ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది పుంజుకుంటోంది. వైసీపీ హయాంలో నేలకు పడి.. ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న రాష్ట్రం, ఇప్పుడు దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ముందు వరుసలో నిలిచింది. 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల్లోనే రాష్ట్ర మొత్తం ఉత్పత్తి 10.5 శాతం పెరిగింది. దేశవ్యాప్తంగా సగటు వృద్ధి 8.8 శాతం ఉంటే, ఆంధ్రా దాన్ని దాటి ముందుంది. ఈ వేగంతో ఈ ఏడాది మొత్తం రాష్ట్ర ఆదాయం సుమారు 18 లక్షల 65 వేల కోట్ల రూపాయలకు చేరుకునే అవకాశం ఉందని అంచనాలు వస్తున్నాయి.
వ్యవసాయ రంగంలో పునరుజ్జీవం
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగం ఏపీ ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవంలో పెద్ద పాత్ర పోషిస్తోంది. మొదటి త్రైమాసికంలోనే వ్యవసాయ ఉత్పత్తి 9.6 శాతం పెరిగి 81 వేల 496 కోట్ల రూపాయలకు చేరింది. గత ఏడాది మొత్తం మీద చూస్తే వ్యవసాయం 36 శాతానికి పైగా వృద్ధి సాధించింది. అలాగే సేవల రంగం 8.5 శాతం, పరిశ్రమలు 23 శాతం పైగా పెరిగాయి. ఈ మూడు రంగాలూ ఒకేసారి బలపడటం వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు గట్టి పునాది ఏర్పడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన “స్వర్ణాంధ్ర విజన్ 2047” ఈ వృద్ధికి ప్రధాన దోహదం చేస్తోంది. ఈ పథకం ప్రకారం 2047 నాటికి రాష్ట్ర ఆదాయం 2.4 లక్షల కోట్ల డాలర్లకు , ప్రతి వ్యక్తి సంవత్సర ఆదాయం సుమారు 35 లక్షల రూపాయలు చేరాలి. ఆ దీర్ఘకాలిక లక్ష్యం వైపు ఇప్పటి వృద్ధి మొదటి అడుగుగా కనిపిస్తోంది.
నిరంతర పర్యవేక్షణ – ప్రతి చిన్న అంశం ఫాలో అప్
ప్రభుత్వం అన్ని శాఖల పనితీరునూ 512 ముఖ్య సూచికలతో నిరంతరం పర్యవేక్షిస్తోంది. దీని వల్ల పథకాలు వేగంగా అమలవుతున్నాయి, అధికారుల్లో బాధ్యత పెరిగింది. విదేశీ పెట్టుబడులు కూడా మళ్లీ రావడం మొదలైంది. 2019-24 మధ్య 9 వేల 397 కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు వచ్చాయి. సముద్ర ఆహార ఎగుమతుల్లో దేశంలోనే ఆంధ్రాకు 38 శాతం వాటా ఉంది, దాదాపు 7.74 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు జరిగాయి. విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 28 వేల 409 మెగావాట్లకు చేరింది. రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గించడం, బ్యాంకుల్లో డబ్బు లభ్యత పెంచడం వల్ల ప్రజలు మళ్లీ కొనుగోళ్లు పెంచారు. ద్రవ్యోల్బణం 2.1 శాతానికి పడిపోవడం ఈ పునరుజ్జీవానికి గొప్ప ఊతం ఇచ్చింది.
సవాళ్లూ ఉన్నాయి !
అయితే అన్నీ సజావుగా సాగడం లేదు. మే, అక్టోబర్ నెలల్లో జీఎస్టీ వసూళ్లు కొంత తగ్గాయి. దీనికి కారణం జీఎస్టీ రేట్లు తగ్గించడమే. దీర్ఘకాలంలో వ్యవసాయం, పరిశ్రమలు, ఎగుమతులు బలపడడంతో ఈ తాత్కాలిక ఇబ్బంది తొలగిపోతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ మళ్లీ కోలుకుని, వేగంగా ముందుకు దూసుకెళ్తోంది. ఈ వేగం కొనసాగితే చంద్రబాబు అనుకున్న విధంగా రాష్ట్ర ప్రజలకు మరింత ఉపాధి, మెరుగైన జీవనం లక్ష్యం సాకారం అవుతుంది.