈ సినిమాల మీద ఆసక్తి లేదు. ఇటు ఓటిటి, అటు థియేటర్స్ రెండూ ముఖం చాటేస్తాయి. ప్రేక్షకులు కూడా ఉత్సాహం చూపించరు” అని నిర్మోహమాటంగా వాస్తవాన్ని చెప్పారు.
ఇదే సందర్భంలో పరదా ప్రత్యేకత గురించి కూడా చెప్పుకొచ్చారు. “ఇది చిన్న సినిమానే గాని ఈ సినిమా ద్వారా చెబుతున్న కంటెంట్ చాలా పెద్దది. దయచేసి థియేటర్స్ లో చూడండి” అని కోరింది అనుపమ.
లేడీ ఓరియెంటెడ్ సినిమాలపై జనాలకు ఆసక్తి ఉండదనే సత్యం. కానీ ఈ విషయాన్ని సినిమా చేసిన హీరోయినే వేదికపై చెప్పడం విశేషమే. అన్నట్టు.. అనుపమకి ఇది ఫస్ట్ సోలో రిలీజ్. ఒకవేళ ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తే గనుక.. లేడీ ఓరియెంటెడ్ జానర్ లో అనుపమ కొనసాగే ఛాన్స్ ఉంది. సురేష్ బాబు సినిమాని రిలీజ్ చేయడానికి ముందుకొచ్చారు. సో.. మంచి థియేటర్స్ దొరికే ఛాన్స్ ఉంది.