సచివాలయ ఉద్యోగ సంఘంలో వెంకట్రామిరెడ్డి అనే నేత గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఉద్యోగుల్లో వైసీపీ నేతగా దందాలు చేసుకుని ఐదేళ్లలో దండిగా సంపాదించుకున్న ఆయన ఇప్పుడు వాటిని ఖర్చు పెట్టి తన పరపతి నిలుపుకోవాలనుకుంటున్నారు. ఎన్నికల్లో వైసీపీకి ప్రచారం చేసి సస్పెండ్ అయిన ఆయనపై కొత్త ప్రభుత్వం వచ్చి ఐదు నెలలు అయినా చర్యలు తీసుకోలేదు.దాంతో ఉద్యోగులకు మందు పోయించి.. తన పలుకుబడి నిలుపుకోవాలనుకుంటున్నారు.
డిసెంబర్లో సచివాలయ క్యాంటీన్ నిర్వహణ కమిటీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందు కోసం ఇప్పటి నుంచే మందు పార్టీలు ప్రారంభించారు. పెద్ద ఎత్తున లిక్కర్‌తో తాడేపల్లిలో పార్టీ ఇస్తూంటే పోలీసులు వచ్చి పట్టుకున్నారు. ఇంత పెద్ద లిక్కర్ పార్టీకి చిన్న అనుమతి కూడా తీసుకోలేదు. నిర్వాహకుడు వెంకట్రామిరెడ్డేనని పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. ఉద్యోగులకు మందు పోసి..తాను సంపాదిచిన పాపంలో తిలా పిడికెడు పడేసి.. మళ్లీ తన ప్రభావం చూపాలనుకుంటున్నారు.
వెంకట్రామిరెడ్డిపై అభియోగాలు చిన్నవేమీ కాదు. సర్వీస్ రూల్స్ ఉల్లంఘన అభియోగాలు ఉన్నాయి. ఆయనపై చర్యలు తీసుకుంటే ఈ పాటికి డిస్మిస్ అయ్యేవారు. కానీ ప్రభుత్వంలో కొంత మంది ఉన్నతాధికారులు ఇంకా ఆయనకు మద్దతు తెలుపుతున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.