ఉచిత బస్సు పథకాన్ని ఆగస్టు 15వ తేదీ నుంచి అమలు చేయడానికి ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. దాదాపుగా వెయ్యి కొత్త బస్సులు కొనుగోలు చేసింది. రిపేరుకు వచ్చిన బస్సుల్ని బాగు చేయించింది. వీలైనంతగా ఎలక్ట్రిక్ బస్సుల్ని వాడేందుకు రెడీ చేశారు. ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. జిల్లాల వరకే అని చెప్పారు. కానీ రాష్ట్రం మొత్తం ఎక్కడి నుంచి ఎక్కడికైనా అన్న భావన ప్రజల్లో ఉండటం.. ఇప్పుడు జిల్లాలకే పరిమితం చేస్తే వ్యతిరేక ప్రచారం జరిగే అవకాశం ఉందన్న కారణంతో స్టేట్ మొత్తం వర్తింప చేయాలని నిర్ణయించారు.
తెలంగాణలో ఉచిత బస్సు రాష్ట్రమంతటా వర్తిస్తోంది. ఆదే కాన్సెప్ట్ ఏపీలోనూ అమలు చేయనున్నారు. ప్రయాణికుల డేటా పరిశీలించిన అధికారులు.. 80 శాతానికిపైగా మహిళా ప్రయాణికులు జిల్లాల పరిధిలోనే ఉన్నారని తేల్చారు. మరి ఆ ఒక్క ఇరవై శాతం మందికి మాత్రం ఎందుకు ఇబ్బంది పెట్టడం అని మార్పు చేస్తున్నారు. ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆర్టీసీ బస్సుల ఆక్యుపెన్సీ పెరుగుతుంది. ఉపాధి కోసం ప్రయాణించే మహిళలకు డబ్బులు మిగులుతాయి.
ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తే.. మహిళలకు పెద్ద ఎత్తున మేలు జరుగుతుంది. ఇప్పటికే కింది స్థాయిలో ప్రజలకు మేలు చేసేలా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు పకడ్బందీగా అమలవుతున్నాయి. అన్న క్యాంటీన్లు, తల్లికి వందనం సహా పలు పథకాలపై ప్రజల్లో సంతృప్తి కనిపిస్తోంది. ఇప్పుడు ఉచిత బస్సు కూడా సక్సెస్ అయితే.. ప్రభుత్వంపై సానుకూలత మరింత పెరుగుతుంది.