కల్తీ నెయ్యి వ్యవహారంపై ఏపీ అసెంబ్లీ వేదికగా రాజకీయ కురుక్షేత్రం మొదలుకానుంది. ప్రభుత్వం ఈ అంశాన్ని అత్యంత ప్రతిష్టాత్మకగా తీసుకుని, వాస్తవాలను ప్రజల ముందు ఉంచేందుకు వ్యూహరచన చేసింది. తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా గత ప్రభుత్వ హయాంలో జరిగిన నెయ్యి కల్తీ వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చిచ్చు రేపుతోంది. ఈ సున్నితమైన అంశంపై శాసనసభలో సుదీర్ఘ చర్చకు రంగం సిద్ధమైంది. కేవలం ఆరోపణలతో సరిపెట్టకుండా, ఆధారాలతో సహా వైసీపీ వైఫల్యాలను ఎండగట్టాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించుకుంది.
వైసీపీ అధికారంలోకి రాగానే చేసిన పనులతో సహా మొత్తం ప్రజల ముందు!
వైసీపీ అధికారంలోకి రాగానే చేసిన నెయ్యి కల్తీ నుంచి అ నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డ్ (NDDB) ఇచ్చిన నివేదికతో సహా ప్రస్తుతం విచారణ జరుపుతున్న ఏకసభ్య కమిషన్ వరకు ప్రతి అంశాన్ని ప్రభుత్వం సభ ముందు ఉంచనుంది. గత ప్రభుత్వ హయాంలో హిందూ ధర్మానికి, భక్తుల మనోభావాలకు జరిగిన ద్రోహాన్ని సాక్ష్యాధారాలతో నిరూపించడమే లక్ష్యంగా పాలకపక్షం అడుగులు వేస్తోంది. టెండర్ల ప్రక్రియలో జరిగిన లోపాలు, తక్కువ ధరకు నెయ్యి సరఫరా వెనుక ఉన్న మతలబులను బయటపెట్టడం ద్వారా ప్రతిపక్షాన్ని ఇరుకున పెట్టాలని భావిస్తోంది. తప్పును ఒప్పుకోకుండా తిరిగి హెరిటేజ్ సంస్థపై, ముఖ్యమంత్రి కుటుంబంపై వైసీపీ చేస్తున్న ఎదురుదాడిని తిప్పికొట్టేందుకు అసెంబ్లీని సరైన వేదికగా ప్రభుత్వం భావిస్తోంది.
సభకు వస్తారా? ముఖం చాటేస్తారా?
ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చే ధైర్యం చేస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది. సభలో చర్చ జరిగితే వాస్తవాలు బయటకు వస్తాయని, అది తమ రాజకీయ మనుగడకే ప్రమాదమని వారు ఆందోళన చెందుతున్నారు. శాసనసభకు గైర్హాజరై, శాసనమండలిలో మాత్రం నిరసనల పేరుతో కాలయాపన చేసి బయటకు వెళ్లిపోయే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. చర్చలో పాల్గొంటే సమాధానం చెప్పుకోలేక, పాల్గొనకపోతే పారిపోయారన్న ముద్ర పడుతుందన్న సందిగ్ధంలో ఆ పార్టీ నేతలు ఉన్నారు.
హిందూత్వ సెంటిమెంట్.. సర్కార్ సీరియస్
హిందూ ధర్మంపై దాడులు జరుగుతున్నా చూస్తూ ఊరుకుంటే అది మరిన్ని అనర్థాలకు దారితీస్తుందని ప్రభుత్వం గట్టిగా నమ్ముతోంది. భక్తుల మనోభావాలతో ఆడుకున్న వారిని చట్టపరంగానే కాకుండా, రాజకీయంగా కూడా ప్రజల ముందు దోషులుగా నిలబెట్టాలని చూస్తోంది. అందుకే ఈ వారంలోనే శాసనసభతో పాటు శాసనమండలిలో కూడా దీనిపై చర్చను చేపట్టాలని నిర్ణయించింది. ప్రజలకు అసలు నిజాలు తెలిస్తేనే తప్పుడు ప్రచారాలకు అడ్డుకట్ట పడుతుందని కూటమి నేతలు భావిస్తున్నారు. ప్రజలకు నిజాలు తెలియచేయడమే లక్ష్యంగా శాసనసభలో చర్చలు జరగనున్నాయి.
