ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎయిడెడ్ విద్యా సంస్థల్లో చదువుకున్న వారు ఆందోళనకు గురవుతున్నారు. తమ చదువు ఎక్కడ కొండెక్కుతుందోనన్న ఆందోళన చెందుతున్నారు. దీనికి కారణం ప్రభుత్వం సాగిస్తున్న “రహస్య పాలన”. ప్రభుత్వం ఓ జీవో జారీ చేసింది. దాని ప్రకారం ఎవరైనా స్వచ్చందంగా తమ ఎయిడెడ్ స్కూళ్లను ప్రభుత్వానికి ఇచ్చేయవచ్చు. లేకపోతే నడుపుకోవచ్చు. ఈ జీవో ఉన్న దాని ప్రకారం ప్రభుత్వానికి ఇవ్వకపోతే.. ప్రభుత్వం ఎలాంటి ఎయిడ్ ఇవ్వదు. అంటే ప్రైవేటుగా నడుపుకోవాలి. కానీ కోర్టుల్లో కేసులు పడినప్పుడు మాత్రం ప్రభుత్వం భిన్నంగా చెబుతోంది. ఎయిడ్ ఆపేది లేదని ఇస్తామని చెబుతోంది. కానీ వాస్తవానికి ఇచ్చే ప్రశ్నే లేదని తేల్చి చెప్పడంతో చాలా ఎయిడెడ్ కాలేజీలు, స్కూళ్లు మూతకే ప్రాధాన్యం ఇస్తున్నాయి. జీవోలో ఒకటి చెప్పి.. కోర్టులకు మరొకటి చెప్పి సాగిస్తున్న రహస్య పాలన మొదటి సైడ్ ఎఫెక్ట్ ఇది.
ఇక స్వచ్చందమేనని ఎవర్నీ బలవంతం చేయడం లేదని చెప్పిన విషయంలోనూ ఎక్కడా పారదర్శకత లేదు. ఎయిడెడ్ యాజమాన్యాలను ప్రభుత్వం అన్ని రకాలుగా బెదిరింపులకు పాల్పడుతోందని చాలా రోజులుగా విమర్శలు వస్తున్నాయి. చాలా మంది ఒత్తిళ్లను భరించలేక ప్రభుత్వానికి అప్పగిస్తూ సంతకాలు చేశారు. కొంత మంది హైకోర్టుకు వెళ్లడంతో హైకోర్టు కూడా బెదిరింపులు ఏమిటని ప్రశ్నించింది. కానీ బెదిరింపులు ఇప్పటికీ అలా సాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా అత్యంత ఖరీదైన ఆస్తులు ఉన్న ఎయిడెడ్ స్కూళ్లు కాలేజీల విషయంలో ప్రభుత్వ పెద్దలు వ్యక్తిగత శ్రద్ధ తీసుకున్నారు. ఇది రహస్య పాలనలో రెండో సైడ్ ఎఫెక్ట్.
ఏపిలో ఎయిడెడ్ స్కూల్స్ 1988, ఎయిడెడ్ జూనియర్ కాలేజిలు 122 , ఎయిడెడ్ డిగ్రీ కాలేజిలు 137 ఉన్నాయి. ఈ విద్యాసంస్దల్లో లక్షల మంది చదువుతున్నారు. ఇప్పటి వరకూ ఇవి నామమాత్రపు ఫీజుతో నడుస్తున్నాయి. అందుకే ఇవి ప్రభుత్వ స్కూళ్లుగానే అందరూ భావిస్తారు. ఎయిడెడ్ కు.. ప్రభుత్వ స్కూళ్లకు పెద్ద తేడా ఉండేది కాదు. పైగా ప్రత్యేక యాజమాన్యాల కింద ఉండటంతో నిర్వహణ కూడా మెరుగ్గా ఉండేది. కానీ ఎయిడెడ్ స్కూళ్లలో విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయని ప్రభుత్వం సొంత భాష్యం చెబుతూ స్వాధీనానికి ప్రయత్నిస్తోంది. ఇక్కడే విద్యార్థులు రోడ్లపై పడే పరిస్థితి వస్తోంది.
ఎయిడెడ్ స్కూళ్లను మూసి వేస్తే దానికి తగ్గట్లుగా విద్యార్థులను ప్రభుత్వ స్కూళ్లలో చేర్పించే ప్రయత్నం చేయడం ప్రభుత్వ ప్రాథమిక కర్తవ్యం. కానీ అలాంటి పనులేమీ చేయడం లేదు. ఆ విద్యార్థుల బాధ్యత తమది కాదని.. స్కూళ్లను లాక్కోవడం వరకే తమ బాధ్యత అన్నట్లుగా వ్యవహరిస్తోంది. దీంతో విద్యార్థులు రోడ్డెక్కుతున్నారు. జీవోల్లో లేని.. .కోర్టులకు చెప్పని రహస్య, బెదిరిపుల పాలన వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్న అభిప్రాయం విద్యా రంగ నిపుణుల్లో వ్యక్తమవుతోంది.