రాష్ట్రంలో పడిపోతున్న జననాల రేటును అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో కుటుంబ నియంత్రణ స్థానంలో కుటుంబ పురోగతి ని ప్రోత్సహిస్తూ, రెండో, మూడో బిడ్డకు జన్మనిచ్చే తల్లులకు ప్రసవ సమయంలో రూ. 25,000 ఆర్థిక సాయం అందజేస్తామని వెల్లడించారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, జనాభా సమతుల్యతను కాపాడడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రం వృద్ధాప్యంలోకి వెళ్తున్న అంశంపై అసెంబ్లీలో కీలక వివరాలు వెల్లడించారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొత్తం సంతానోత్పత్తి రేటు 1.5 కి పడిపోవడంపై సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. ఆదర్శవంతమైన రేటు 2.1 ఉండాల్సి ఉండగా, అంతకంటే తక్కువగా ఉండటం భవిష్యత్తులో తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని హెచ్చరించారు. రాష్ట్రంలోని 58 శాతం కుటుంబాలు కేవలం ఒక్క బిడ్డకే పరిమితం కావడం వల్ల యువశక్తి తగ్గిపోయి, వృద్ధుల జనాభా పెరిగే ప్రమాదం ఉందని, ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై భారం పడుతుందని వివరించారు.
రాబోయే రోజుల్లో పని చేసే శక్తి కొరత రాకుండా ఉండాలంటే జనాభా విధానంలో మార్పులు తప్పవని ప్రభుత్వం భావిస్తోంది. జపాన్, చైనా వంటి దేశాల్లో ఎదురవుతున్న జనాభా సంక్షోభం ఏపీకి రాకూడదనే ముందస్తు జాగ్రత్తతో ఈ ప్రోత్సాహకాలను డిజైన్ చేశారు. కేవలం ఆర్థిక సాయమే కాకుండా, ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించేలా చట్టాల్లో మార్పులు చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.


