ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని శాశ్వతం చేస్తూ, భవిష్యత్తులో ఏ శక్తీ మార్చలేని విధంగా చట్టబద్ధత కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేసింది. శనివారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన అమరావతి తీర్మానంపై చర్చ దాదాపు ఆరు గంటల పాటు ఉత్కంఠభరితంగా సాగింది. విభజన చట్టంలో అమరావతిని అంతర్భాగం చేయాలని కేంద్రాన్ని కోరుతూ సభ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ చారిత్రక చర్చకు ప్రధాన ప్రతిపక్షం వైసీపీ హాజరుకాలేదు.
రాజధానిపై పగబట్టిన వైసీపీ
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్చను ప్రారంభిస్తూ గత ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రపంచస్థాయి రాజధానిని నిర్మించాలనే సంకల్పంతో 34 వేల ఎకరాలను రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు. కానీ, జగన్ మోహన్ రెడ్డి కేవలం రాజకీయ కక్షతో రాజధానిని స్మశానంగా మార్చారు అని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రాజధానుల ముసుగులో అమరావతిని అనాథను చేశారని, రైతులను రోడ్డున పడేసిన పాపం గత ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడు చేస్తున్న తీర్మానం అమరావతికి రక్షణ కవచంలా మారుతుందని భరోసా ఇచ్చారు.
అమరావతి ఏ ఒక్కరి సొత్తో కాదు
ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తనదైన శైలిలో ఘాటుగా స్పందించారు. అమరావతి అనేది కేవలం ఒక కులానికో, ప్రాంతానికో చెందింది కాదు.. అది ఐదు కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవం అని గర్జించారు. జగన్ సర్కార్ రాజధానిని చెరబట్టి రాష్ట్ర భవిష్యత్తును పదేళ్లు వెనక్కి నెట్టేసిందని విమర్శించారు. వైసీపీ ఎమ్మెల్యేలు సభకు రాకుండా పారిపోయారని, కనీసం తప్పు ఒప్పుకునే ధైర్యం కూడా వారికి లేదని ఎద్దేవా చేశారు. అమరావతిని వెలుగుల జిలుగుల నగరంగా మార్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చాటిచెప్పారు.
సైకో పాలనలో అమరావతి బలి
గత ఐదేళ్ల పాలనను సైకో పాలన గా నారా లోకేష్ అభివర్ణించారు. అమరావతిలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక గ్రాఫిక్స్ అంటూ అబద్ధాలు ప్రచారం చేశారని మండిపడ్డారు. ఇన్సైడర్ ట్రేడింగ్ పేరుతో బురదజల్లి, కోర్టుల చుట్టూ తిప్పి కాలయాపన చేశారని దుయ్యబట్టారు. ఇప్పుడు అమరావతికి కేంద్రం నుంచి నిధులు రాబట్టడమే కాకుండా, చట్టబద్ధత కల్పించి ఏ శక్తీ అడ్డుకోలేని విధంగా అభివృద్ధి చేస్తామని లోకేష్ స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో అమరావతి రైతులపై జరిగిన దాడులు, అక్రమ కేసులను అచ్చెన్నాయుడు గుర్తు చేశారు. బీజేపీ సభ్యుడు, మంత్రి సత్యకుమార్ యాదవ్ కేంద్ర ప్రభుత్వం అమరావతి అభివృద్ధికి కట్టుబడి ఉందని, విభజన చట్టం సవరణ ద్వారా దీనికి మరింత బలం వస్తుందని పేర్కొన్నారు. విష్ణుకుమార్ రాజు వంటి నేతలు కూడా జగన్ ప్రభుత్వం చేసిన రాజధాని ద్రోహం ను అంకెలు, సాక్ష్యాలతో సహా వివరించారు.
వైసీపీ గైర్హాజరీ.. వ్యూహాత్మక ఓటమి!
ఈ చర్చకు వైసీపీ హాజరుకాకపోవడం ఆ పార్టీకి పెద్ద దెబ్బగా మారింది. కూటమి నేతలు చేసిన తీవ్రమైన ఆరోపణలను తిప్పికొట్టే అవకాశం ఉన్నా, సభను బహిష్కరించడం ద్వారా వైసీపీ తన ఓటమి ని అంగీకరించినట్లయింది. తప్పు ఒప్పుకున్నట్లయింది.


