ఏపీ ప్రభుత్వం టాలీవుడ్ కి ఓ తీపి వార్త చేర వేసింది. టికెట్ రేట్ల పెంపు విషయమై ఓ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో సీనియర్ నిర్మాత వివేక్ కూచిభొట్ల కూడా ఉన్నారు. ఓ పెద్ద సినిమా వస్తుందంటే టికెట్ రేట్ల గురించి ప్రభుత్వానికి అభ్యర్థనలు పంపడం, అనుమతులు వచ్చేంత వరకూ ఎదురు చూస్తూ కూర్చోవడం నిర్మాతలకు పెద్ద తలనొప్పి అయిపోయింది. ప్రతీసారీ జీవో కోసం ఎదురు చూడడం నిజంగా ఇబ్బందికరమైన వ్యవహారమే. దీనికి ఏపీ ప్రభుత్వం చెక్ పెట్టబోతోంది. ఈ కమిటీ ద్వారా టికెట్ రేట్ ఎంత ఉండాలి? అనే విషయమై నిర్మాతల అభిప్రాయం తీసుకొని, ఒక నిర్దుష్టమైన విధానాన్ని అమలు చేయాలన్నది ప్రభుత్వ యోచన. చిన్న, మీడియం, పెద్ద సినిమాలకు బడ్జెట్లని బట్టి తొలి మూడు వారాలూ టికెట్ రేట్లు డిసైడ్ చేస్తారు. ఇక అవే అమలు అవుతాయి.
గత జగన్ ప్రభుత్వ హయాంలో నిర్మాతలు బాగా ఇబ్బంది పడ్డారు. టికెట్ రేట్లు బాగా తగ్గించేసి, నిర్మాతల ఆదాయానికి గండి కొట్టే ప్రయత్నం చేసింది జగన్ సర్కార్. టికెట్ రేట్లపై ప్రభుత్వ అజమాయిషీ ఏమిటని చాలామంది ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ సైతం అప్పట్లో జగన్ విధానాలపై పోరాడారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది. నిర్మాతల కష్టనష్టాల్ని అర్థం చేసుకొని, వాళ్ల అభీష్టం మేరకు కొత్త చట్టాల్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది కూటమి ప్రభుత్వం. అందులో భాగంగానే ఈ కమిటీ ఏర్పాటైంది. త్వరలోనే నిర్మాతలతో ఈ కమిటీ సభ్యలు సమావేశమై వాళ్ల అభ్యర్థనలు స్వీకరిస్తారు. ఆ తరవాత ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తారు. అనంతరం టికెట్ రేట్లపై ఓ స్పష్టత వస్తుంది. ఇలాంటి ప్రయత్నమే తెలంగాణ ప్రభుత్వం కూడా చేపట్టాల్సిన అవసరం ఉంది. టికెట్ రేట్లు పెంచమని ప్రతీసారీ ప్రభుత్వానికి మొర పెట్టుకొని, జీవోల కోసం ఎదురు చూసే బాధ తప్పుతుంది.