అనంతబాబు కేసులో సుప్రీంకోర్టు ఆదేశిస్తే తప్ప నాడు తప్పులు చేసిన పోలీసులపై చర్యలు తీసుకోలేదని .. ఏపీ ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని కొంత మంది టీడీపీ సానుభూతిపరులు ప్రశ్నిస్తున్నారు. ఏపీ పోలీస్ వ్యవస్థలో గతంలో జరిగిన పరిణామాలపై చర్చను మళ్ళీ మొదటికి తెచ్చింది. సుప్రీంకోర్టు జోక్యం చేసుకునే వరకు పోలీసులపై చర్యలు తీసుకోకపోవడం పట్ల విమర్శలు వస్తున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం చట్టం తన పని తాను చేసుకుపోతుందనే సంకేతాలను ఇస్తోంది. గత ప్రభుత్వ హయాంలో రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి కొందరు అధికారులు పరిధి దాటి వ్యవహరించారనేది బహిరంగ రహస్యం.
పై స్థాయి అధికారులకు ఇప్పటికే శిక్షలు
వైసీపీ హయాంలో పెద్దలు కింది స్థాయి వ్యక్తులకు పోస్టింగులు ఆశ చూపి.. కేసుల భయం పెట్టి తమ నేరాలు, ఘోరాలు చేయించారు. అక్కడ ఎవరు ఉన్నా వారితో ఆ పనులు చేయించేవారు. ఆ విషయంలో చాలా మంది పోలీసులు నిస్సహాయులు. ఆ స్థానంలో ఎవరు ఉన్నా అప్పటి పరిస్థితుల్లో నిస్సహాయంగా మిగిలిపోవాల్సి వచ్చేది. కేవలం ఆదేశాలను పాటించడం వేరు , ప్రభుత్వ పెద్దలను మెప్పించడానికి అతిగా ప్రవర్తించడం వేరు. మరీ అతిగా చేసిన వారిని ముఖ్యంగా ఉన్నత స్థానాల్లో ఉన్నవారిని ప్రభుత్వం వదిలి పెట్టలేదు. సరైన చర్యలు తీసుకుంది. దానికి సాక్ష్యాంగా షెడ్డుకెళ్లిన ఐపీఎస్ అధికారులే కనిపిస్తున్నారు. కింది స్థాయి అధికారుల్లో చాలా మంది అతి చేశారు. కానీ వారు అలా చేయడం వెనుక ఉన్నది పై స్థాయి వ్యక్తులే. ఇలా అందర్నీ బాధ్యుల్ని చేయలేరు.
కింది స్థాయి అధికారులు కేవలం పావులే
ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగకుండా కేవలం బాధ్యులను చట్టం ముందు నిలబెట్టే ప్రయత్నం చేస్తోంది. కింది స్థాయి అధికారుల విషయంలో కూడా చట్టపరమైన ప్రక్రియలు జరుగుతున్నప్పటికీ అందరిపై ఒకేసారి చర్యలు తీసుకోవడం ఆచరణాత్మక ఇబ్బందులతో కూడుకున్న పని. కానీ న్యాయపరంగా వచ్చే సరికి వారు చర్యల నుంచి తప్పించుకోలేకపోతున్నారు. ప్రభుత్వం కూడా వారిని .. ఇతరుల ఒత్తిడితో చేశారు కాబట్టి క్షమించాలని అనుకోవడం లేదు. చట్టపరంగా జరగాల్సింది జరిగేలా చూస్తోంది.
కక్ష సాధింపు అని అనిపించకూడదు.. అందుకే ప్రభుత్వ సంయమనం
వ్యవస్థలో ప్రక్షాళన జరిగేటప్పుడు అది వ్యక్తిగత కక్షగా మారకుండా జాగ్రత్త పడటం ఎంతో అవసరం. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం పోలీసులను వాడుకోవడం వల్ల వచ్చే నష్టాన్ని ఇప్పుడు అందరూ గమనిస్తున్నారు. అందుకే ప్రస్తుత ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు గతంలో జరిగిన తప్పులు వెంటాడుతున్నాయనే భావన కలిగిస్తున్నాయి తప్ప కేవలం వేధింపులుగా కనిపించడం లేదు. ప్రజలు కూడా అధికార దుర్వినియోగాన్ని ఎప్పుడూ హర్షించరు. చట్టం తన ధర్మాన్ని నిర్వర్తించేలా చూడటం, బాధితులకు న్యాయం జరిగేలా చేయడంపైనే ప్రభుత్వం దృష్టి సారించింది. అనంతబాబు కేసు వంటి సున్నితమైన అంశాల్లో న్యాయస్థానాల ఆదేశాల మేరకు నడుచుకుంటూనే వ్యవస్థలో జవాబుదారీతనాన్ని పెంచేలా చర్యలు కొనసాగుతున్నాయి. సోషల్ మీడియాలో ఆవేశపడితే రాజకీయాల్లో ఎదురుదెబ్బలే తగులుతాయి.
