అమరావతి ఏపీ ప్రజల రాజధాని. కానీ ఈ రాజధానిపై జరిగినన్ని కుట్రలు దేశంలో మరే రాజధానిపై జరిగి ఉండవు. ఎవరో చేసి ఉంటే ప్రజలంతా సంఘటితమై కాపాడుకునేవాళ్లు. కానీ సొంత రాజధానిపై కుట్ర చేసింది ప్రజలు నమ్మిన పాలకులే. రాజధానిగా అమరావతిని కొనసాగిస్తామని అధికారంలోకి వచ్చి మూడు ముక్కలాట ఆడి ..రాష్ట్రానికి లక్షల కోట్ల నష్టం చేశారు. అయితే అమరావతి ఇప్పుడు పురోగమిస్తోంది. రాక్షసుల బారి నుంచి బయటపడి ముందుకెళ్తోంది. రెండో దశ ల్యాండ్ పూలింగ్ ముంగిట నిలిచింది. రైతులు చూపించే అచంచలమైన నమ్మకమే అమరావతికి రక్షగా నిలవనుంది.
రెండో దశ పూలింగ్‌కు శనివారం నోటిఫికేషన్
రెండో దశ ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతోంది. రాజధాని అభివృద్ధి కోసం ఇప్పటికే 33 వేల ఎకరాలకు పైగా భూములిచ్చిన రైతుల త్యాగమే అమరావతికి పునాది కాగా, ఇప్పుడు రెండో విడతలో సేకరించబోయే 16,666 ఎకరాలు ఈ నగర రూపురేఖలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లనున్నాయి. పాలకుల మార్పుతో గతంలో ఎదురైన అడ్డంకులను పక్కన పెట్టి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ మీద ఉన్న నమ్మకంతోనే రైతులు మళ్లీ భూములిచ్చేందుకు ముందుకు వస్తున్నారు.
రైతుల నమ్మకానికి ప్రతీక
ఈ రెండో విడత భూసమీకరణ కేవలం భూమి సేకరణ మాత్రమే కాదు, ఇది ప్రభుత్వం , రైతుల మధ్య ఉన్న అచంచలమైన విశ్వాసానికి ప్రతీక. వైసీపీ హయాంలో ఐదేళ్ల స్తబ్దత తర్వాత, ఇప్పుడు అమరావతిలో పనులు శరవేగంగా జరుగుతుండటంతో రైతులు తమ భవిష్యత్తుపై ధీమాతో ఉన్నారు. తాము ఇచ్చే భూముల్లో అంతర్జాతీయ స్థాయి స్పోర్ట్స్ సిటీ, ఐటీ హబ్‌లు , మెగా ఇండస్ట్రియల్ కారిడార్లు వస్తాయని, తద్వారా తమ ప్రాంతం ఆర్థికంగా ఎంతో ఎత్తుకు ఎదుగుతుందని వారు నమ్ముతున్నారు.
రాజధాని మౌలిక సదుపాయాలకు కీలకమైన భూములు
ఈ దశలో సేకరించే భూములు రాజధాని మౌలిక సదుపాయాలకు వెన్నెముకగా నిలవనున్నాయి. ప్రధానంగా ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం, భారీ విద్యా సంస్థల ఏర్పాటు , క్వాంటం వ్యాలీ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు ఈ స్థలాల్లోనే రూపుదిద్దుకోనున్నాయి. అమరావతిని కేవలం కాంక్రీట్ జంగిల్‌గా కాకుండా, ఆధునిక సాంకేతికతతో కూడిన నాలెడ్జ్ హబ్‌గా మార్చేందుకు ఈ భూమి అత్యంత అవసరం. ప్రభుత్వ చిత్తశుద్ధి, రైతుల సహకారం కలిస్తేనే అమరావతి కన్న కలలు నిజమవుతాయని, ఈ రెండో విడత సమీకరణే దానికి ఆరంభమని అనుకోవచ్ు.
రైతులు చూపుతున్న ఈ సానుకూల స్పందనను ప్రభుత్వం కూడా అంతే గౌరవంగా స్వీకరిస్తోంది. భూములిచ్చిన ప్రతి రైతుకు న్యాయం చేస్తామని, వారి కుటుంబాలకు ఉపాధి, విద్య , వైద్య సౌకర్యాల్లో ప్రాధాన్యత కల్పిస్తామని ప్రభుత్వం భరోసా ఇస్తోంది. అమరావతి నిర్మాణం కేవలం ఒక నగరం కట్టడం కాదు, ఇది లక్షలాది మంది రైతుల ఆత్మగౌరవం , రాష్ట్ర ప్రగతికి నిదర్శనం. రైతుల నమ్మకమే రక్షగా, అమరావతి ప్రపంచంలోనే అగ్రస్థాయి రాజధానిగా మారుతుందని ప్రభుత్వం నమ్మకంగా ఉంది.
