ఏపీ ప్రభుత్వం మళ్ళీ అదే తప్పు చేస్తోందా?

రాష్ట్ర విభజన జరిగి ఆంద్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా, గుంటూరు జిల్లాలపై చూపుతున్నంత శ్రద్ద మిగిలిన జిల్లాలపై చూపడం లేదనే చెప్పక తప్పదు. గత 14నెలల్లో వచ్చిన అనేక ప్రాజెక్టులు, నిధులలో అధిక శాతం కృష్ణా, గుంటూరు జిల్లాలకే పరిమితం చేస్తూ మిగిలిన జిల్లాల అభివృద్ధి పట్ల అశ్రద్ద కనబరుస్తోంది. మొత్తం అభివృద్ధి అంతా ఆ రెండు జిల్లాలోనే కేంద్రీకృతం అవుతోంది. గత ఆరు దశాబ్దాలుగా సమైక్య రాష్ట్రాన్ని పాలించిన పాలకులు అందరూ రాష్ట్రంలో అన్ని జిల్లాలను సమానంగా అభివృద్ధి చేయకుండా కేవలం హైదరాబాద్ నే అభివృద్ధి చేసుకొంటూ పోయారు. దాని వలన చివరికి ఏమయిందో అందరూ చూశారు. హైదరాబాద్ విషయంలో చేసిన పొరపాటునే చంద్రబాబు నాయుడు మళ్ళీ ఇప్పుడు అమరావతిలో కూడా పునరావృతం చేస్తున్నట్లు కనబడుతోంది.

రాష్ట్రంలో 13జిల్లాలను సమానంగా అభివృద్ధి చేయడం, పరిపాలనా వికేంద్రీకరణ చేయడం చాలా అవసరం. కానీ చంద్రబాబు నాయుడు కృష్ణా, గుంటూరు జిల్లాలను అభివృద్ధి చేస్తే రాష్ట్రమంతా అభివృద్ధి చేసినట్లేనని భావిస్తున్నట్లున్నారు. రాష్ట్రంలో ప్రకాశం, అనంతపురం, కడప, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలపట్ల రాష్ట్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తోంది. ఉత్తరాంధ్రా జిల్లాలలో ఒక్క విశాఖనగరాన్ని తప్ప విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలను అసలు పట్టించుకోవడమే లేదు. ఆ రెండు జిల్లాలలో గత 14నెలల్లో ఒక్క ప్రాజెక్టు కూడా రాలేదు. ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇంతవరకు జరుగలేదు.

విజయనగరం జిల్లాలో భోగాపురం వద్ద విమానాశ్రయం ఏర్పాటుకి రైతుల భూములను ప్రభుత్వం లాక్కొనే ప్రయత్నం చేస్తోంది. అదొక్కటే ప్రధానంగా కనిపిస్తోంది. విజయనగరంలో వరి, మామిడి, చెరుకు, జొన్నలు, కూరగాయలు విస్తారంగా పండుతాయి. అక్కడ నుండే ఇతర రాష్ట్రాలలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు మామిడి, బొప్పాయి పళ్ళు ఎగుమతి అవుతుంటాయి. కనుక ఆ జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను నెలకొల్పినట్లయితే రైతులకు, యువతకు మంచి లాభం చేకూరుతుంది.

విశాఖ, శ్రీకాకుళం జిల్లాలకి పొడవయిన సముద్రతీరం ఉన్నందున మత్స్య సంబంధిత పరిశ్రమలు, ఎగుమతి దిగుమతుల సంస్థలు నెలకొల్పవచ్చును. అలాగే ఆ రెండు జిల్లాలలో అనేక పర్యాటక స్థలాలు, ప్రముఖ పుణ్యక్షేత్రాలు అనేకం ఉన్నాయి. వాటిని అభివృద్ధి చేయవచ్చును. విశాఖ జిల్లా ఇప్పటికే ఐటి కేంద్రంగా మంచి పేరు సంపాదించుకొంది. కానీ ఐటి పరిశ్రమలు కేవలం విశాఖ నగరానికే పరిమితం అవుతున్నాయి. వాటిని జిల్లాలో మరికొన్ని మండలాలకు వ్యాపింపజేయగలిగితే జిల్లాలో కూడా అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుంది.

కరువు పీడిత అనంతపురం జిల్లాలో వానకి, నీటికి కరువుందేమో కానీ ఎండలకు మాత్రం కరువు లేదు. అందుకే అక్కడ సోలార్ ఇండస్త్రీలని ప్రభుత్వం నెలకొల్పుతోంది. ఆ జిల్లాలో ఈ మధ్యనే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కానీ కడప, ప్రకాశం జిల్లాల అభివృద్ధికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టలేదు. ముఖ్యంగా గుంటూరు జిల్లాకి పక్కనే ఉన్న ప్రకాశం జిల్లాని ప్రభుత్వం అసలు పట్టించుకోకపోవడం చాలా విచిత్రంగా ఉంది.

రాష్ట్ర విభజనతో తీవ్రంగా దెబ్బ తిన్న రాష్ట్రాన్ని సమర్దుడయినా చంద్రబాబు నాయుడే గాడినపెట్టగలరనే నమ్మకంతో ప్రజలు ఆయనకి అధికారం అప్పజెప్పారు. కనుక ఆయన ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవలసిన బాధ్యత ఆయనపైనే ఉంది. రాష్ట్రంలో రెండు జిల్లాలను మాత్రమే అభివృద్ధి చేసి మిగిలిన వాటిని పట్టించుకోకపోతే ప్రజలలలో అసంతృప్తి, అసహనం మొదలవుతుంది. అది ప్రతిపక్షాలకు మంచి అవకాశంగా మారుతుంది. ప్రత్యేక హోదా విషయంలో అవి చేస్తున్న హడావుడి చూస్తే ఆ సంగతి అర్ధం అవుతుంది. కనుక ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని జిల్లాలను సమానంగా అభివృద్ధి చేయడం మంచిది. దాని వలన అధికార పార్టీకే ప్రజలలో మంచిపేరు వస్తుంది. వచ్చే ఎన్నికలలో దాని ఫలితం కనిపిస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com