ఏపీలో బంగారు నిక్షేపాలు ఉన్నాయని కేంద్రం గుర్తించింది. అక్కడ తవ్వకాలకు వేలం నిర్వహించబోతోంది. దేశవ్యాప్తంగా ఉన్న 13 బంగారు గనులను విక్రయించాలని కేంద్రం నిర్ణయించింది. ప్రభుత్వం విక్రయించనున్న గనుల్లో ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 10 గనులు ఉన్నాయి. గనుల కొనుగోలుకు సంబంధించి ఆసక్తిగల వారి నుంచి టెండర్లు ఆహ్వానిస్తూ మార్చి 21న కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది.
ఏపీలో విక్రయించనున్న గనుల్లో రామగిరి నార్త్ బ్లాక్, బొకసంపల్లి నార్త్ బ్లాక్, బొకసంపల్లి సౌత్ బ్లాక్, జవకుల-ఎ, జవకుల-బి, జవకుల-సి, జవకుల-డి, జవకుల-ఒ, జవకుల-ఎఫ్ బ్లాక్‌లు ఉన్నాయి. వీటిలో 5 గనులకు ఈ నెల 26న, మిగతా ఐదింటికి 29న వేలం నిర్వహించనున్నారు. అయితే ఇక్కడ మైనింగ్ ఎవరు దక్కించుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఇటీవల గాలి జనార్ధన్ రెడ్డి మైనింగ్ చేసుకున్నా తమకు అభ్యంతరం లేదని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.
అయితే గోల్డ్ మైనింగ్ అంత తేలిక కాదు. మొదట భూమి నుంచి యాభై మీటర్ల వరకూ తవ్వాలి. ఆ యాభై మీటర్ల వరకూ ఎలాంటి బంగారం బయట పడదు. ఆ తర్వాత దిగువకు వెళ్లే కొద్దీ బంగారం ఉంటుంది. టన్ను మట్టి తవ్వితీస్తే 4 గ్రాముల బంగారం ఉంటుందని ప్రాథమికంగా నిర్ధారించారు. అక్కడ తవ్వకాలు జరిపి బంగారం వెలికి తీస్తే.. 16 టన్నుల బంగారం వెలుగులోకి వస్తుందని నిర్ణయించారు. భూగర్భ గనుల కేటగిరిలోకి వీటిని చేర్చి తవ్వకాలు చేయనున్నారు.
అయితే ఏ లైసెన్స్ అయినా ఒకటే పనిగా తవ్వుకోవడం మన వాళ్లకు అలవాటే కాబట్టి మిగతా లైసెన్స్ గురించి ఎవరూ పట్టించుకోరు. గోల్డ్ మైన్స్ తవ్వకాల్లోనూ అదే జరిగేవి. అనంతపురం జిల్లాలో భారత్ గోల్డ్‌మైన్స్ లిమిటెడ్‌కు గనులు ఉండేవి. వీటిలో 2001 నుంచి తవ్వకాలు నిలిపేశారు. ఇప్పుడు మళ్లీ ప్రారంభిస్తున్నారు. గనులు దక్కించుకునేవారు బంగారం పేరుతో..ఇతర వనరులు కొల్లగొట్టే అవకాశాలున్నాయి.