పవన్ కళ్యాణ్ ప్రశ్నించనంత కాలం ఎందుకు ప్రశ్నించడం లేదని అందరూ అడిగేవారు…విమర్శించేవారు.అయన తిరుపతి సభలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని, రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలని నిలదీసి ప్రశ్నించగానే అందరూ ఆయనని తప్పుపడుతున్నారు. గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకొన్నట్లుగా ఉలిక్కిపడుతూ, ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు. యదార్ధవాది లోకవిరోది అంటారు పెద్దలు. అది పవన్ కళ్యాణ్ విషయంలో మరోసారి నిరూపితమైంది.
ఆయన ప్రత్యేక హోదా గురించి చాలా నిర్మొహమాటంగా మాట్లాడితే దానికోసం పోరాడుతున్నమంటూ భుజకీర్తులు(మెడల్స్) తగిలించుకొని తిరుగుతున్నవారికి అది చాలా తప్పుగా అనిపించింది. వైకాపాకి ఆయన తెదేపా ఏజంటుగా కనిపించాడు లేదా జనాలకి అలాగ చూపించే ప్రయత్నం చేస్తోంది. “ప్రత్యేక హోదా కోసం మీరు చేసిందేమిటి?కేంద్రాన్ని గట్టిగా నిలదీసి అడగకుండా ఎందుకు బ్రతిమాలుకొంటున్నారు?” అని ప్రశ్నిస్తే తెదేపా వాళ్ళకి కోపం, రోషం పొడుచుకు వచ్చేసింది. ఆయన కేవలం ప్రజాభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే భాజపా నేతలకి నచ్చలేదు. ఓటుకి నోటు కేసులో చంద్రబాబు నాయుడుని ప్రశ్నించలేదు కనుక, ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం ప్రశ్నించడం కూడా తప్పే అని కాంగ్రెస్ పార్టీ ఒక కొత్త సిద్దాంతం కనిపెట్టింది. మొత్తంగా చూస్తే ప్రత్యేక హోదా గురించి పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం ఏ రాజకీయ పార్టీకీ నచ్చలేదని స్పష్టం అయ్యింది.
ఏపిలో రాజకీయ పార్టీలన్నీ తాము ప్రత్యేక హోదా కావాలని కోరుకొంటున్నామని, అందుకోసం కృషి చేస్తున్నామనో లేదా గట్టిగా పోరాడుతున్నామనో చెప్పుకొంటున్నాయి. కానీ దాని గురించి పవన్ కళ్యాణ్ గట్టిగా నిలదీసి ప్రశ్నిస్తే మాత్రం జీర్ణించుకోలేకపోవడం చాలా విచిత్రంగానే ఉంది. ఎవరి భయాలు వారికుండటమే కారణమని చెప్పకతప్పదు. ఆ భయాలని విశ్లేషించి చెప్పినా చాలా మందికి నచ్చకపోవచ్చు. కారణం ముందే చెప్పుకొన్నాము- యదార్ధవాది లోకవిరోది అని.
రెండున్నరేళ్ళుగా పవన్ కళ్యాణ్ తీరు చూస్తున్న తెదేపా, ఆయన ఎన్నడూ ప్రత్యక్షరాజకీయాలలో రాడు. వచ్చినా తమతో కలిసే సాగుతాడనే నమ్మకం పెట్టుకొంది. మరోపక్క ఒకవేళ ఆయన తమని సవాలు చేస్తే ఏమిచేయాలి? ఆయనని ఏవిదంగా ఎదుర్కోవాలనే ఆలోచనలు కూడా చేస్తోంది కానీ దానిపై ఇంకా స్పష్టత రాలేదు. పవన్ కళ్యాణ్ అకస్మాత్తుగా పిడుగులా మీద పడేసరికి ఉలిక్కిపడి ఆత్మరక్షణ కోసం తెదేపా నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు. కానీ 2014ఎన్నికలలో పవన్ కళ్యాణ్ సహాయంతోనే తాము అధికారంలోకి వచ్చమనే సంగతి మరిచిపోయి విమర్శలు చేస్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ తెదేపాని ప్రశ్నించనంతవరకు వారికి ఆయన మంచివాడుగా కనిపిస్తారు. ప్రశ్నిస్తే శత్రువుగా భావిస్తారన్న మాట!
ఇక ప్రత్యేక హోదా అంశంపై పోరాడేందుకు పేటెంట్ హక్కులు పొందినట్లు భావిస్తున్న వైకాపాకి, పవన్ కళ్యాణ్ అకస్మాత్తుగా ఊడిపడి దాని గురించి ‘పాయింట్ బ్లాంక్ రేంజ్’ లో భాద్యులందరినీ సూటిగా ప్రశ్నించడంతో తమ ఉద్యమాన్ని ఆయన హైజాక్ చేసేస్తున్నాడని ఆందోళన, ఆగ్రహం కలగడం సహజం. చంద్రబాబు నాయుడుని, తెదేపాని రాజకీయంగా దెబ్బ తీసేందుకు ప్రత్యేక హోదా అంశాన్ని వైకాపా ఒక ఆయుధంగా వాడుకోవడం అందరూ చూస్తూనే ఉన్నారు. ఆ బలమైన ఆయుధాన్ని పవన్ కళ్యాణ్ ఎగరేసుకుపోతే వైకాపాకి ఆగ్రహం కలగడం సహజమే. అందుకే వైకాపాకి పవన్ కళ్యాణ్ తెదేపా ఏజంటుగా కనిపిస్తున్నాడు లేదా ఆవిధంగా ప్రజలకి చూపించే ప్రయత్నం చేస్తోంది. లేకుంటే నటుడు శివాజీ ప్రత్యేక పోరాటాన్ని ఏమాత్రం పట్టించుకోని వైకాపా పవన్ కళ్యాణ్ ని చూసి ఇంతగా ఉలికిపడనవసరం లేదు. కానీ ఉలిక్కిపడింది అంటే అదే కారణం.
ఒకవేళ పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికలలో జనసేన అభ్యర్ధులని బరిలోకి దింపినట్లయితే ఓట్లు చీల్చిపోయి తెదేపా, వైకాపాలు రెండూ చాలా నష్టపోతాయి. ఇక కాంగ్రెస్, భాజపాల పరిస్థితి ఊహించుకోలేము. అందుకే పవన్ కళ్యాణ్ ని చూసి అన్ని పార్టీలు ఉలిక్కిపడుతున్నాయి.
తిరుపతి సభతో పవన్ కళ్యాణ్ తను రబ్బర్ సింగ్ కాదు గబ్బర్ సింగే అని నిరూపించగలిగారు. కానీ ఆ సభలో చెప్పిన మాటలని ఆచరణలో పెట్టిచూపడం కూడా అంతే అవసరం. అప్పుడే విశ్వసనీయత ఏర్పడుతుంది. చివరాఖరిగా అందరూ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ప్రత్యేక హోదా అంశంపై రాజకీయ పార్టీలన్నీ ‘గేమ్’ ఆడుకోదలిస్తే నిరభ్యంతరంగా ఆడుకోవచ్చు. కానీ దానికోసం పోరాడుతానని ముందుకు వస్తున్న పవన్ కళ్యాణ్ న్ని అడ్డుకోనవసరం లేదు. అడ్డుకొంటే అవే నష్టపోతాయి.