ఆంధ్రప్రదేశ్ పాలనా యంత్రాంగంలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. 2018 గ్రూప్-1 నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన అధికారులను కీలక పోస్టుల నుంచి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఇచ్చిన స్పష్టమైన ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టింది. దీంతో డీఎస్పీలు, డిప్యూటీ కలెక్టర్లుగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న పలువురు అధికారులు ఇప్పుడు లూప్ లైన్ , సాధారణ పోస్టులకు పరిమితమయ్యారు. ఈ పరిణామం అడ్మినిస్ట్రేషన్లో ఒక్కసారిగా కలకలం సృష్టించింది.
జవాబు పత్రాల దిద్దుబాటుపై అనుమానాలు
టీడీపీ హయాంలో వెలువడిన ఈ నోటిఫికేషన్ ప్రక్రియ, వైసీపీ అధికారంలోకి వచ్చాక పూర్తిగా వివాదాస్పదంగా మారింది. ముఖ్యంగా మెయిన్స్ జవాబు పత్రాల మూల్యాంకనంలో తీవ్ర అక్రమాలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులను కాదని, తమకు కావాల్సిన వారికి పోస్టులు కట్టబెట్టేందుకు జవాబు పత్రాలను రెండు, మూడు సార్లు దిద్దించారనే విమర్శలు వెల్లువెత్తాయి. ఏకంగా సివిల్ సర్వీసెస్ లో ర్యాంక్ సాధించిన అభ్యర్థిని కూడా ఈ గ్రూప్-1లో విఫలం
కావడం, ఈ అక్రమాలకు బలమైన సాక్ష్యంగా నిలుస్తోందని బాధితులు కోర్టుకెక్కారు.
సిట్ రంగ ప్రవేశం
తమకు జరిగిన అన్యాయంపై అభ్యర్థులు పట్టువదలకుండా న్యాయపోరాటం చేశారు. పరీక్షా పత్రాల డిజిటల్ మూల్యాంకనంలోనూ, మాన్యువల్ దిద్దుబాటులోనూ నిబంధనలు ఉల్లంఘించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రాథమిక ఆధారాలను పరిశీలించిన హైకోర్టు, ఈ మొత్తం వ్యవహారంపై లోతైన విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించాలని ఆదేశించింది. అక్రమాలు జరిగాయన్న అనుమానాలు బలంగా ఉండటంతో, విచారణ నిష్పక్షపాతంగా సాగేందుకు వీలుగా సదరు అధికారులను అధికార కేంద్రాలకు దూరంగా ఉంచాలని ఆదేశించింది.
ఉద్యోగాలను కొనుక్కున్న వారు ఉన్నారా?
ఒక్కసారిగా భారీ సంఖ్యలో అధికారుల బదిలీలు జరగడం వల్ల జిల్లాల పాలనపై కొంత ప్రభావం పడే అవకాశం ఉన్నప్పటికీ, వ్యవస్థను ప్రక్షాళన చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ అడుగు వేసింది. అక్రమ మార్గాల్లో ఉద్యోగాలు పొందిన వారు కీలక స్థానాల్లో ఉంటే ప్రజలకు న్యాయం జరగదని, పైగా వ్యవస్థపై సామాన్యులకు నమ్మకం పోతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. సిట్ విచారణలో ఏయే అక్రమాలు బయటపడతాయి? ఎవరెవరి పాత్ర ఉందనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. అక్రమాలు జరిగినట్లుగా తేలితే మాత్రం.. సంచలనాత్మక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.


